Pot Belly in Indians: భారతీయుల్లో ఎక్కువగా కనిపించే బానపొట్ట! కారణం ఇదేనా..
ABN , Publish Date - Nov 07 , 2025 | 03:26 PM
భారతీయుల్లో బానపొట్ట ఎక్కువన్న అభిప్రాయం ఉంది. మరి ఇలా ఎందుకు? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీకోసమే. మానవపరిణామ క్రమంలో ఎదురైన పరిస్థితులే ఈ మార్పునకు కారణమయ్యాయని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బానపొట్ట సమస్య భారతీయుల్లో ఎక్కువని నిపుణులు చెబుతుంటారు. సుఖవంతమైన జీవనానికి బానపొట్ట ఓ సూచిక అన్న అభిప్రాయం ఉన్నప్పటికీ దీంతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు భారతీయులకే ఈ బెడద ఎందుకు ఎక్కువ? అనే సందేహం కలగడం సహజం. ఈ అంశంపై చాలా కాలం క్రితమే ఓ కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది (Pot Belly-Thrifty Gene theory).
అబ్డామినల్ ఒబెసిటీ
బానపొట్టను వైద్య పరిభాషలో అబ్డామినల్ ఒబెసిటీ అంటారు. అంటే.. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకోవడం. నిపుణులు చెప్పే దాని ప్రకారం, భారతీయ పురుషుల్లో నడుము చుట్టు కొలత 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్లు దాటితే అబ్డామినల్ ఒబెసిటీగా భావించాలి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్న వారికి డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు అధికమని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. ఇక.. పిరుదులు, తొడలు, తుంటె భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడాన్ని పెరిఫెరల్ ఒబెసిటీ అని అంటారు.
భారతీయుల్లో బానపొట్టకు కారణం..
మన దేశంలో బానపొట్ట సమస్య ఎక్కువగా ఉండటానికి జన్యుపరమైన కారణం ఉందని జేమ్స్ వీ నీల్ అనే శాస్త్రవేత్త 1962లో ప్రతిపాదించారు. థ్రిఫ్టీ జీన్ థియరీ పేరిట ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కరువుకాటకాలను ఎదుర్కొనేందుకు వీలుగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునేలా ఇక్కడి వారిలో జన్యుమార్పులు వచ్చాయని జేమ్స్ తెలిపారు. ఆహారం పుష్కలంగా లభించిన కాలాల్లో శరీరం దాన్ని కొవ్వుగా మార్చి పొట్ట చుట్టు నిల్వచేస్తుంది. తద్వారా కరువు సమయంలో ఇదే కొవ్వును ఇంధనంగా వాడుకుని సమస్య నుంచి గట్టెక్కేందుకు అవకాశం చిక్కింది. కాలక్రమంలో మానవసమాజం అభివృద్ధి చెంది కరువుల తీవ్రత తగ్గింది. కానీ నాటి జన్యు మార్పులు అలాగే కొనసాగడంతో జనాల్లో పొట్ట చుట్టూ కొవ్వు క్రమంగా పెరిగి చివరకు బానపొట్టలుగా మారుతున్నాయని జేమ్స్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో రుజువుచేసే ఆధారాలు మాత్రం ఇంకా లభించలేదు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతీయ పురుషుల్లో 12 శాతం మంది, మహిళల్లో 40 శాతం మంది అబ్డామినల్ ఒబెసిటీతో బాధపడుతున్నారు. దీని వల్ల శరీరంలో ఇన్సులీన్ సెన్సిటివిటీ తగ్గి డయాబెటిస్, గుండె పోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఈ సమస్యను నివారించేందుకు దక్షిణాసియా వారు వారానికి కనీసం 300 నిమిషాల పాటు కసరత్తులు చేయాలని గ్లాస్గో యూనివర్సీటీ ఓ పరిశోధనలో తెలిపింది. ధూమపానం, మద్యపానం, ట్రాన్స్ ఫ్యాట్ ఆహారాన్ని త్యజిస్తే బానపొట్టను మరింత సమర్థనీయంగా అడ్డుకోవచ్చనేది నిపుణులు చెప్పే మాట.
ఇవి కూడా చదవండి
బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..
యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..