Share News

Colon Cancer Alert: పెద్దపేగు పదిలంగా

ABN , Publish Date - May 06 , 2025 | 03:08 AM

పెద్దపేగు క్యాన్సర్‌ అతి వేగంగా వ్యాపిస్తున్న ఆరోగ్య సమస్యగా మారింది. దీన్ని ప్రారంభ దశల్లో గుర్తించి, జీవనశైలిలో మార్పులు చేసి నివారించవచ్చు

Colon Cancer Alert: పెద్దపేగు పదిలంగా

మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో పెద్ద పేగు క్యాన్సర్‌ ఒకటిగా మారిపోయింది. జీర్ణకోశ సమస్యలను తలపించే పెద్ద పేగు క్యాన్సర్‌ చికిత్స పక్కదారి పట్టే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తతతో వ్యవహరించడం అవసరమంటున్నారు వైద్యులు.

త ఐదేళ్ల కాలంలో పెద్ద పేగు క్యాన్సర్‌ ఉదంతాలు రెట్టింపయ్యాయి. మునుపు ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా పరిమితమైపోయిన ఈ క్యాన్సర్‌ తాజాగా మూడవ స్థానానికి ఎగబాకింది. ప్రత్యేకించి యువతలో ఈ క్యాన్సర్‌ పెరగడం ఆందోళన కలిగించే విషయం. మరీ ముఖ్యంగా ఈ క్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తించలేకపోవడం వల్ల వ్యాధి ముదిరి చికిత్స క్లిష్టమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇందుకు కారణం, పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలు పొట్ట, పేగుల్లో తలెత్తే సాధారణ సమస్యలను తలపించేలా ఉండడమే!

తప్పుదోవ పట్టించే లక్షణాలు

మలబద్ధకం: రోజుల తరబడి మలబద్ధకం వేధిస్తుంది. అయితే అడపాదడపా ఈ సమస్య సాధారణమే కాబట్టి ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ పెద్దపేగు క్యాన్సర్‌గా భావించరు

విరోచనాలు: ఈ లక్షణం కూడా అందర్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు

మిశ్రమ సమస్య: కొన్ని రోజులు మలబద్ధకం, ఇంకొన్ని రోజులు విరోచనాలు వేధిస్తాయి. ఇలాంటి మిశ్రమ లక్షణాలు కూడా పెద్దపేగు క్యాన్సర్‌ను సూచిస్తాయి

మలంలో రక్తం: మలంలో రక్తం కనిపించడం కూడా పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణమే!

మలవిసర్జనలో ఇబ్బంది: మలవిసర్జన సాఫీగా, సునాయాసంగా జరగకపోయినా పెద్దపేగు క్యాన్సర్‌గా అనుమానించాలి

అల్సరేటివ్‌ కొల్లైటిస్‌: ఈ సమస్య నిర్లక్ష్యానికి గురైనప్పుడు, అది పెద్దపేగు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది

బరువు/ఆకలి తగ్గడం: అకారణంగా శరీర బరువు, ఆకలి తగ్గుతున్నా పెద్దపేగు క్యాన్సర్‌గా అనుమానించాలి


వీరికి ముప్పు ఎక్కువ

  • అధిక బరువు

  • కుటుంబ చరిత్రలో పెద్దపేగు క్యాన్సర్‌

  • అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు

  • ఎక్కువగా రెడ్‌ మీట్‌ తినడం

  • ధూమపానం, మద్యపానం

  • వ్యాయామం లోపం

  • ఎక్కువ గంటలు కదలకుండా పనిచేయడం

  • బొగ్గుల మీద కాల్చిన చేపలు తినడం

వ్యాధి నిర్ధారణ ఇలా...

