Hair dye Toxicity: జుట్టుకు రంగు వేసుకుంటారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే...
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:54 PM
జుట్టుకు నిత్యం రంగు వేసుకునే వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో జుట్టుకు రంగు వేసుకోవడం సాధారణ విషయంగా మారింది. అనేక మంది ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటూ ఉంటారు. అయితే, హెయిర్‌డైల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల హెయిర్ డైలల్లో పారా-ఫినైలీన్‌డైఅమైన్ (పీపీడీ) అనే రసాయనం ఉంటుంది. రంగు ఎక్కువ కాలం పాటు జుట్టుపై నిలిచి ఉండేందుకు హెయిర్ డైలల్లో ఈ రసాయనాన్ని వాడతారు. ఇలాంటి రంగులను ఎక్కువ కాలం పాటు వాడితే పీపీడీ వల్ల అలర్జీలు వచ్చే ఛాన్సుంది. ఇక ఇది రక్త ప్రవాహంలోకి చేరితే సమస్యలు మరింత తీవ్ర అవుతాయి. ఈ రసాయనాన్ని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలపై భారం పెరుగుతుంది.
వైద్యులు చెప్పే దాని ప్రకారం, నెత్తిపై ఉన్న చర్మం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త మందంగా ఉంటుంది. ఇక్కడ రక్తనాళాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా, ఇక్కడ చర్మంలో నుంచి వివిధ రకాల రసాయనాలు త్వరగా శరీరంలోకి ఇంకిపోతాయి. కాబట్టి పీపీడీతో సమస్యలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా మీరు వేసుకోబోయే హెయిర్ డైతో ప్యాచ్ టెస్టు చేయించుకోవాలి. ఇందులో భాగంగా చేయిపై కొద్దిగా రంగును అప్లై చేయాలి. ఆ తరువాత అలర్జీ రియాక్షన్‌లు ఏవీ రాకపోతేనే ఆ హెయిర్‌డైని వినియోగించాలి. నెత్తిపై హెయిర్ డైని ఎక్కువ సేపు ఆరబెట్టకుండా వీలైనంత త్వరగా కడిగేసుకుంటే కూడా రిస్క్ కొంత తగ్గుతుంది. ఇలాంటి హెయిర్ డైలకు బదులు హెన్నా, ఇండిగో లాంటివి వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హెయిర్ డైలను వాడక తప్పదని అనుకుంటే పీపీడీ-ఫ్రీ, అమోనియా-ఫ్రీ అని లేబుల్స్ ఉన్న ఉత్పత్తులనే వాడాలి.
నిత్యం హెయిర్ డైని వాడే వారికి నీరసంగా ఉండటం, వాపు లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పర్మనెంట్ హెయిర్ డైలకు బదులు సెమీ పర్మెనెంట్ డైలను ఎంచుకుంటే ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..
కాంటాక్ట్ లేన్స్‌ను వాడతారా? ఈ పొరపాట్లతో చూపునకు ముప్పు