Share News

Ghazala Hashmi Virginia: వర్జీనియా లెఫ్టెనెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ.. మలక్‌పేటలో గడిచిన బాల్యం

ABN , Publish Date - Nov 05 , 2025 | 10:36 AM

అమెరికాలో మరో భారత సంతతి నేత కీలక పదవిని అధిరోహించారు. హైదరాబాద్ మూలాలు కలిగిన గజాలా హష్మీ వర్జీనియా రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ నేత జాన్ రీడ్‌పై విజయం సాధించి ఈ కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు.

Ghazala Hashmi Virginia: వర్జీనియా లెఫ్టెనెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ.. మలక్‌పేటలో గడిచిన బాల్యం
Ghazala Hashmi

ఇంటర్నెట్ డెస్క్: ఆమె పక్కా హైదరాబాదీ.. ఇక్కడే పుట్టారు. చిన్నతనంలో మలక్‌పేటలోని అమ్మమ్మా తాతయ్యల ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లితో కలిసి అమెరికాలో ఉంటున్న తండ్రి వద్దకు వెళ్లారు. బోధనారంగంలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఏకంగా వర్జీనియా రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు. ఇలా హైదరాబాద్ పేరును మరోసారి సగర్వంగా నిలబెట్టిన ఈ మహిళ గజాలా హష్మీ!

అమెరికాలో వర్జీనియా రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత గజాలా హష్మీ ఎన్నికై. ప్రస్తుతం సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె 15వ సెనెటోరియల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఉన్నారు. వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా సంతతి నేతగా, తొలి ముస్లింగా ఇప్పటికే ఆమె అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజా రేసులో ఆమె రిపబ్లికన్ నేత జాన్ రీడ్‌పై పైచేయి సాధించారు. లెఫ్టెనెంట్ గవర్నర్‌గా హష్మీ ఎన్నిక కావడంతో సెనెటోరియల్ డిస్ట్రిక్ట్‌కు మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది (Ghazala Hashmi Virginia Lieutenant Governor).

2019లో తొలిసారిగా హష్మీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ పాతుకుపోయిన ఓ రిపబ్లికన్ నేతపై విజయం సాధించి వర్జీనియా జనరల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత ఐదేళ్లకు సెనేట్‌లో కీలకమైన ఎడ్యుకేషన్, హెల్త్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. పార్టీకి కీలకమైన విద్య, వైద్యం రంగాల బాధ్యతలు దక్కించుకుని కీలక నేతగా గుర్తింపు పొందారు.


హైదరాబాద్ మూలాలు..

గజాలా హష్మీ తల్లిదండ్రులు జియా హష్మీ, తన్వీర్ హష్మీల స్వస్థలం హైదరాబాద్‌. 1964లో జన్మించిన ఆమె తన చిన్నతనంలో మలక్‌పేట్‌లోని తన అమ్మమ్మ తాతయ్యల ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉంటున్న తన తండ్రి వద్దకు వెళ్లారు.

గజాలా తండ్రి జియా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎమ్ఏ ఎల్ఎల్‌బీ చేశారు. ఆ తరువాత దక్షిణ కెరొలీనా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘ కెరీర్ అనంతరం సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఇక గజాలా తల్లి తన్వీర్ హష్మీ ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీఈడీ చేశారు.


చదువుల్లో రాణించిన గజాలా హైస్కూల్లో వాలిడిక్టోరియన్‌గా నిలిచారు. జార్జీయా యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. అట్లాంటాలోని ఎమొరీ యూనివర్సిటీలో అమెరికా సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. షష్మీ భర్త పేరు అజర్ రఫీక్. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

దాదాపు 30 ఏళ్ల పాటు గజాలా హష్మీ ప్రొఫెసర్‌గా సేవలందించారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మండ్, రేనల్డ్స్ కమ్యూనిటీ కాలేజీల్లో బోధించారు. సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లర్నింగ్ కేంద్రం వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా సేవలందించారు.

ఇవి కూడా చదవండి:

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

ట్రంప్‌‌నకు ఝలక్.. న్యూయార్క్ నగర మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 01:56 PM