Mouth breathing: నోటితో ఎక్కువగా శ్వాస తీసుకుంటున్నారా.. జాగ్రత్త!
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:44 PM
ఇటీవల కాలంలో ఎక్కువ మంది ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకోవడం అలవాటుగా మారింది. నెలల పాటు రోజులు గడుస్తుంటే.. ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. శరీరంలో కఫము పెరిగి ఆస్తమా, అలర్జీ వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 11: సాధారణంగా ఆరోగ్యకరమైన మానవుడు ఎక్కువగా ముక్కుతో శ్వాస తీసుకుంటాడు. ముక్కుతో శ్వాస తీసుకోవడం వలన శరీరంలోని అన్ని భాగాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. ఫలితంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మారుతున్న అలవాట్ల దృష్ట్యా ఇటీవల కాలంలో ముక్కుతో కాకుండా నోటితో శ్వాసతీసుకునే అలవాటు పెరిగిపోయింది. రాత్రుళ్ళు నిద్రపోతున్న సమయంలో గురకపెట్టడం, నోటితో బెడ్డుపై లాలాజలం కార్చడం వంటివి నోటితో శ్వాశ తీసుకుంటున్నావనే దానికి గుర్తు. అయితే ఇలా నోటితో శ్వాస తీసుకోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు, గాలి ముక్కు ద్వారా శుభ్రంగా వెళ్లి వెచ్చగా, తేమగా మారుతుంది. ముక్కు లోపల చిన్న సిలియా, శ్లేష్మం ఉంటాయి. ఇవి ధూళి, కాలుష్యం, బ్యాక్టీరియా వంటి వాటిని నిరోధిస్తాయి. ఇది ఊపిరితిత్తులకు చేరే గాలిని పరిశుభ్రం చేస్తుంది. ఇలా కాకుండా డైరెక్ట్ గా నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీరంలో కఫం పేరుకుపోయి ఆస్తమా, అలర్జీకి దారి తీస్తుంది.
శీతాకాలంలో ముఖ్యంగా ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. జలుబు, అలెర్జీలు లేదా సైనస్ సమస్యలు ఎక్కువగా ఉండటం వలన ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి శరీరం నోటిని ఉపయోగిస్తుంది. ఇదే అలవాటుగా మారితే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇది ముక్కు మార్గాన్ని మూసివేస్తుంది. దీని కారణంగా కూడా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. చాలాసార్లు చిన్నతనంలో బొటనవేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. పదేపదే నోరు తెరిచి ఉంచడం వల్ల కూడా నోటితో శ్వాస తీసుకునే అలవాటు పెరుగుతుంది. తద్వారా క్రమక్రమంగా అనారోగ్యం దరిచేరే అవకాశం ఉంది.
చలికాలంలో ముక్కుతో శ్వాస పీల్చుకోవడానికి చిట్కాలు:
• పొద్దున లేచి స్నానం చేసిన తర్వాత.. గోరు వెచ్చటి రెండు గ్లాసుల నీళ్లు తాగడం వలన ముడుచుకుపోయిన శ్వాస నాళాలు రిలీఫ్ అవుతాయి. ఆస్తమా పేషేంట్లకు ఇది మంచి చిట్కాగా ఉపయోగపడుతుంది.
• ఉదయాన్నే ప్రాణాయామం చేయడం మంచింది. శ్వాసనాళాలు శుభ్రపడి సులువుగా గాలి పీల్చుకోవడానికి ముక్కు సహకరిస్తుంది.
• శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వైద్యులు సూచించిన విధంగా ఇన్ హేలర్లు, మెడిసిన్ వాడాలి.
• ఉదయాన్నే పచ్చకర్పూరం నీళ్లు తాగితే గొంతు శుభ్రపడుతుంది.
ఇవి కూడా చదవండి:
Vaccines for Adults: పెద్దలు వేసుకోవాల్సిన టీకాలు కూడా ఉన్నాయి! అవేంటో తెలుసా?
Ginger for Weight Loss: అల్లం నీరు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?