Hair Regrowth Serum: సైంటిస్టుల ప్రయోగం సక్సెస్! బట్టతల బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:36 PM
తైవాన్ శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయోగం వైద్య రంగంలో ఆసక్తి రేపుతోంది. హెయిర్ రీగ్రోత్ సీరమ్ ద్వారా శాస్త్రవేత్తలు కేవలం 20 రోజుల్లోనే చర్మంపై జుట్టు మొలిచేలా చేయగలిగారు.
ఇంటర్నెట్ డెస్క్: బట్టతలతో బాధపడే వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతమున్న ట్రీట్‌మెంట్స్‌తో కొందరికి ప్రయోజనం కలుగుతున్నా అధిక శాతం మందికి నిరాశే మిగులుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం కావడంతో బట్టతల బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఓ ప్రత్యేకమైన సీరమ్‌తో తాము కేవలం 20 రోజుల వ్యవధిలో చర్మంపై జుట్టు మొలిపించామని శాస్త్రవేత్తలు చెప్పారు (Hair Regrowth Serum).
సెల్ మెటబాలిజమ్ అనే జర్నల్‌లో ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి. చర్మానికి గాయమైన చోట మళ్లీ జుట్టు మొలవడానికి కారణం చర్మం కింద ఉన్న కొవ్వు కణాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాయమైన చోట చర్మం కింద ఉన్న కొవ్వు కణజాలం ఓలిక్, పామిటోలిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్స్‌ను విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్లను క్రియాశీలకంగా చేసి జుట్టు మొలిచేలా చేస్తాయి. దీంతో, ఈ ఫ్యాటీ యాసిడ్ మిశ్రమంతో ఎలుకలపై కూడా ప్రయోగం నిర్వహించారు. వెంట్రుకలు లేని ప్రాంతంలో ఈ ఫ్యాటీయాడిస్స్ పూయగా అక్కడ జస్ట్ 20 రోజుల్లోనే జుట్టు మొలిచింది.
వాస్తవానికి ఫ్యాట్ మెటబాలిజానికి జుట్టు ఎదుగుదలకు మధ్య ఏదో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు ఎంతో కాలంలో భావిస్తున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయం మరింత స్పష్టంగా తేలింది. సాధారణంగా గాయమైన సందర్భాల్లో మాక్రోఫాజెస్ అనే కణాలు.. కొవ్వు కణాల నుంచి ఓలిక్, పామిటోలిక్ యాసిడ్ వంటివి విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. ఈ రసాయనాలు జుట్టు కుదుళ్లను ప్రేరేపించి జుట్టు మళ్లీ మొలిచేలా చేస్తాయి. అయితే, ఈ రసాయనాలను కేవలం పైపూతగా వాడినా కూడా జుట్టు మొలిచే అవకాశం ఉందని తాజాగా రుజువైంది.
ఇదే విధానంలో మనుషుల్లో కూడా జుట్టు మొలిపించేందుకు కొత్త మార్గాలు లభించాయి. ఇక ఈ ప్రయత్నాలు ఎంత వరకూ సఫలం అవుతాయో తెలియాలంటే మనుషులపై కూడా ఇలాంటి ప్రయెగాలు జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఫ్యాటీ యాసిడ్స్ మిశ్రమాన్ని తాను స్వయంగా తన తొడ చర్మంపై రాసుకుంటే వెంట్రుకలు మొలిచాయని తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల్లో ఒకరు చెప్పడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి
జుట్టుకు రంగు వేసుకుంటారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే...
యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..