Share News

Lead Toxicity: ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ను వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే..

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:07 PM

ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ను వాడితే లెడ్ టాక్సిసిటీ బారిన పడే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఊహించని సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. అసలు లెడ్ టాక్సిసిటీ అంటే ఏంటో, ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Lead Toxicity: ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ను వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే..
Pressure Cooker Lead Poisoning

ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది ప్రెషర్‌ కుక్కర్‌లను ఏళ్ల తరబడి వాడుతుంటారు. ఇలా చేస్తే చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏళ్ల తరబడి వాడటంతో కుక్కర్‌‌లు దెబ్బతిని లెడ్ లాంటి విషపూరిత లోహాలు ఆహారంలోకి లీక్ అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలేవీ తెలియని ఓ ముంబై మహిళ 20 ఏళ్లుగా ఒకే కక్కుర్‌ను వినియోగించడంతో ఆమె భర్త ఆరోగ్యం ఊహించని రీతిలో దెబ్బతింది. లెడ్ టాక్సిసిటీ బారిన పడటంతో రకరకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయి. డాక్టర్లు రోగకారణాన్ని సకాలంలో గుర్తించడంతో పేషెంట్ కొంత వరకూ కోలుకోగలిగారు (Old Pressure Cooker Lead Toxicity).

ఏమిటీ లెడ్ టాక్సిసిటీ..

శరీరంలో లెడ్ అనే లోహం పేరుకుపోయినప్పుడు లెడ్ టాక్సిసిటీ తలెత్తుతుంది. చిన్నారులకు ఇది మరింత ప్రమాదం. ఇక పెద్దలు లెడ్ టాక్సిసిటీ బారిన పడితే మెదడు, కిడ్నీ, పునరుత్పత్తి వ్యవస్థలకు చేటు కలుగుతుంది. నిపుణులు చెప్పేదాని ప్రకారం, పాత అల్యూమినియం కుక్కర్లను ఏళ్ల తరబడి వాడితే అవి దెబ్బతింటాయి. పాత్రల్లోని లెడ్, అల్యూమినియం లోహాలు లీకై ఆహారంలో కలిసిపోతాయి. ఇలా ఇవి శరీరంలోకి చేరాక కాల్షియం ఛానల్స్‌ను బ్లాక్ చేస్తాయి. దీంతో, మెదడు సిగ్నల్స్ నెమ్మదిస్తాయి. మెదడుతో పాటు రక్తం, జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాలపై లెడ్ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.


నాడీ వ్యవస్థ దెబ్బతిని ప్రవర్తనలో మార్పులు మొదలవుతాయి. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. మొదట్లో లెడ్ పాయిజనింగ్‌తో ఎలాంటి సమస్యలు కనబడకపోయినా కాలం గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా రోగ లక్షణాలు బయటపడతాయి. కడుపులో ఇబ్బంది, మేధో శక్తి తగ్గడం, అకారణ ఉత్సాహం, ప్రవర్తనలో మార్పులు, తలనొప్పి, వాంతులు, అలసట, రక్తహీనత, చేతులు, కాళ్లు మొద్దుబారినట్టుగా ఉండటం, లైంగిక వాంఛలు తగ్గడం, సంతానలేమి, కిడ్నీ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.


రక్తంలో లెడ్‌ను తొలగించడం ద్వారా పేషెంట్లను కొంత వరకూ కోలుకునేలా చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. చెలేటింగ్ ఏజెంట్‌తో లెడ్ టాక్సిసిటీకి చికిత్స చేస్తారు. ఇది శరీరంలోని లెడ్‌తో అనుసంధానం అవుతుంది. ఆ తరువాత శరీరం దీన్ని సులువుగా బయటకు విసర్జిస్తుంది.

ఇవి కూడా చదవండి:

చియా గింజలు తినేవారికి గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు హెచ్చరిక ఇది

పరగడుపున మెడిసిన్స్ వేసుకుంటున్నారా? ఇలా అస్సలు చేయొద్దంటున్న వైద్యులు

Read Latest and Health News

Updated Date - Jul 05 , 2025 | 04:47 PM