Share News

Trump-Colbert: ప్రముఖ అమెరికన్ టీవీ షోకు ముగింపు.. తెగ మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jul 19 , 2025 | 07:56 PM

అమెరికాలో ప్రముఖ టీవీ కార్యక్రమం ది లేట్ షో ముగింపుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆ షో యాంకర్ ఉద్యోగం పోవడం అద్భుతమంటూ కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం అమెరికాలో పెద్ద చర్చకు దారి తీసింది.

Trump-Colbert: ప్రముఖ అమెరికన్ టీవీ షోకు ముగింపు.. తెగ మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్
Trump Stephen Colbert firing

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ప్రముఖ టీవీ షో యాంకర్ స్టీవెన్ కోల్‌బేర్ ఉద్యోగం పోయిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ సంబరపడ్డారు. ఇది తనకు చాలా నచ్చిందని పోస్టు పెట్టారు. ‘కోల్‌బేర్‌ను తీసేశారట.. ఇది అద్భుతం.. నాకు చాలా నచ్చింది. అతడికి అసలు టాలెంటే లేదు. అతడి రేటింగ్స్ కూడా చాలా తక్కువ’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘త్వరలో జిమ్మీ కిమ్మెల్‌ను కూడా తీసేస్తారట. కోల్‌బేర్ కంటే ఇతడు మరింత దారుణం’ అంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచారు.

సీబీఎస్ నెట్వర్క్‌‌లో ప్రసారమయ్యే ‘ది లేట్ షో’కు స్టీవెన్ కొన్నేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ ప్రభుత్వ విధానాలపై తన షోలో స్టీవెన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తన హాస్య చతురతతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను ఎండ గడుతున్నారు. ట్రంప్‌కు రాజకీయ ప్రత్యర్థులైన డెమోక్రాట్‌లకు గొంతుకగా నిలుస్తున్నారు.


ఇదిలా ఉంటే, సీబీఎస్‌ నెట్‌వర్క్ మాతృ సంస్థ పారామౌంట్ గ్లోబల్, మరో మీడియా సంస్థ స్కై డ్యాన్స్ మధ్య విలీనంపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో టీవీ షోకు సంబంధించి ట్రంప్ వేసిన కేసులో సెటిల్మెంట్ కింద 16 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు పారామౌంట్ గ్లోబల్ అంగీకరించింది. ఈ విలీనానికి ప్రభుత్వ పరంగా అడ్డంకులు లేకుండా పారామౌంట్ గ్లోబల్ సెటిల్మెంట్‌కు అంగీకరించిందన్న వ్యాఖ్యలు అక్కడి మీడియాలో కనిపించాయి. ఇక ఈ ఉదంతంపై స్టీవెన్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ ఒత్తిళ్ల మధ్య జరిగిన సెటిల్మెంట్ అంటూ మండిపడ్డారు.


ఈ నేపథ్యంలో లేట్‌ షోను నిలిపివేస్తున్నట్టు సీబీఎస్ నెట్‌వర్క్ ఇటీవల హఠాత్తుగా ప్రకటించింది. ఆర్థిక అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. లేట్ షోల ఫార్మాట్‌లో ప్రస్తుతం పలు సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొంది. అయితే, స్టీవెన్ నిర్వహిస్తున్న షో రేటింగ్స్, కంటెంట్ వంటివేవీ ఈ నిర్ణయానికి కారణం కాదని స్పష్టం చేసింది. ఇక షోను నిలిపివేయడంపై స్టీవెన్ కోల్‌బేర్ కూడా స్పందించారు. ఏకంగా షో మొత్తానికి ముగింపు పలికేందుకు సీబీఎస్ నెట్‌వర్క్ నిర్ణయించిందని వివరణ ఇచ్చారు. తనను ఎవరూ తొలగించలేదని కూడా స్పష్టం చేశారు. ఈ ఉదంతం అమెరికా మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి:

పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్

ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 09:45 PM