6 Mag Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూప్రకంపనలు.. 622కు చేరిన మృతుల సంఖ్య..
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:07 PM
ఆఫ్ఘనిస్తాన్ హోమ్ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం మృతుల సంఖ్య 622కు చేరినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారితో అక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ భూప్రకంపనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 6.3గా నమోదైంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 600 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారితో అక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఊపందుకున్నాయి.
ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ మాట్లాడుతూ.. ‘చాలా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. భూప్రకంపనలు సంభవించిన ప్రదేశాన్ని చేరుకోవటం చాలా కష్టమైన పనిగా మారింది. అయినప్పటికీ సహాయక బృందాలు అక్కడే ఉండి చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి’ అని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ హోమ్ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం మృతుల సంఖ్య 622కు చేరినట్లు రాయిటర్స్ పేర్కొంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో వచ్చిన భూ ప్రకంపనల ధాటికి పాకిస్తాన్‌తోపాటు ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు.
రెండేళ్ల క్రితం ఇంతకు మించిన ఘోరం
2023లో ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంతకు మించిన ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 6.3గా నమోదైంది. ఆ సమయంలో తాలిబన్ రిపోర్టు ప్రకారం.. 4 వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం కనీసం 1,500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ భూప్రకంపనలకు అడ్డాగా మారిపోయింది. మరీ ముఖ్యంగా హిందూ ఖుష్ పర్వతాల పరిధిలో ఎక్కువగా భూప్రకంపనలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..