Share News

Imran Khan: ఆయనకు ఏమైనా జరిగితే పాక్‌లో కల్లోలం: ఇమ్రాన్ ఖాన్ సోదరి

ABN , Publish Date - Nov 29 , 2025 | 07:58 AM

ఇమ్రాన్ ఖాన్‌కు హాని జరిగితే పాక్‌ అల్లకల్లోలంగా మారుతుందని ఆయన సోదరి నోరీన్ నియాజీ హెచ్చరించారు. పాక్ ప్రజల మద్దతు ఇమ్రాన్‌కు ఉందని అన్నారు. ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.

Imran Khan: ఆయనకు ఏమైనా జరిగితే పాక్‌లో కల్లోలం: ఇమ్రాన్ ఖాన్ సోదరి
Noreen Niazi

ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో ఉందని ఆయన సోదరి నోరీన్ నియాజీ అన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైనా జరిగితే పాక్ అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. భారత్‌లో ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాజాగా ఈ కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. ఆయన కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని, ఎలాంటి హాని తలపెట్టినా సహించరని చెప్పారు. ‘ఇమ్రాన్ ఖాన్‌కు చిన్నపాటి హాని తలపెట్టేందుకు కూడా వారు సాహసించకూడదు. ఆ గీత దాటకూడదు’ అని హెచ్చరించారు (Noreen Niazi Warns of Chaos in Pak).

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వదంతులను కావాలనే వ్యాప్తి చేస్తున్నారని నోరీన్ ఆరోపించారు. ఇమ్రాన్ మద్దతుదారులు, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలన్నదే వారి లక్ష్యమని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఒంటరిగా సెల్‌లో ఖైదు చేయడంపై కూడా నోరీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలు నిబంధనల ప్రకారం, నాలుగు రోజులకు మించి ఖైదీలు ఇలా ఒంటరిగా ఉండేలా చేయడం నేరమని అన్నారు. కానీ నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను ఒంటరిగా ఉండేలా ఖైదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ను మానసిక, శారీరక వేధింపులకు గురి చేయడమే వారి లక్ష్యమని మండిపడ్డారు. కుటుంబసభ్యులను కూడా కలవనీయడం లేదని, ఇమ్రాన్ సందేశాలను ప్రజలకు చేరవేస్తామనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని అన్నారు. పాక్‌లో వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని అన్నారు. కానీ తాము మాత్రం న్యాయం వైపు నిలబడతామని చెప్పారు.


జైల్లోని ఇమ్రాన్ ఖాన్‌ను కుటుంబసభ్యులు వారానికి రెండు సార్లు కలిసేలా అనుమతించాలని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. అయినా జైలు అధికారులు అడ్డంకులు సృష్టిస్తుండటంతో ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి అలీమా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు అడియాలా జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి, ఉగ్రవాదం తదితర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టులో జైలు పాలయ్యారు. అంతకుముందు ఏడాది అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

యూకేలో 80 శాతం మేర తగ్గిన వలసలు.. పెద్ద సంఖ్యలో బ్రిటన్‌ను వీడిన భారతీయులు

కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్

Read Latest International And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 09:58 AM