Sebastien Lecornu Resigns: మంత్రివర్గాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:29 PM
ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ ముదిరింది. ఇటీవల నియమితుడైన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను (Sebastien Lecornu) తన మంత్రి వర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు రాజీనామా చేశారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఫ్రాన్స్ రాజకీయాలు మరోసారి సంక్షోభంగా మారాయి. కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకార్ను (Sebastien Lecornu) తన మంత్రివర్గాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ఏడాది కాలంలో ఐదో ప్రధానమంత్రిని నియమించే సవాల్ ఎదురైంది. గత నెలలో ఫ్రాన్సిస్ బేరో విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో లెకార్ను ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. సెబాస్టియన్ కేవలం 27 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. దీంతో ఆయన ఫ్రాన్స్ చరిత్రలో అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.
రాజీనామా వెనుక కారణాలు
లెకార్ను రాజీనామాకు కచ్చితమైన కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఆయన మంత్రివర్గ ఎంపికపై వచ్చిన విమర్శలు కారణమని తెలుస్తోంది. ఆయన కొత్త మంత్రివర్గంలో 11 మంది మంత్రులు తమ పదవులను నిలబెట్టుకున్నారు. ఇందులో హోంమంత్రి బ్రూనో రిటైల్లో, విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. దీంతోపాటు మాజీ రక్షణ మంత్రి బ్రూనో లీ మైర్ వంటి వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ ఎంపికలు పాత మంత్రివర్గానికి దాదాపు సమానంగా ఉండటంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
రాజకీయ సంక్షోభం
గత ఏడాది కాలంగా ఫ్రాన్స్.. రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఏ పార్టీ లేదా కూటమికి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రధానమంత్రులు మైనారిటీ ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. బేరో ఆయనకు ముందు మిచెల్ బార్నియర్‌లు కూడా విశ్వాస పరీక్షల్లో ఓడిపోయారు. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్టీల మద్దతు లభించకపోవడంతో ఈ పరిస్థితి వస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
భవిష్యత్తు ఏంటి?
లెకార్ను రాజీనామాతో ఫ్రాన్స్ రాజకీయాలు మరింత అనిశ్చితిలో పడ్డాయి. బార్డెల్లా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, కొత్త ఎన్నికలు ప్రకటించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను కోరారు. లెకార్ను తన రాజీనామా నిర్ణయం గురించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో మాక్రాన్ ఎవరిని తదుపరి ప్రధానమంత్రిగా నియమిస్తారనే విషయాలు తేలాల్సి ఉంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి