Share News

Illegal Immigration: అక్రమ వలసదారులు ఇంటికే!

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:19 AM

చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులంతా కాస్త ఆలస్యంగానైనా తిరిగి స్వదేశానికి తరలివచ్చే పరిస్థితి నెలకొంది.

 Illegal Immigration: అక్రమ వలసదారులు ఇంటికే!

ట్రంప్‌ నిర్ణయానికి మోదీ మద్దతు

119 మందితో నేడు భారత్‌కు విమానం

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపే విషయంలో ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలకు ప్రధాని మోదీ మద్దతు పలికారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులంతా కాస్త ఆలస్యంగానైనా తిరిగి స్వదేశానికి తరలివచ్చే పరిస్థితి నెలకొంది. అమెరికాలో మొత్తం 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు అంచనా. ఇందులో సుమారు 7,25,000 మంది భారతీయులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్‌, పంజాబ్‌లోని కొందరు ఏజెంట్ల ద్వారా 2021-24 మధ్యలోనే దాదాపు 4,300 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇటీవల ప్రకటించింది.

ఏదేమైనా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 7,25,000 మంది భారతీయులంతా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క, తమ దేశంలో 2.5 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని అంటున్న ట్రంప్‌ ప్రభుత్వం దాదాపు 14 లక్షల మందికి ఇప్పటికే డిపోర్టేషన్‌ నోటీసులు కూడా పంపింది. చాలా మందిని స్వదేశాలకు తరలించింది. ఇందులో భాగంగా ఇటీవల 104 మంది అక్రమ వలసదారులను భారత్‌కు తిరిగి పంపింది. 119 మంది అక్రమ వలసదారులతో శనివారం మరో విమానం అమృత్‌సర్‌కు చేరుకోనుండగా.. ఆదివారం మరికొంతమందితో ఇంకో విమానం కూడా రాబోతుంది. అమెరికా భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపడం కొత్తేమీ కాదు. 2024లో బైడెన్‌ ప్రభుత్వం 1529 మంది భారతీయులను తమ దేశం నుంచి వెనక్కి పంపింది.


మోదీ ప్రకటనతో ఏం అవుతుందంటే...

అక్రమ వలసదారుల అంశంలో ట్రంప్‌ చర్యలకు మోదీ మద్దతు పలకడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆయా వ్యక్తుల పౌరసత్వ నిర్ధారణకు భారత ప్రభుత్వం కూడా అమెరికాకు సహకరిస్తుంది. ఈ సహకారం వల్ల అమెరికా,భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి రానివ్వడం వల్ల భారత ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశముంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:19 AM