Share News

Trade Growth: పరస్పర పన్నుతో నష్టమే!

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:28 AM

అసలు రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏ స్థాయిలో ఉందో ముందు తెలుసుకోవటం అవసరం. 2023లో సరుకులు, సేవలకు సంబంధించి అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యం 19,008 కోట్ల డాలర్లుగా నమోదైంది.

Trade Growth: పరస్పర పన్నుతో నష్టమే!

అమెరికా-భారత్‌ వాణిజ్యంలో ఇప్పటి వరకూ భారత్‌దే పైచేయి

ఎగుమతులెక్కువ, దిగుమతులు తక్కువ

అమెరికా కంటే మన సుంకాలు అధికం

పరస్పర పన్నుతో పరిస్థితి మారే చాన్స్‌

ఆటోమొబైల్స్‌, ఇంధనం, రక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం

(సెంట్రల్‌డెస్క్‌)

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50,000 కోట్ల డాలర్లకు పెంచాలని అమెరికా, భారత్‌ నిర్ణయించిన నేపథ్యంలో ఆ భారీ నిర్ణయం భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపనుంది అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నిర్ణయం అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, అసలు రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏ స్థాయిలో ఉందో ముందు తెలుసుకోవటం అవసరం. 2023లో సరుకులు, సేవలకు సంబంధించి అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యం 19,008 కోట్ల డాలర్లుగా నమోదైంది. దీంట్లో సరుకుల వాటా 12,389 కోట్ల డాలర్లు కాగా, సేవల వాటా 6,619 కోట్ల డాలర్లు. ఆ ఏడాది అమెరికాకు భారత్‌ నుంచి ఎగుమతి అయిన సరుకుల విలువ 8,377 కోట్ల డాలర్లు, దిగుమతుల విలువ 4,012 కోట్ల డాలర్లు. సేవల విషయానికొస్తే.. ఎగుమతుల విలువ 3,633 కోట్ల డాలర్లు. దిగుమతులు 2,986 కోట్ల డాలర్లు. సరుకులైనా, సేవలైనా భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి. దిగుమతులు తక్కువ. ఇది భారత్‌కు అనుకూలమైన పరిస్థితి. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఇరుదేశాల వాణిజ్యం 13,000 కోట్ల డాలర్లకు పెరగగా.. 4500 కోట్ల డాలర్ల మేర భారత్‌కే అనుకూలంగా వాణిజ్యలోటు (ట్రేడ్‌గ్యాప్‌) ఉంది. అయితే, ప్రస్తుతం ఈ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం, ట్రంప్‌ ప్రకటించిన పరస్పర పన్నులే (రెసిప్రోకల్‌ ట్యాక్స్‌).

ujik;.jpg

మనం విధించే పన్నే అధికం

ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై (దిగుమతుల మీద) భారత్‌ సగటున 9.5 శాతం పన్ను విధిస్తుంటే.. భారత్‌ ఉత్పత్తుల మీద అమెరికా సగటున 3 శాతమే విధిస్తోంది. అంటే, దాదాపు ఆరున్నర శాతం పన్ను భారత్‌ అధికంగా విధిస్తోంది. పరస్పర పన్ను విధానం అమలులోకి వస్తే.. ఇకపై ఈ రెండూ సమానం అవుతాయి. ఇది రెండు రకాలు.. భారత ఉత్పత్తుల మీద అమెరికా పన్ను భారం పెరగవచ్చు లేదా అమెరికా ఉత్పత్తుల మీద భారత్‌ సుంకాలు తగ్గవచ్చు. దీని ప్రభావం భారత్‌కు చెందిన ఆటోమొబైల్‌, టెక్స్‌టైల్‌ పరిశ్రమల మీద తీవ్రంగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, అమెరికా ఆటోమొబైల్స్‌ మీద వాటి ఇంజిన్‌ సామర్థ్యం, విడిభాగాలా లేక పూర్తి వాహనమా అన్న ప్రాతిపదికల ఆధారంగా భారత్‌ 205 శాతం నుంచి 50 శాతం వరకూ పన్ను విధిస్తోంది. అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్‌సన్‌ బైకుల మీద భారత్‌ భారీస్థాయిలో పన్ను వేస్తోన్న అంశాన్ని ట్రంప్‌ గతంలో కూడా ఓసారి లేవనెత్తారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రీమియం బైకుల మీద సుంకాలను కొంత తగ్గించారు. పరస్పర పన్ను విధానం అమలైతే అమెరికా వాహనరంగం దిగుమతుల మీద పన్నును భారత్‌ మరింత తగ్గించాల్సి ఉంటుంది. రక్షణ, ఇంధన రంగాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.


మొత్తమ్మీద 30కిపైగా ఉత్పత్తులపై భారత్‌ దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. ‘రానున్న రోజుల్లో అమెరికా చమురు, సహజవాయువులను భారత్‌ మరింత అధికంగా దిగుమతి చేసుకునే విధంగా మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనివల్ల అమెరికా వాణిజ్యలోటు గణనీయంగా తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.

అమెరికా సుంకాలు పెంచే అవకాశం

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, ట్రంప్‌ చెబుతున్న పరస్పర పన్నుల నేపథ్యంలో అమెరికా కూడా భారత ఉత్పత్తులపై సుంకాలను పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌ నుంచి తమ దేశానికి ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్‌, ఔషధాలు, ముత్యాలు, ఆభరణాలు, స్టీలు, అల్యూమినియం ఉత్పత్తుల మీద అమెరికా సుంకాలు పెంచే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 04:48 AM