Australia Brave Man: ఆస్ట్రేలియా బీచ్ కాల్పుల దుండగుడ్ని ప్రాణాలొడ్డి పట్టుకున్న ధీశాలి..
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:05 PM
హనుక పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని జ్యూయిష్ కమ్యూనిటీ సిడ్నీలోని ప్రసిద్ధ బాండి బీచ్‌లో పండుగ జరుపుకుంటున్నారు. ఒక్కసారిగా ఇద్దరు సాయుధులు వారిని పిట్టల్ని కాల్చినట్టు తుపాకీలతో కాల్చుతున్నారు. అయితే, ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి..
సిడ్నీ, డిసెంబర్ 14: ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బాండి బీచ్‌లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడిలో ఒక సామాన్యుడు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు. హనుకా పండుగ సందర్భంగా జరుగుతున్న జ్యూయిష్ కమ్యూనిటీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి 12 మందిని చంపేశారు. అయితే, ఒక మధ్యవయస్కుడైన ఆస్ట్రేలియన్ వ్యక్తి తన ప్రాణాలను పణంగాపెట్టి ఒక ఉగ్రవాదిని పట్టుకుని తుపాకీని బలవంతంగా లాక్కొని, అనేకమంది ప్రాణాలను కాపాడాడు.
దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో ఈ ధీశాలి ధైర్యసాహసాలు కళ్లకుకట్టినట్టు కనిపించాయి. బీచ్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఉగ్రవాది కాల్పులు జరుపుతున్నప్పుడు, తెలుపు షర్ట్ ధరించిన ఆ వ్యక్తి ఆకస్మికంగా దాడి చేసి, ఉగ్రవాదిని అడ్డగించి షాట్‌గన్‌ను లాక్కు్న్నాడు. ఆ తర్వాత ఆయుధాన్ని ఉగ్రవాది వైపు తిప్పి, అతన్ని భయపెట్టి వెనక్కి తగ్గించాడు.
దీంతో మరో ఉగ్రవాది తన కాల్పుల్ని ఆపి పరుగెత్తాడు. దీంతో మరింత మంది ప్రాణాలు పోకుండా కాపాడినవాడయ్యాడు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ ఈ హీరోను 'నిజమైన వీరుడు'గా ప్రశంసించారు. 'ఆయన తన ప్రాణాలు లెక్కచేయకుండా గన్‌మన్‌ను డిజార్మ్ చేసి, అనేకమంది జీవితాలను కాపాడాడు. ఇలాంటి ధైర్యం అసాధారణమైనది' అని కీర్తించారు.
ఆస్ట్రేలియా పోలీసులు ఈ దాడిని ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. ఈ దాడికి ఉపక్రమించిన వారిలో ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టగా, మరొకడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని యూదు సమాజంపై దాడిగా అభివర్ణిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బానీజ్ 'ఇది యూదు సమాజంపై లక్ష్యపెట్టిన దారుణ దాడి' అని ఖండించారు. ఇక, అనేక మంది ప్రాణాలు పోకుండా కాపాడిన సదరు వ్యక్తిని ఆస్ట్రేలియా ప్రజలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తు్న్నారు. అతని వీరత్వానికి జై..జైలు కొడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
Read Latest AP News And Telugu News