Heat Related Deaths Lancet: నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఏటా సుమారు 5.5 లక్షల మంది మృతి
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:01 AM
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మానవాళికి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతల దుష్ప్రభావాల కారణంగా ఏటా సుమారు 5.5 లక్షల మంది మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తేల్చారు.
ఇంటర్నెట్ డెస్క్: నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఏటా సుమారు 5.5 లక్షల మంది మరణిస్తున్నారు. 1990లతో పోలిస్తే ఈ మరణాల సంఖ్య ఏకంగా 20 శాతం మేర పెరిగింది. ప్రముఖ మెడికల్ పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఒకరు మరణిస్తున్నారని నివేదిక రూపకర్తల్లో ఒకరైన ఓలీ జే తెలిపారు (Heat Related Deaths - Lancet Study).
తాజా అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 128 మంది పరిశోధకులు, 71 సంస్థలు పాల్గొన్నాయి. ఈ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఐరోపాలో ఎండా కాలంలో వడగాల్పులకు స్థానికులు, టూరిస్టులు అల్లాడిపోయారు. ఆసియా, అమెరికాల్లో కూడా వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు చుక్కలు చూపించాయి.
పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ఉత్పాదకత తగ్గడంతో 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాత్రి వేళ జనాలు నిద్రకు దూరమవుతున్న ఉదంతాలు 2024లో ఏకంగా 9 శాతం మేర పెరిగాయి. మనుషులు మనుగడ సాగించ లేని స్థితికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని అధ్యయనకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లాటిన్ అమెరికా దేశాల్లో 2000 సంవత్సరం తరువాత వడగాల్పులతో మరణాల సంఖ్య రెట్టింపయ్యిందని అన్నారు.
భూతాపం పెరుగుతున్న కొద్దీ కార్చిచ్చులు, డెంగీ, మలేరియా వంటి రోగాలు పెరుగుతున్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది. అయితే, శిలాజ ఇంధన వినయోగం వల్ల కలిగే కాలుష్యం గత పదేళ్లల్లో సుమారు 20 శాతం తగ్గడం ఓ సానుకూల అంశమని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. స్థూలంగా చూస్తే మాత్రం వాతావరణ మార్పులు మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
వావ్.. అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?
30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన 6 పండ్లు