Health: పానీపూరీ... చాట్... ఏది మంచిది
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:16 AM
ఫెరులా అసాఫోటిడా అనే మొక్క వేళ్ళ దగ్గర నుంచి తీసే జిగురు నుంచి ఇంగువ తయారవుతుంది. ఇంగువ వంటకాల్లో మితంగా వాడడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది, పప్పులు వంటి అరిగేందుకు కష్టమైన ఆహారాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
పిల్లలు పానీపూరీతో పాటు చాట్ తింటున్నారు. కొందరు పానీపూరీ కన్నా చాట్ తినడం మంచిదని అనుకుంటారు. పానీపూరీలో నీరు ఉండటం వల్ల, దానిలో బ్యాక్టీరియా లేదా అవాంఛనీయ పదార్థాలు కలిసే అవకాశం ఉందా? రోడ్డు పక్కన చాట్ తినడం ఆరోగ్యానికి హానికరమా?
- వసంత, నెల్లూరు
చాట్ లభించే దుకాణాల్లో ఉండే వివిధ ఆహార పదార్థాల్లో పానీపూరీ కూడా ఒకటి. సాధారణంగా చాట్ వేడిగా ఉంటుంది, దానిలో వాడే పదార్థాలను ఉడికించడం లేదా పెనం పై వేడి చేయడం జరుగుతుంది. వేడి వల్ల కొంత వరకు హానికారక బ్యాక్టీరియా నశించే అవకాశం ఉన్నమాట నిజమే కానీ కొన్ని రకాల బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ ఈ వేడికి కూడా తట్టుకొని ఉంటాయి. అటువంటి పదార్థాలను చాట్ ద్వారా తీసుకున్నప్పుడు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఇక పానీపూరీ విషయానికొస్తే అందులో వాడే నీళ్లు, చల్లటి మసాలా రెండూ సూక్ష్మజీవులు పెరిగేందుకు తోడ్పడతాయి.

కాబట్టి వేడి వేడిగా ఉండే చాట్ తిన్నదానికన్నా పానీపూరీ తిన్నప్పుడు స్టమక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అధికం. చాలావరకు చాట్ బండ్లు పరిశుభ్రమైన పాత్రల్లో ఆహారాన్ని అందించకపోవడం వల్ల, చాట్ అయినా పానీపూరీ అయినా తరచూ బయట తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే. దీని బదులు అప్పుడప్పుడు ఇంట్లోనే శుభ్రమైన పదార్థాలతో చాట్ తయారు చేసుకుంటే రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికీ ఇబ్బంది ఉండదు.
80వ దశకంలో బిర్యానీ తిన్న తర్వాత చాయ్ తాగేవారు. బజ్జీలు, బోండాలు సాయంకాలం పూట మాత్రమే లభించేవి. ఇప్పుడేమో బిర్యానీతో కూల్ డ్రింక్ తీసుకుంటున్నారు, ఉదయం పూట నుంచీ బజ్జీలు బోండాలు విరివిగా దొరుకుతున్నాయి. ఈ పద్ధతులు అనారోగ్యానికి కారణమవుతాయా?
- గోకుల్ చంద్, హైదరాబాద్
పదిహేను ఇరవయ్యేళ్ళకు మునుపు కూడా బయట బిర్యానీ, బోండా, బజ్జీలు తినేవారు కానీ ఇప్పటితో పోలిస్తే అప్పట్లో ఆహారంలో మాత్రమే కాక జీవనశైలిలో కూడా చాలా తేడాలు ఉండేవి. బయటి ఆహారం తినాలంటే సమయం చూసుకొని బయటికెళ్లి తినాలి తప్ప ఫోనుల్లో ఆర్డర్ చేసుకొని అన్నీ ఇంటికే తెప్పించుకునేవారు కాదు. ఆహార నాణ్యత కూడా మెరుగ్గా ఉండేది. పరిమిత రకాల్లో (వెరైటీ) లభించడం, తరచూ బయట తినే అవకాశం లేకపోవడం వల్ల అధిక క్యాలరీల సమస్య తక్కువగా ఉండేది. జీవన శైలిలో కదలికలు ఎక్కువగా ఉండేవి.

చిన్న దూరాలకు బైకులు, కార్లు కాకుండా అధికభాగం నడవడం లేదా సైకిలుపై వెళ్లడం జరిగేది. అనారోగ్య సమస్యలు అప్పట్లోనూ ఉండేవి కానీ అవి చాలా వరకు మధ్యవయసు దాటినవారిలో, వయోవృద్ధులలో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మారిన ఆహారపు, జీవన శైలి అలవాట్ల వల్ల చిన్న వయసులోనే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా పిల్లలు బయట ఆటలాడడం తగ్గిపోయింది, ఇంట్లో చేసిన చిరుతిళ్ళు కంటే బయట తెచ్చిన ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బయటి ఆహారాన్ని తగ్గించి, శారీరక కదలికకు ప్రాధాన్యం ఇస్తే తప్ప దీర్ఘకాలిక రోగాలు రాకుండా చూసుకొనే అవకాశం ఉండదు.
వంటకాల్లో కొద్దిగా వాడే ఇంగువ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది? దీన్ని ఎక్కువగా వాడితే ప్రమాదమా?
- విశాలాక్షి, కరీంనగర్
ఫెరులా అసాఫోటిడా అనే మొక్క వేళ్ళ దగ్గర నుంచి తీసే జిగురు నుంచి ఇంగువ తయారవుతుంది. ఇంగువ వంటకాల్లో మితంగా వాడడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది, పప్పులు వంటి అరిగేందుకు కష్టమైన ఆహారాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇంగువలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-వైరల్ పదార్థాలు శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, రక్తపోటు, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
అదనంగా, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ గుణాల కారణంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, ఇంగువను తగిన మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువగా తీసుకుంటే పేగు సమస్యలు, తలనొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తవచ్చు, ముఖ్యంగా గర్భిణులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య సలహా తీసుకోవాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)