Health: తిన్న గంటకే ఆకలేస్తోంది... ఏం చేయాలి..
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:35 AM
హాస్టల్లో ఉండడం వల్ల అన్ని పూటలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టమే. అయినా, బయట తేలికగా దొరికే కొన్ని ప్రత్యామ్నాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా సరైన ఆహారాన్ని తగిన మొత్తంలో తీసుకుంటే వెంటనే ఆకలి వేయదు.
నాకు 26 ఏళ్ళు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటాను. రాత్రి భోజనం చేసిన గంటకే మళ్ళీ ఆకలేస్తుంటుంది. ఆ సమయంలో ఏం తింటే మంచిది?
- నేహా, వరంగల్
హాస్టల్లో ఉండడం వల్ల అన్ని పూటలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టమే. అయినా, బయట తేలికగా దొరికే కొన్ని ప్రత్యామ్నాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా సరైన ఆహారాన్ని తగిన మొత్తంలో తీసుకుంటే వెంటనే ఆకలి వేయదు. అలా కాకుండా తిన్న గంటకే మళ్లీ ఆకలేస్తోందంటే సరిపడా ఆహారం తినడం లేదనే అర్థం. ఆహారంలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, మంచి కొవ్వులు ఉంటే ఆరోగ్యకరమైన పోషకాలు అందడమే కాక ఆకలీ నియంత్రణలో ఉంటుంది. రాత్రి తొందరగా భోంచేయాలి.
అంటే నిద్రకు కనీసం రెండు మూడు గంటల ముందే తినడం మంచిది. కాబట్టి గంట తర్వాత ఆకలైతే ఏదోకటి తినడం కాకుండా భోజనానికి ముందు, భోజనంతో పాటు మంచి పోషకాలున్న పదార్థాలను చేర్చుకోవాలి. హాస్టల్లో ఇవ్వకపోయినా సొంత డబ్బుతో బయటి నుంచి క్యారెట్, కీరా, బీట్రూట్, టమాటా వంటివి తెచ్చుకుని సలాడ్‌లా తీసుకోవచ్చు. ప్రొటీన్ కోసం మొలకెత్తిన గింజలు (స్ర్పౌట్స్), గుడ్లు, పెరుగు తీసుకోవచ్చు. నానబెట్టిన బాదం, ఆక్రోట్, పల్లీ మొదలైన వాటి వల్ల మంచి కొవ్వులు లభిస్తాయి. వీటన్నింటిని రాత్రి భోజనంతో పాటు తగిన పరిమాణాల్లో తీసుకుంటే వెంటనే ఆకలి వేసే సమస్య ఉండదు. అప్పటికీ ఆకలి అనిపిస్తే 5-10 బాదం గింజలు లేదా అర కప్పు పాలు తాగితే సరి.
గ్లూటెన్ - ఫ్రీ డైట్ అంటే ఏమిటి? దీనివల్ల ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా?
- వకుళ, విజయవాడ

గోధుమ, బార్లీ, రైయి లాంటి కొన్ని రకాల ధాన్యాల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఓ రకమైన ప్రొటీన్. దీని వల్లే బ్రెడ్ మెత్తగా ఉంటుంది. గ్లూటెన్ లేని బియ్యం, జొన్న, సజ్జలు, చిరుధాన్యాలు, వీటితో చేసిన పదార్థాలను తీసుకోవడాన్ని గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటారు. కొంతమందికి గ్లూటెన్ పడకపోవడం, లేదా దానివల్ల జీర్ణ వ్యవస్థ సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి వారికి ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ తప్పనిసరి.
అయితే, ఆరోగ్యంగా ఉన్నవారు అవసరం లేకుండా గ్లూటెన్- ఫ్రీ డైట్ పాటిస్తే పెద్దగా లాభం ఉండదు. పైగా, గోధుమలో ఉండే ఫైబర్, ఐరన్, బీ-విటమిన్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోవచ్చు. అలాగే మార్కెట్లో దొరికే ‘గ్లూటెన్ - ఫ్రీ’ అని రాసి ఉండే పదార్థాలు అధికంగా ప్రాసెస్డ్ అయి, అందులో అదనపు చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. పిజ్జా, పాస్తా, బేక్ చేసిన ఆహార పదార్థాల్లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మేలు చేయకపోగా, కొన్నిసార్లు హానికరంగా మారవచ్చు. ఇటువంటి డైట్‌లు ఏవైనా సరే, సొంత నిర్ణయం కాకుండా వైద్యులను, నిపుణులను సంప్రదించి అవసరం మేరకు పాటిస్తే మంచిది.
నాకు తలమీద పొక్కుల్లా వస్తున్నాయి. చుండ్రు వల్లే అని అనుకుంటున్నాను. చుండ్రు నియంత్రించేందుకు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం ఉందా?
- పూజ, హైదరాబాద్

చుండ్రు చర్మ సంబంధిత సమస్య. చర్మ సంరక్షణకు పాటించే జాగ్రత్తలు, నియమాలు చుండ్రు సమస్యను కొంతవరకు ఎదుర్కొనేందుకు సహాయ పడతాయి. మీ ఆహారంలో ప్రొటీన్, విటమిన్ బీ 12, జింక్, ఐరన్, కాపర్ లాంటి పోషకాల కోసం మాంసాహారం; పాలు, గుడ్లతో పాటు, కంది, శనగ, పెసర్లు లాంటి పప్పులు; బాదం, ఆక్రోట్, పిస్తా, వేరుశెనగ లాంటివి కూడా తీసుకుంటే మంచిది.
నూనెలో వేయించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల చర్మం పీహెచ్‌లో తేడాలు వచ్చి దానివల్ల చుండ్రు సమస్య అధికమవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు తప్పని సరిగా దూరం ఉండాలి. సాధారణంగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉంటే చుండ్రు సమస్య కొంత తగ్గుతుంది. పైన పేర్కొన్న పోషకాలన్నీ అలా ఉపయోగపడతాయి. ఆహారంలో ఎన్ని మార్పులు చేసుకున్నా, కొన్నిసార్లు సరైన హెయిర్ ప్రాడక్ట్స్ వాడడం వల్ల మాత్రమే పరిష్కారం లభిస్తుంది. దీనికి చర్మవ్యాధుల నిపుణుల సలహాను పాటించాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)