Share News

Artificial Blood:కృత్రిమ రక్తం.. ఎవరికైనా వాడొచ్చు..

ABN , Publish Date - Jun 09 , 2025 | 05:19 AM

ప్రాణదానం చేయడమే! కానీ స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతల కొరత కారణంగాఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ కలిగినవారు ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సివచ్చినా..

Artificial Blood:కృత్రిమ రక్తం.. ఎవరికైనా వాడొచ్చు..

అభివృద్ధి చేసిన జపాన్‌ శాస్త్రవేత్తలు

సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండేళ్లపాటు

నిల్వ చేసే చాన్స్‌.. ఫ్రీజర్‌లో అయితే ఐదేళ్లు!

ఏ, బీ, ఓ.. అన్ని గ్రూపులవారికీ ఎక్కించొచ్చు

ప్రయోగాల్లో సత్ఫలితాలు 2030 నాటికి అందుబాటులోకి..

టోక్యో, జూన్‌ 8: రక్త దానం అంటే.. ప్రాణదానం చేయడమే! కానీ స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతల కొరత కారణంగాఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ కలిగినవారు ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సివచ్చినా.. వారి బ్లడ్‌గ్రూ్‌పతో సరిపోలే రక్తం దొరక్క కన్నుమూస్తున్నారు!! ఈ క్రమంలోనే.. ఏ గ్రూపువారికైనా ఎక్కించగల కృత్రిమ రక్తాన్ని జపాన్‌లోని నారా మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. సాధారణంగా.. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని 42 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ గడువు దాటితే ఆ రక్తం పనికరాదు. కానీ, అందులో ఉన్న హిమోగ్లోబిన్‌ను వాడుకునే వీలుంటుంది. అలా సేకరించే హిమోగ్లోబిన్‌ను లిపిడ్‌ షెల్స్‌లో ఉంచడం ద్వారా ఏ గ్రూపూ లేని ఎర్ర రక్త కణాలను తయారుచేసే విధానాన్ని వారు రూపొందించారు. ఈ విధానంలో తయారుచేసిన రక్తాన్ని ఎలాంటి పరీక్షా అక్కర్లేకుండా నేరుగా బాధితులకు ఎక్కించవచ్చు. మామూలుగా అయితే..


దాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన ప్రొటోకాల్స్‌ ఉంటాయి. ఆ రక్తాన్ని 1 నుంచి 6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. కానీ.. ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే రెండేళ్లపాటు ఏ ఇబ్బందీ లేకుండా నిల్వ ఉంచవచ్చని, అదే ఫ్రిజ్‌లో పెడితే ఏకంగా ఐదేళ్లపాటు నిల్వ చేయొచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. కాగా.. 2022 నుంచి ఈ రక్తంపై ట్రయల్స్‌ ప్రారంభించారు. తొలి దశ పరీక్షల్లో భాగంగా 20 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుష వలంటీర్లకు ఇంట్రావీనస్‌ పద్ధతిలో ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కించారు. కొద్దిమొత్తం రక్తంతో ప్రారంభించి.. కొంచెం కొంచెంగా పెంచుకుంటూ 100 మిల్లీలీటర్ల దాకా ఎక్కించారు. వలంటీర్లలో కొద్దిమందికి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించాయి తప్ప.. వారి రక్తపోటులో ఎలాంటి తేడా రాలేదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సకాయ్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి మలిదశ ట్రయల్స్‌ మొదలుపెట్టి.. వలంటీర్లకు 100 మిల్లీలీటర్ల నుంచి 400 మిల్లీలీటర్ల దాకా రక్తాన్ని ఎక్కించి చూశారు. అయితే.. రక్తమార్పిడి అనేది కోట్ల మంది ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ ట్రయల్స్‌ను 2030 దాకా కొనసాగించి, కృత్రిమ రక్తం పూర్తిగా సురక్షితం అని నిర్ధారించుకున్నాకే అందరికీ అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు.. జపాన్‌కే చెందిన చువో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తెరుయూకి కొమత్సు కూడా ఇదే తరహా ప్రయోగాలు చేస్తున్నారు. శరీరంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేసే కృత్రిమ ప్రాణవాయు వాహకాలను తయారుచేసే పనిలో ఆయన ఉన్నారు. ఆల్బుమిన్‌లో పొదిగిన హిమోగ్లోబిన్‌ను ఉపయోగించి.. రక్తపోటును సమస్థితికి తీసుకొచ్చే అవకాశాలపైన, మెదడులో రక్తస్రావం, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్సపైన ఆయన దృష్టి సారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 05:19 AM