UK Net Migration: యూకేలో 80 శాతం మేర తగ్గిన వలసలు.. పెద్ద సంఖ్యలో బ్రిటన్‌ను వీడిన భారతీయులు
ABN , Publish Date - Nov 28 , 2025 | 07:42 PM
యూకే ప్రభుత్వ కఠిన నిబంధనల కారణంగా దేశంలోకి నికర వలసలు భారీగా తగ్గాయి. 2025 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో నికరంగా వలసొచ్చిన వారి సంఖ్య కేవలం 204,000. 2023తో పోలిస్తే ఇది ఏకంగా 80 శాతం తక్కువ
ఇంటర్నెట్ డెస్క్: యూకేలో వలసలు భారీగా తగ్గిపోయాయి. 2023తో పోలిస్తే నికర వలసల సంఖ్య ఏకంగా 80 శాతం మేర పడిపోయింది. ప్రభుత్వ గణాంకాల, 2025 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో నికరంగా 204,000 మంది విదేశీయులు విద్య, ఉపాధి కోసం యూకేకు వెళ్లారు. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 80 శాతం తక్కువ.
ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఈ కాలంలో యూకేను వీడిన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. మొత్తం 74 వేల మంది యూకేను వీడారు. వీరిలో 45 వేల మంది విద్యార్థులు, 22 వేల మంది ఉద్యోగులు, ఇతర కేటగిరీలకు చెందిన 7 వేల మంది ఉన్నారు. యూకేను వీడిన ఈయూ-యేతర దేశాల వారిలో భారతీయులే సంఖ్యాపరంగా టాప్‌లో ఉన్నారు. అయితే, యూకే వీసా పొందిన భారతీయులు గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. మొత్తం 90 వేల మందికి స్టడీ వీసాలు, 46 వేల మందికి వర్క్ వీసాలు లభించాయి. ఇక యూకేను వీడిన వారిలో భారతీయుల తరువాతి స్థానంలో చైనా దేశస్థులు ఉన్నారు. మొత్తం 42 వేల మంది యూకేను వీడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
వలసల విషయంలో యూకే కఠిన నిబంధనలు విధించడంతో దేశాన్ని వీడుతున్న వారి సంఖ్య పెరిగింది. చదువు తరువాత వర్క్ వీసా లభించే గ్రాడ్యుయేట్ వీసా రూట్‌పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది నుంచి నిబంధనలు మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో నివాసాలు, సేవల కొరత పెరుగుతుండటంతో వలసలను కట్టడి చేయాల్సి వస్తోందని అక్కడి హోం సెక్రెటరీ షబానా మహమూద్ అన్నారు.
అయితే, అంతర్జాతీయ టాలెంట్ లేకపోతే వ్యాపారాలకు నష్టం జరిగే అవకాశం ఉందని లండన్ వ్యాపారస్థులు చెబుతున్నారు. దేశంలో నిపుణుల కొరతలో 93 శాతం విదేశీయుల వల్ల తీరుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్.. కృతజ్ఞత లేదని ఆగ్రహం
Read Latest International And Telugu News