Share News

China Rocket Crash: నివాస సముదాయాలకు సమీపంలో కూలిన రాకెట్ ఇంజెన్.. చైనాలో కలకలం

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:03 PM

నివాస సముదాయాలకు సమీపంలో చైనా రాకెట్ కూలిపోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

China Rocket Crash: నివాస సముదాయాలకు సమీపంలో కూలిన రాకెట్ ఇంజెన్.. చైనాలో కలకలం
Chinese rocket crash

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 2డీ రాకెట్‌లో కొంత భాగం జనావాసాలకు సమీపంలో కూలిపోవడంతో కలకలం రేగింది. కింఘాయ్ ప్రావిన్స్‌లోని గినాన్ కౌంటీలో రాకెట్ తొలి దశ ఇంజెన్స్ ఉన్న భాగం కూలింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి (Rocket Crashes in China).

షియాన్-31 ఆప్టికల్ ఇమేజింగ్‌ శాటిలైట్‌ను చైనా అక్టోబర్ 13న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జియుకాన్ శాటిలైట్ సెంటర్‌ ‌నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ సాయంతో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్ష ప్రయోగాల కోసం ఎంతో కాలంగా చైనా ఈ రాకెట్‌ను వినియోగిస్తోంది. ఇది 599వ ప్రయోగం. ఇది రెండు స్టేజీలున్న రాకెట్. తొలి దశలో ఒక తరహా ఇంజెన్స్‌ను, రెండో స్టేజ్‌లో మరో రకం ఇంజెన్స్ వినియోగిస్తారు (Long March 2D Rocket First Stage Crash).


శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తొలి దశ ఇంజెన్‌లు ఉన్న రాకెట్ భాగం అదుపు తప్పి నివాస సముదాయాలకు సమీపంలో కూలిపోయింది. నిప్పులు చిమ్ముతూ నేలవైపు దూసుకొచ్చి నేలను తాకి అగ్నిగోళంలా విస్ఫోటనం చెందింది. ఆ వెంటనే దట్టమైన పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. రాకెట్ తొలి దశలో వినియోగించిన హైపర్‌గోలిక్ ఇంధనంతో ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ముందస్తు హెచ్చరికలు ఏవీ జారీ చేయకుండా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నివాస ప్రాంతాలకు సమీపంలో గతంలోనూ ఇలా రాకెట్లు కూలడంపై చైనా విమర్శలు ఎదుర్కొంది.


ఇవి కూడా చదవండి:

అమెరికాలో దీపావళి వేడుకలు.. సెలవులిచ్చిన రాష్ట్రాలు ఇవే

ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. అత్యంత విలువైన నగలతో దొంగలు పరార్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2025 | 10:08 PM