Share News

Accidental Firing Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు బలి..

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:06 PM

బంగ్లాదేశ్‌లో 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకితో కాల్చి చంపేశాడు. అయితే, ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పటం గమనార్హం. దీపు చంద్రదాస్ హత్యకు గురైన మైమెన్‌సింగ్‌లోనే ఈ దారుణం జరిగింది.

Accidental Firing Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు బలి..
Accidental Firing Bangladesh

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండలు ఆగటం లేదు. తరచుగా ఏదో ఒక ఘటనలో హిందువులు బలి అవుతూనే ఉన్నారు. డిసెంబర్ 16వ తేదీన మైమెన్‌సింగ్‌లో దీపు చంద్రదాస్ దారుణ హత్యకు గురయ్యాడు. మతోన్మాదులు ఆయనను దారుణంగా కొట్టి, కాల్చి చంపేశారు. దైవ దూషణ చేశాడంటూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే, దీపు చంద్రదాస్ దైవ దూషణ చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటం గమనార్హం. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే మరో సంఘటన చోటుచేసుకుంది.


రాజ్‌భరీలోని హోసయ్‌దంగ గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమ్రిత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపేశారు. దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. తాజాగా, 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకితో కాల్చి చంపేశాడు. అయితే, ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పటం గమనార్హం. దీపు చంద్రదాస్ హత్యకు గురైన మైమెన్‌సింగ్‌లోనే ఈ దారుణం జరిగింది. అది కూడా ఓ బట్టల ఫ్యాక్టరీలో ఈ ఘోరం జరిగింది.


సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సైల్‌హెట్ సదర్ కాదిర్‌పురకు చెందిన భజేంద్ర బిశ్వాస్ మైమెన్‌సింగ్‌లోని ఓ బట్టల ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఉన్నాడు. అదే బట్టల ఫ్యాక్టరీలో నోమన్ మియా అనే 22 ఏళ్ల యువకుడు కూడా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. డ్యూటీ సందర్బంగా ఇద్దరూ ఓ చోట కూర్చుని ఉండగా.. నోమన్ మియా చేతిలోని తుపాకీ యాక్సిడెంటల్‌గా పేలింది. బుల్లెట్ బిశ్వాస్ ఎడమ తొడలోకి దూసుకెళ్లింది. దీంతో బిశ్వాస్‌కు తీవ్ర గాయమై బాగా రక్తం పోయింది. తోటి సెక్యూరిటీ గార్డులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నోమాన్ మియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కోనసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Dec 30 , 2025 | 05:13 PM