Share News

Health: ఆ కడుపునొప్పికి ఏమిటీ ఉపశమనం..

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:14 PM

మామూలు కాఫీ, టీల లాగానే గ్రీన్‌ టీలో కూడా కెఫీన్‌ ఉంటుంది. కాబట్టి గ్రీన్‌ టీ పరిమితిలోనే తాగాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 కప్పులు గ్రీన్‌ టీ తాగడం సాధారణంగా సురక్షితం.

Health: ఆ కడుపునొప్పికి ఏమిటీ ఉపశమనం..

మా పాపకి 18 ఏళ్ళు. పీరియడ్స్‌ వచ్చినప్పుడు తనకి విపరీతంగా కడుపు నొప్పి వస్తోంది. ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది?

- విజయలక్ష్మి, నాగర్‌కర్నూల్‌

పీరియడ్స్‌ సమయంలో కడుపు నొప్పి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఈ సమయంలో తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా, శక్తిని అందించేలా ఉండటం చాలా ముఖ్యం. గోరువెచ్చని పాలు లేదా వేడి నీరు తాగడం ఉపశమనం ఇస్తుంది. బొప్పాయి, ద్రాక్ష, బత్తాయి లాంటి పండ్లు విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. ఐరన్‌, క్యాల్షియం ఉన్న ఆహారాలు అంటే పాలకూర, గోంగూర, పెసరపప్పు లాంటి వాటిని తీసుకోవడం మంచిది. చల్లని పానీయాలు, ఎక్కువ మసాలా, వేయించిన పదార్థాలను దూరంగా ఉంచాలి. ఉప్పు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కడుపు ఉబ్బరాన్ని పెంచడంతో పాటు నొప్పిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి వాటికీ దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే సూప్‌లు, రాగి జావ, కూరగాయలతో చేసిన ఉప్మా, గోధుమ రొట్టెలు, అన్నం లాంటివి తినడం శరీరానికి సౌకర్యాన్ని ఇస్తాయి. అలాగే గోరువెచ్చని నీటితో పొత్తి కడుపుపై కాపడం పెట్టుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, తక్కువ ఒత్తిడి ఉండేలా చూసుకోవడం కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.


ఇంట్లో ఆరోగ్యాన్ని ఎక్కువగా అశ్రద్ధ చేసేది మహిళలే. ఈ ఉరుకులు పరుగుల జీవనంలో మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- లావణ్య, నెల్లూరు

book8.jpg

ఇంట్లో అందరి ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ తమ ఆరోగ్యంపై పెట్టకపోవడం వల్ల మహిళలు తెలియకుండా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఉదయాన్నే ఇంటి పని మొదలు పెట్టి సమయాభావం వల్ల అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం వల్ల నీరసం వేస్తుంది. అంతేకాక మధ్యాహ్న భోజన సమయానికి బాగా ఎక్కువగా ఆకలి వేస్తుంది. గృహిణులు, ఇంట్లో నుండే పని చేసేవారు దీనివల్ల మధ్యాహ్నం అధిక క్యాలరీలు తీసుకుంటారు. తిన్న వెంటనే అలసటతో నిద్రకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉదయం పూట సమయం తక్కువగా ఉంటే, తేలికగా తినడానికి వీలయ్యే ఉడికించిన గుడ్లు, పండ్లు, పాలు లేదా పెరుగు లాంటివి తీసుకుంటే మంచిది. అల్పాహారానికి, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. మధ్యాహ్నం భోజనంలో అన్నం, కూర, పప్పుతో పాటు కొద్దిగా క్యారెట్‌, కీరా, టమాటా లాంటి పచ్చి కూరలు కొద్దిగా తీసుకొని అన్నం మోతాదును తగ్గిస్తే మంచిది. సాయంత్రం ఐదు ఆరు గంటల ప్రాంతంలో గ్లాసు మజ్జిగ, కొద్దిగా మొలకెత్తిన గింజలు లేదా ఏవైనా పండ్లు తీసుకుంటే పోషకాలు విరివిగా దొరుకుతాయి. ఇలా సమయానికి తగినంత పోషకాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రోజులో కాసేపు ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్‌ డీ అంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతుంది.


గ్రీన్‌ టీకి కూడా ఇన్నిసార్లు తాగాలనే లెక్క ఉందా? గ్రీన్‌ టీ తాగితే నిజంగా సన్నబడతారా?

- వాసవి, హైదరాబాద్‌

మామూలు కాఫీ, టీల లాగానే గ్రీన్‌ టీలో కూడా కెఫీన్‌ ఉంటుంది. కాబట్టి గ్రీన్‌ టీ పరిమితిలోనే తాగాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 కప్పులు గ్రీన్‌ టీ తాగడం సాధారణంగా సురక్షితం. గ్రీన్‌ టీ తాగడం వల్ల నేరుగా సన్నబడిపోవడం జరగదు. ఇది మెట బాలిజాన్ని కొద్దిగా పెంచడంలో సహాయ పడుతుంది. శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కానీ బరువు తగ్గడానికి గ్రీన్‌ టీ పైన మాత్రమే ఆధారపడకూడదు. దీనితో పాటు సమతుల్య మైన ఆహారం, క్రమమైన వ్యాయామం, సరైన నిద్ర, తగినంత నీరు తాగడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. గ్రీన్‌ టీ వల్ల నిద్ర ఇబ్బందులు రాకూడదంటే నిద్రపోయేందుకు కనీసం ఆరుగంటల ముందు నుంచి గ్రీన్‌ టీ తాగకూడదు. అలాగే గ్రీన్‌ టీలో క్యాలరీలను ఇచ్చే తేనే, చక్కెర, బెల్లం లాంటి తీపి పదార్థాలను చేర్చకుండా తీసుకుంటేనే దాని తాలూకు ఉపయోగం ఉంటుంది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - Oct 19 , 2025 | 12:14 PM