Share News

Donald Trump: మరో 24గంటల్లో.. భారత్‌పై భారీగా సుంకాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:43 AM

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌ వెనక్కి తగ్గని నేపథ్యంలో మరింత భారీగా సుంకాలు విధిస్తానని

Donald Trump: మరో 24గంటల్లో.. భారత్‌పై భారీగా సుంకాలు

రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణం

  • భారత్‌ మంచి వాణిజ్య భాగస్వామి కాదు

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు

  • నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్‌కు ఉంది: రష్యా

  • ట్రంప్‌.. ‘దోస్త్‌ దోస్త్‌ నా రహా’!.. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ఎద్దేవా

  • మాస్కోలో పర్యటించనున్న అజిత్‌ దోవల్‌

న్యూయార్క్‌, ఆగస్టు 5: రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌ వెనక్కి తగ్గని నేపథ్యంలో మరింత భారీగా సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మంగళవారం న్యూయార్క్‌లో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘భారత్‌ అత్యధిక సుంకాలు వసూలు చేసే దేశం. అన్నిదేశాల కంటే కూడా ఎక్కువ. భారత్‌ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. వాళ్లు అమెరికాతో చాలా వ్యాపారం చేస్తారు. కానీ అధిక సుంకాల కారణంగా భారత్‌తో అమెరికా పెద్దగా వ్యాపారం చేయలేదు. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు విధించాం. వచ్చే 24 గంటల్లో ఈ సుంకాలను మరింత భారీగా పెంచబోతున్నాను. రష్యా నుంచి భారత్‌ చమురు కొంటుండటమే దీనికి కారణం. దీనితో ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యాకు అవసరమైన నిధులు అందుతున్నాయి. ఇది నాకు ఇష్టం లేదు..’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. నిజానికి భారత్‌ తమ టారి్‌ఫలను సున్నాకు తగ్గించినా కూడా సరిపోదని.. వారు చమురు విషయంలో చేస్తున్న పని సరికాదని వ్యాఖ్యానించారు. రష్యా చమురు కొనుగోళ్ల అంశంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ భారత్‌ ఎండగట్టిన తర్వాత కూడా ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్‌కు ఉంది

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌పై అమెరికా చేస్తున్న ఒత్తిడి సరికాదని, నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్‌కు ఉందని రష్యా స్పష్టం చేసింది. ‘‘సార్వభౌమ దేశాలకు వారి వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉంటుంది. ఆర్థికపరంగా, వాణిజ్యపరంగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది..’’ అని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా పెత్తనాన్ని చూపుకొనేందుకు దక్షిణ ప్రాంత దేశాలపై వలసవాద విధానాలు రుద్దుతోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మండిపడ్డారు.

రష్యాలో పర్యటించనున్న దోవల్‌

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రష్యాలో పర్యటించనున్నట్టు తెలిసింది. ఇరు దేశాల మధ్య ఇంధన, రక్షణ బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరపనున్నట్టు సమాచారం. ఈ పర్యటన ముందే ఖరారైనా... రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌పై అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్‌తో ‘దోస్త్‌ దోస్త్‌ నా రహా’!

భారత్‌పై అదనపు సుంకాలు వేస్తానన్న ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో.. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. ట్రంప్‌, మోదీ స్నేహం ముగిసిపోయిందని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రఖ్యాత హిందీ పాటను ప్రస్తావిసూ.. ‘‘దోస్త్‌ దోస్త్‌ నా రహా, ప్యార్‌ ప్యార్‌ నా రహా, ట్రంప్‌ తుమే తేరా ఐత్‌బార్‌ నా రహా (నా స్నేహితుడు ఇప్పుడు స్నేహితుడు కాదు. నా ప్రేమ ఇప్పుడు ప్రేమ కాదు. ట్రంప్‌ నీ మీద మా నమ్మకం పోయింది). మంచి మిత్రులుగా చెప్పుకొనే మోదీ, ట్రంప్‌ల మధ్య స్నేహం పూర్తిగా కుప్పకూలిపోయినట్టే..’’ అని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ మనకు పాకిస్థాన్‌, చైనాలతో సమస్య ఉందని, కానీ ఇలా అమెరికాతో సంబంధాలు క్షీణిస్తాయని అనుకోలేదని చెప్పారు.

Updated Date - Aug 06 , 2025 | 05:43 AM