Blood Sugar Testing Mistakes: షుగర్ టెస్టింగ్ సమయంలో ఈ తప్పులు మాత్రం చేయొద్దు
ABN , Publish Date - Sep 06 , 2025 | 08:37 PM
ఇంట్లో షుగర్ టెస్టులు చేసుకునే వారు చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. ఈ విషయంలో వైద్యులు చెప్పే సూచనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో షుగర్ టెస్టు చేసుకునే సమయంలో కొందరు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కచ్చితమైన రీడింగ్స్ రావాలంటే మాత్రం ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మరి షుగర్ టెస్టింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం (Blood Sugar Testing Mistakes).
కొందరు భోజనం చేసిన వెంటనే షుగర్ చెక్ చేసుకుంటారు. ఇలా చేస్తే షుగర్ రీడింగ్స్ ఆందోళనకరంగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి, తిన్న తరువాత కనీసం రెండు గంటలకు షుగర్ చెక్ చేసుకుంటే కచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. షుగర్ స్థాయిలు కచ్చితంగా తెలుసుకునేందుకు రోజూ ఒకే సమయంలో చెక్ చేసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు (diabetes management tips).
కొందరు వేలి చివర నీడిల్‌తో గుచ్చుకుంటారు. ఇలా చేస్తే నొప్పి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో నాడులు ఎక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి వేలి చివరన పక్క వైపు సూదితో గుచ్చితే నొప్పి కాస్త తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
వేలిని గుచ్చేందుకు వాడే లాన్సెట్స్ (సూదులు) ఎప్పటికప్పుడు మార్చాలి. ప్రతిసారీ కొత్త వాటిని వినియోగించాలి.
ఎక్స్‌పైర్ అయిపోయిన టెస్టు స్ట్రిప్స్‌ను వాడకూడదు. అలాగే, జాగ్రత్తగా నిల్వ చేయని టెస్టు స్ట్రిప్స్ జోలికి కూడా వెళ్లకూడదు. పాడయిన స్ట్రిప్స్ వాడితే రీడింగ్స్ తప్పుగా వచ్చే అవకాశం ఉంది.
ఇక షుగర్ టెస్టు చేసుకునే ప్రతిసారీ చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అయితే, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేయిని శుభ్రం చేసుకుంటే చర్మంపై తేమ మొత్తం పోతుంది. ఇలాంటప్పుడు సూదితో గుచ్చితే నొప్పి ఎక్కువ కలుగుతుంది. కాబట్టి, సబ్బు నీళ్లతో చేతులు కడుక్కోవడమే బెటర్.
క్రమం తప్పకుండా ఇంట్లో షుగర్ టెస్టింగ్ చేసుకుంటేనే ఒంట్లో వ్యాధి ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. తోచినప్పుడు టెస్టు చేసుకుంటూ ఉంటే వ్యాధి తీవ్రతను అంచనా వేయడంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలాంటి తప్పులను అస్సలు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