Share News

Trump Leg Swelling: ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ

ABN , Publish Date - Jul 18 , 2025 | 08:10 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ల వాపు సమస్యపై శ్వేత సౌధం తాజాగా స్పందించింది. సిరల్లో సమస్య కారణంగా కాళ్ల వాపు తలెత్తిందని పేర్కొంది. ఇది వృద్ధుల్లో సాధారణంగా కనిపించే సమస్యేనని క్లారిటీ ఇచ్చింది.

Trump Leg Swelling: ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ
Trump vein condition

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్లల్లో వాపు సమస్యపై శ్వేత సౌధం తాజాగా స్పందించింది. ఇది సిరల్లో కనిపించే సాధారణ సమస్య అని, 70 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా ఆర్టీరియల్ సమస్యలు (రక్తం గడ్డకట్టడం) వంటివి ఉన్నాయనేందుకు ఆధారాలేవీ లేవని తెలిపింది. గుండె, కిడ్నీ, ఇతర సమస్యలు కూడా ఏమీ లేనట్టు పరీక్షల్లో తేలిందని వెల్లడించింది. ప్రస్తుతం ట్రంప్‌కు కాళ్ల వాపు కారణంగా ఎలాంటి అసౌకర్యం లేదని కూడా వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ వైద్యుడు రాసిన లేఖను శ్వేత సౌధం అధికారి మీడియాకు వెల్లడించారు. ట్రంప్ చేతి వెనక వైపు, వీపుపై కాస్త కందిపోయినట్టు ఉందని కూడా ఆయన వైద్యుడు తెలిపారు. అయితే, ఆస్పిరిన్ వంటి ఔషధాలు వాడేటప్పుడు ఇలాంటివి తలెత్తుతాయని అన్నారు.


వైద్య వర్గాలు చెప్పేదాని ప్రకారం, క్రానిక్ వీసన్ ఇన్‌సఫిషియన్సీ అనే సమస్య కారణంగా ట్రంప్ కాళ్లల్లో వాపు కనిపించింది. సిరల్లో రక్త సరఫరా సాధారణ స్థాయిలో జరగనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. సిరల్లోని కవాటాలు సరిగా పనిచేయకపోతే రక్తం గుండెకు పూర్తిస్థాయిలో చేరదు. దీంతో, కాళ్లల్లో పేరుకుపోయే రక్తంతో వాపు కనిపిస్తుంది. వృద్ధుల్లో సాధారణంగా కనిపించే సమస్యే అయినా ఒక్కోసారి పరిస్థితి జటిలమయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే, తొలి దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వ్యాధి ముదిరే అవకాశాలు తక్కువ. వ్యాయామం చేస్తే కూడా ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సార్లు శస్త్ర చికిత్స కూడా చేయాల్సి రావొచ్చు.


ఇవి కూడా చదవండి:

రష్యా, చైనాతో కూటమి పునరుద్ధరణకు ప్రయత్నాలు.. స్పందించిన భారత్

ఓటు హక్కు వయోపరిమితిని తగ్గించేందుకు సిద్ధమైన యూకే.. ఇక 16 ఏళ్లకే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 08:17 AM