Homocysteine-C reactive Protein: హార్ట్ ఎటాక్ ముప్పును గుర్తించే ఈ 2 కీలక టెస్టుల గురించి తెలుసా..
ABN , Publish Date - Sep 11 , 2025 | 09:51 PM
హార్ట్ ఎటాక్ ముప్పును కచ్చితంగా అంచనా వేసే హోమోసిస్టీన్, సీరియాక్టివ్ ప్రొటీన్ టెస్టులపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ టెస్టుల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా ముంచుకొచ్చే ముప్పు హార్ట్ ఎటాక్. అప్పటివరకూ బాగానే ఉన్న వ్యక్తులు హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. కొలెస్టరాల్, బీపీని చెక్ చేసుకోవడంతో పాటు మరో రెండు బ్లడ్ టెస్టుల ద్వారా హార్ట్ ఎటాక్ ముప్పును గుర్తించొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Heart Attack Hidden Risk tests).
హోమోసిస్టీన్ టెస్టు
హోమోసిస్టీన్ అనేది ఓ అమైనోయాసిడ్ అని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్లు జీర్ణమయ్యే సమయంలో ఇది ఉత్పత్తి అవుతుంది. దీన్ని శరీరం సాధారణంగా బీకాంప్లెక్స్ విటమిన్స్, ఫోలిక్ యాసిడ్‌గా మార్చుతుంది. ఈ రెండింటితో శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి ధమనుల్లో అడ్డంకులు సృష్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చివరకు హార్ట్ ఎటాక్‌కు దారి తీసే ప్రమాదం ఉంది (Homocysteine).
ధమనుల లోపలి పొరలపై హోమోసిస్టీన్ ప్రభావం ఉంటుందని, క్లాట్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జనాలు కొలెస్టరాల్ టెస్టుకు ఇచ్చినంత ప్రాముఖ్యత హోమోసిస్టీన్ టెస్టుకు ఇవ్వరు. అయితే, ఆరోగ్య అహారపు అలవాట్లు పాటించని వారు, దుర్వ్యసనాలు ఉన్న వారిలో దీని స్థాయిలో క్రమంగా పెరుగుతాయి. కాబట్టి, దీన్ని ముందస్తుగా గుర్తిస్తే సమస్యను మొదట్లోనే పరిష్కరించవచ్చని చెబుతున్నారు.
సీ-రియాక్టివ్ ప్రొటీన్
శరీరంలో సహజసిద్ధంగా ఏర్పాటైన అలారమ్ వ్యవస్థ సీ-రియాక్టివ్ ప్రొటీన్ అని వైద్యులు అభివర్ణిస్తున్నారు. దీన్ని లివర్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్ పెరిగినప్పుడు సీ-రియాక్టివ్ ప్రొటీన్ స్థాయిలు పెరుగుతాయి. దీని స్థాయిలు పెరుగుతున్నాయంటే గుండె పోటు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు ముప్పు గుర్తించేందుకు అత్యంత కచ్చితమైన టెస్టు ఇదేనని కూడా కొందరు వైద్యులు చెబుతారు. సీ-రియాక్టివ్ ప్రొటీన్ స్థాయిలు దీర్ఘకాలం పాటు అధికంగా ఉంటే గుండె ముప్పు పెరుగుతున్నట్టు భావించాలి. కాబట్టి ఈ విషయాలపై పేషెంట్లు కూడా అవగాహన పెంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు (C-Reactive Protein).
ఇవి కూడా చదవండి:
హెచ్‌బీఏ1సీ, ఎస్ఎమ్‌బీజీ.. డయాబెటిస్ రోగులకు తప్పనిసరిగా తెలిసుండాల్సిన విషయాలు ఇవి..
కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..