Sleeping More Than 9 Hours: రాత్రిళ్లు 9 గంటలకు మించి నిద్రపోయే వాళ్లకో హెచ్చరిక
ABN , Publish Date - May 18 , 2025 | 08:13 PM
రాత్రిళ్లు 9 గంటలకు మించి నిద్రపోతే మెదడు సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేేత్తలు గుర్తించారు. డిప్రెషన్ వంటి మాననసిక సమస్యలతో బాధపపడేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు రాత్రిళ్లు ఎన్ని గంటలైన హ్యాపీగా నిద్రపోగలరు. తెల్లారాక ఎప్పుడో గానీ లెవరు. తమ తీరే అంత అని అనుకుంటూ ఉంటారు. ఎటువంటి చింత లేకుండా రోజుకు సుమారు 9 గంటలకు పైబడి నిద్రలో గడిపేస్తుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యకరమనే భ్రమలో కూడా ఉంటారు. అయితే, అతి నిద్ర ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
అతి నిద్రతో వచ్చే ప్రమాదాలపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. మొత్తం డిమెన్షియా నుంచి బయటపడ్డ 2 వేల మందిని పరిశీలించారు. ముఖ్యంగా వారు ఎంత సేపు రాత్రిళ్లు నిద్రపోతున్నారో, మెదడు పనితీరు ఎలా ఉందో అనే అంశాలను పరిశీలించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాత్రిళ్లు 9 గంటలకు మించి నిద్రపోయిన వాళ్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుదల కనిపించింది. ఇతర మానసిక సామర్థ్యాలు కూడా తగ్గాయి. ముఖ్యంగా డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లల్లో అతి నిద్ర మరిన్ని సమస్యలకు దారి తీస్తుస్నట్టు గుర్తించారు. ఔషధాలు వాడుతున్నారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా అప్పటికే సమస్యలను అతి నిద్ర తీవ్రతరం చేసినట్టు గుర్తించారు. ఇలాంటి వాళ్లకు అతి నిద్ర చేటుచేసే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు.
మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారు తమ నిద్రపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయంలో వైద్యులను సంప్రదించాలని అన్నారు. మెదడు ఆరోగ్యానికి నిద్ర అవసరమే కానీ, అతి నిద్రతో కూడా సమస్యలు తప్పవని అన్నారు.
గ్లోబల్ కౌన్సిల్ ఆన్ బ్రెయిన్ హెల్త్ ప్రకారం మనిషికి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. తద్వారా మెదడు సామర్థ్యాలను కలకాలం రక్షించుకోవచ్చు. అయితే, ఎంత సేపు నిద్రపోతున్నామనే దానిపై దృష్టి పెట్టి ఉంచాలి. డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలో సమతౌల్యం పాటిస్తే ఆశించిన ప్రయోజనాలు దక్కుతాయనేది నిపుణులు చెప్పే మాట.
ఇవి కూడా చదవండి:
చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..
కొందరు 4 గంటల నిద్రతో సరిపెట్టుకోగలరు.. ఇలా ఎందుకో గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ సింపుల్ టెక్నిక్‌తో నీళ్లల్లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు