Diabetes Control: స్వీట్స్ తినకపోయినా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:45 PM
స్వీట్స్ తినకపోయినా కొందరిలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది తాము స్వీట్స్ తినకపోయినా షుగర్ లెవెల్స్ తగ్గట్లేదని ఆందోళన చెందుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో అర్థంకాక తలపట్టుకుని కూర్చుంటారు. దీనిపై వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు. స్వీట్స్ తినకపోతే షుగర్ పెరగదని అనుకోవడం లేదా డయాబెటిస్ కేవలం స్వీట్స్ వల్ల వస్తుందని భావించడం అపోహ మాత్రమేనని చెబుతున్నారు (sugar levels without sweets).
వైద్యులు చెప్పేదాని ప్రకారం, స్వీట్స్ తినకపోయినా షుగర్ స్థాయిలు పెరుగుతాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ (High Glycemic Index) ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్, బంగాళదుంపలు, రిఫైన్డ్ పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే చక్కెరలు, అనారోగ్యకర కొవ్వులు వంటివి కూడా షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం (high blood sugar reasons).
వీటితో పాటు శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, ఒత్తిడి ఎక్కువ కావడం, నిద్రలేమి, స్టెరాయిడ్స్ వంటి ఔషధాలు వాడటం కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేందుకు కారణమవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, బ్రాంకియల్ ఆస్తమా, కొన్ని ఆటో ఇమ్యూన్ రోగాలకు చికిత్సగా వాడే స్టెరాయిడ్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డిప్రెషన్‌కు చికిత్సగా వాడే ఔషధాలు, గర్భనిరోధక మాత్రలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతాయి (diabetes myths).
ఒత్తిడి వల్ల పెరిగే కార్టిసాల్ స్థాయిలు కూడా అంతిమంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరిగి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి కేవలం స్వీట్స్ వల్లే షుగర్ పెరుగుతుందని అనుకోవడం తప్పని వైద్యులు చెబుతున్నారు. షుగర్‌పై నియంత్రణ పెంచుకోవాలంటే పోషకాహారం తినడం, క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం, ఔషధాలను సమయానికి తీసుకోవడం వంటివి తప్పనిసరిగా చేయాలని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
హార్ట్ ఎటాక్ ముప్పును గుర్తించే ఈ 2 కీలక టెస్టుల గురించి తెలుసా..
కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..