Diwali 2025 Pregnant Women Precautions: దీపావళికి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!
ABN , Publish Date - Oct 18 , 2025 | 02:00 PM
దీపావళి సమయంలో కాలుష్య స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆరోగ్య నిపుణుల నుంచి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి అంటే ఆనందోత్సాహాల పండుగ. అయితే, ఈ సమయంలో కాలుష్యం కూడా పెరిగిపోతుంటుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు దీపావళి సమయంలో వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పొగ, భారీ శబ్దాలకు దూరంగా ఉండాలి. లేకుండా పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుంది. అలాగే పండగ పేరుతో స్వీట్లు అధికంగా తీసుకోకూడదు. కాబట్టి, ఈ పండుగ సీజన్‌లో తల్లులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
బయటకు వెళ్లకండి
పటాకుల నుంచి వెలువడే పొగ, రసాయనాలు గాలిలో కార్బన్ కణాలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ఇది గర్భిణులు శ్వాస తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది. పుట్టబోయే బిడ్డపైనా కొంత ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా గర్భిణులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే, మాస్క్ ధరించాలని చెబుతున్నారు. ఈ సమయంలో ఏవైనా శ్వాస సమస్యలు ఎదురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ స్వీట్లు తినకండి..
గర్భిణీ స్త్రీలు దీపావళి రోజున స్వీట్లు తినవచ్చు, కానీ వాటి పరిమాణాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక స్వీట్లు తీసుకోవడం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్న లేదా కుటుంబంలో ఎవరికైన షుగర్ ఉన్నా అలాంటి మహిళలు తక్కువ స్వీట్లు తీసుకోవాలి. ఎక్కువగా వేయించిన లేదా కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా జాగ్రత్త వహించాలి. అలాగే, తాగే నీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి నుంచి దూరంగా ఉండండి
దీపావళి పండుగని ఇంటిని శుభ్రం చేయడం, పూజకు సిద్ధం కావడం, అతిథులను కలవడం వల్ల అలసిపోవడం సర్వసాధారణం. కానీ గర్భిణులు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడికి గురైనట్లు లేదా అలసిపోయినట్లు అనిపిస్తే లోతైన శ్వాస తీసుకోండి, ధ్యానం చేయండి. కుటుంబసభ్యుల నుంచి మద్దతు పొందండి. వైద్యులు సూచించిన పనులు మాత్రమే చేయండి. ఎక్కువగా శ్రమపడి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
ధన త్రయోదశి.. లక్ష్మీ దేవి, కుబేరుడి ఆశీస్సుల కోసం ఇలా చేయండి
జాగ్రత్త.. దీపాలు వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
For More Latest News