మలబద్ధకమైనా, విరోచనాలు అయినా 5 నుంచి 7 రోజులకు క్రమేపీ సర్దుకుంటాయి. పొట్ట, పేగులకు సంబంధించిన సాధారణ సమస్యలన్నీ తాత్కాలికంగానే వేధించి, తగ్గిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా నెల, రెండు నెలల పాటు లక్షణాలు వేధిస్తూ ఉన్నా, బరువు తగ్గిపోతున్నా తప్పనిసరిగా వైద్యులను కలిసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్షలు, ట్యూమర్‌ మార్కర్లు, కొలనోస్కోపీలతో పెద్దపేగు క్యాన్సర్‌ను సులువుగా పసిగట్టవచ్చు. కొలనోస్పోపీతో ఒకటి, రెండు దశల్లోని కనిపెట్టవచ్చు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి సిటి స్కాన్‌, సిటి కొలనోగ్రఫీలు చేసి, క్యాన్సర్‌ తీవ్రతను అంచనా వేయవచ్చు. శరీరంలోకి ఎలాంటి స్కోప్‌ ను చొప్పించకుండానే పెద్దపేగు, పురీషనాళంలోని పాలిప్స్‌, పుండ్లు, క్యాన్సర్‌ గడ్డలను కనిపెట్టడంలో సిటి కొలనోగ్రఫీ బాగా తోడ్పడుతుంది. పెద్దపేగు క్యాన్సర్‌ ప్రారంభంలో చిన్న పాలిప్‌లా మొదలవుతుంది. కాబట్టి స్కాన్‌ సమయంలోనే వీటిని పసిగట్టి, తొలగించగలిగితే వ్యాధి ముదురకుండా చూసుకోవచ్చు.


చికిత్స సులువే!

పెద్దపేగుల్లో తలెత్తే క్యాన్సర్‌ ముందరి పాలిప్స్‌, కణుతులను ఎండోస్కోపీతో తొలగించుకోవచ్చు. ఈ చికిత్స రెండు, మూడు గంటల్లో పూర్తవుతుంది. తర్వాతి రోజే రోగి ఇంటికి వెళ్లిపోవచ్చు. క్యాన్సర్‌ మూడు, నాల్గవ దశలకు చేరుకున్నప్పుడు సర్జరీ చేయక తప్పదు. చివరి దశల్లో క్యాన్సర్‌ పెద్దపేగు నుంచి కాలేయం, ఎముకలు, ఊపిరితిత్తులకు వ్యాపించినప్పుడు సర్జరీ ముందు, తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరమవుతుంది. తాజాగా రొబొటిక్‌ సర్జరీ కూడా అందుబాటులోకొచ్చింది. చిన్న కోతతో కొనసాగే ఈ సర్జరీతో రోగి తక్కువ కాలంలోనే కోలుకోగలుగుతాడు. సర్జరీ తదనంతరం దుష్ప్రభావాలు కూడా ఉండవు.

ds.jpg

పెద్దపేగు ఆహారం

పెద్ద పేగు ఆరోగ్యం కోసం పీచు ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్‌ ఫుడ్‌ తగ్గించాలి.

నియంత్రణ చర్యలు ఇవే!

  • పెద్దపేగు క్యాన్సర్‌ నివారణ సులభమే!

  • కొద్దిపాటి అప్రమత్తతతో, ముందు జాగ్రత్తలతో

  • ఈ క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు.

  • బరువును అదుపులో ఉంచుకోవాలి

  • ధూమపానం, మద్యపానం మానేయాలి

  • వ్యాయామం చేస్తూ, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి

  • కుటుంబ చరిత్రలో పెద్దపేగు క్యాన్సర్‌ ఉన్నవాళ్లు 40 ఏళ్లు దాటిన వెంటనే, లేనివాళ్లు 50ఏళ్లు దాటగానే కొలనోస్కోపీ చేయించుకోవాలి

  • ఒకసారి కొలనోస్కోపీలో క్యాన్సర్‌ లేదని నిర్ధారణ అయినవాళ్లు అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి

  • రెడ్‌ మీట్‌, బొగ్గుల మీద కాల్చిన చేపలు తినడం మానేయాలి

-డాక్టర్‌ కృష్ణగోపాల్‌ ఎస్‌ భండారి

సీనియర్‌ కన్సల్టెంట్‌

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 03:08 AM