HbA1c vs SMBG: హెచ్‌బీఏ1సీ, ఎస్ఎమ్‌బీజీ.. డయాబెటిస్ రోగులకు తప్పనిసరిగా తెలిసుండాల్సిన విషయాలు ఇవి..
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:58 PM
డయాబెటిస్ రోగులు హెచ్‌బీఏ1సీతో పాటు ఎస్‌ఎమ్‌బీజీ విధానంలో కూడా గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులను తెలుసుకుంటే వ్యాధిని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఎస్ఎమ్‌బీజీ విధానంలో గ్లూకోజ్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: షుగర్ వ్యాధి ప్రభావం తగ్గించుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. రోజువారీ చేసే బ్లడ్ టెస్టులతో పాటు హెచ్‌బీఏ1సీ టెస్టు చేయించుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవచ్చు. సాధారణంగా డయాబెటిస్ రోగులు అందరికీ హెచ్‌బీఏ1సీ టెస్టు చేయించుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీనితో పాటు ఎస్ఎమ్‌బీజీపై కూడా దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు (HbA1c vs SMBG Diabetes Monitoring).
హెచ్‌బీఏ1సీ అంటే..
రక్తంలోని చక్కెర స్థాయిల్లో దీర్ఘకాలిక మార్పులు ఎలా ఉన్నాయో ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. టెస్టు చేయించుకునే సమయానికి ముందు రెండు మూడు నెలల వ్యవధిలో సగటు చక్కెర స్థాయిలను ఈ టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ఈ పరీక్షలో భాగంగా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ శాతాన్ని తెలుసుకుని గ్లూకోజ్ స్థాయిల గురించి ఓ అంచనాకు వస్తారు. హెచ్‌బీఏ1సీ 5.7 శాతం కంటే తక్కువ ఉంటే షుగర్ లేదని అర్థం. 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ డయాబెటిస్‌గా భావిస్తారు. 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్టు లెక్క.
ఎస్‌ఎమ్‌బీజీ అంటే..
సెల్ఫ్ మోనిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్‌కు సంక్షిప్త రూపమే ఎస్‌ఎమ్‌బీజీ. ఈ విధానంలో రోగులు రోజులో వివిధ సమయాల్లో రక్తపరీక్ష చేసుకుని చక్కెర స్థాయిలను తెలుసుకుంటారు. రోజూ నిర్ణీత సమయాల్లో క్రమం తప్పకుండా ఇలా టెస్టు చేసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు సంభవిస్తున్నాయో తెలుస్తుంది. కేవలం హెచ్‌బీఏ1సీపైనే ఆధారపడకుండా ఎస్ఎమ్‌బీజీ విధానంలో గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులను చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఆహారం, మందుల విషయంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. రోగులు ఈ రెండు విధానాల్లో గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకుంటే వ్యాధి తీవ్రతపై పూర్తి అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
షుగర్ టెస్టింగ్ సమయంలో ఈ తప్పులు మాత్రం చేయొద్దు