Bilawal Bhutto: భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకున్న భుట్టో
ABN , Publish Date - May 01 , 2025 | 11:25 AM
పాక్ ప్రజల మనోభావాలను తెలియపరిచే క్రమంలోనే సింధూ నదిలో రక్తం పారుతుందంటూ వ్యాఖ్యానించానని పాక్ నేత బిలావల్ భుట్టో తాజాగా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సింధూ నదిలో రక్తం పారుతుందంటూ భారత్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ప్రధాని బిలావల్ భుట్టో జర్దారీ తాజాగా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందం నిలుపుదల తరువాత పాక్ ప్రజల మనోభావాలను తెలియజెప్పేందుకే అలా అన్నానని చెప్పారు. బీబీసీతో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
సింధూ నదిలో రక్తం పారుతుందంటూ చేసిన కామెంట్స్ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని బీబీసీ ఇంటర్వ్యూయెర్ అభిప్రాయపడ్డారు. దీనిపై బిలావల్ భుట్టో స్పందిస్తూ.. ‘‘ఆ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించాక చేసిన సహజ ప్రతిస్పందన కాదు. ప్రజల అభిప్రాయం ప్రతిఫలించే క్రమంలో ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి యుద్ధం సమయంలో రక్తం చిందించక తప్పదని అందరికీ తెలిసిందే’’ అని అన్నారు.
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తే యుద్ధ చర్యగా పరిగణించాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోందని భుట్టో గుర్తు చేశారు. ఇండియాకు నీరు నిలిపివేసేందుకు పాక్ వద్ద నదులేమీ లేవని అన్నారు.
సరిహద్దు వెంబడి కాల్పుల ఉల్లంఘనలపై కూడా భుట్టో స్పందించారు. ‘‘వివాదాస్పద కాశ్మీర్‌పై అలాంటి దాడి చేయడంతో మాకు వచ్చే లాభం ఏముంది? భారత్ కాల్పులకు తెగబడటంతోనే మేము ప్రతిస్పందించాల్సి వస్తోంది’’ అని అన్నారు.
పహల్గాం దాడి తరువాత భారత్ పాక్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాక్ నీటి అవసరాలకు కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. పాక్ 80 శాతం నీటి అవసరాలకు సింధూ, దాని ఉపనదులు కీలకం. దీంతో, పాక్ నేతలు షాక్‌కు గురయ్యారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బిలావల్ మాట్లాడుతూ ‘‘సింధూ నదిలో మాకు రావాల్సిన నీరు ఆగిపోతే వారి రక్తం పారుతుంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలానికి దారి తీసింది.
సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకునేందుకు పాక్, భారత్ మధ్య 1960 సెప్టెంబర్‌లో ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రావీ, బియాస్, సట్లజ్ నదులపై హక్కులు భారత్‌కు సింధూ, ఝెలమ్, ఛినాబ్ నదులపై హక్కులు పాక్‌కు దఖలు పడ్డాయి.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..
ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
Read More Latest Telugu News and International News