AI Assisted IVF: 18 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూపులు.. ఏఐతో నెరవేరనున్న కల
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:54 PM
18 ఏళ్లుగా సంతానం లేక అలమటిస్తున్న ఓ జంటకు ఏఐ సాంకేతికతో ఊరట దక్కింది. ఏఐ ఆధారిత కృత్రిమ గర్భధారణ విధానం ఫలితాన్ని ఇవ్వడంతో మహిళ ఎట్టకేలకు గర్భం దాల్చింది.

ఇంటర్నెట్ డెస్క్: సంతానం లేక అలమటిస్తున్న ఓ జంట జీవితంలో కృత్రిమ మేధ వెలుగులు నింపింది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఓ మహిళ ఏఐ టెక్నాలజీ సాయంతో ఇటీవల గర్భం దాల్చింది (AI STAR Method Fertility). ప్రస్తుతం ఇది వైద్య ప్రపంచంలో సంచలనంగా మారింది. మీడియా కథనాల ప్రకారం, ఓ జంట సంతాన భాగ్యం కలగక 18 ఏళ్లుగా అలమటిస్తోంది. మహిళ భర్తకు అజూస్పర్మియా అనే సమస్య ఉంది. టెస్టుల్లో గుర్తించ లేనంత తక్కువగా వీర్యకణాల సంఖ్య ఉన్న స్థితిని అజూస్పర్మియా అని అంటారు.
ఈ క్రమంలో ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందేందుకు వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పలు దేశాల్లోని వైద్యులను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. ఆశలు కొడిగడుతున్న వేళ ఆ జంట చివరి ప్రయత్నంగా కొలంబియా యూనివర్సిటీ ఫర్టిలిటీ సెంటర్‌ను (సీయూఎఫ్‌సీ) సంప్రదించింది.
ఈ క్రమంలో అక్కడి పరిశోధకులు కొత్త టెక్నిక్‌ను అమలు చేశారు. స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (ఎస్‌టీఏఆర్) విధానంలో మహిళ భర్త వీర్యంలో దాగున్న ఓ వీర్యకణాన్ని అతికష్టం మీద గుర్తించి వెలికి తీయగలిగారు. దానితో ఐవీఎఫ్ పద్ధతిలో మహిళ అండం ఫలదీకరణం చెందేలా చేసి గర్భాశయంలోకి ప్రవేశపెట్టడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విధానంలో గర్భం దాల్చిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.
తన కల ఎట్టకేలకు నిజం కాబోతోందని తెలుసుకున్న మహిళ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ‘ఇది నిజమని నమ్మేందుకు నాకు రెండు రోజులు పట్టింది’ అని ఆమె తెగ మురిసిపోతూ చెప్పుకొచ్చింది.
సీయూఎఫ్‌సీ డైరెక్టర్ డా.జెవ్ విలియమ్స్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి ఈ స్టార్ విధానాన్ని అభివృద్ధి చేసింది. తమ విధానం అద్భుత ఫలితం ఇవ్వడం చూసి పరిశోధకుల బృందం కూడా ఆశ్చర్యపోయింది.
‘ఆ పేషెంట్ మాకు శాంపిల్ ఇచ్చారు. అందులో వీర్య కణం కోసం నిపుణులు రెండు రోజుల పాటు వెతికినా ఒక్కటి కూడా కనిపించలేదు. కానీ స్టార్ విధానంలో శాంపిల్‌ను పరిశీలిస్తే కేవలం గంటలోనే వీర్య కణాల జాడ బయటపడింది. కేవలం గంట వ్యవధిలో 44 వీర్య కణాలను గుర్తించాము. ఇది వైద్య రంగంలో మేలి మలుపు అని మాకు అప్పుడే అర్థమైంది. పేషెంట్ల జీవితాల్లో ఇది ఆనందాన్ని నింపుతుంది’ అని విలియమ్స్ అన్నారు.
స్టార్ విధానంలో భాగంగా వీర్యం శాంపిల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన చిప్‌పై ఉంచి మైక్రోస్కోప్ ముందు పెడతారు. ఈ క్రమంలో స్టార్ సిస్టమ్‌లో భాగమైన హైపవర్ ఇమేజింగ్ వ్యవస్థ.. ఆ శాంపిల్‌కు సంబంధించి గంట వ్యవధిలో సుమారు 80 లక్షల చిత్రాలు తీస్తుంది. ఆ తరువాత ఏఐ సాంకేతిక ఈ చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వీర్య కణాల జాడను గుర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి:
చియా గింజలు తినేవారికి గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు హెచ్చరిక ఇది
పరగడుపున మెడిసిన్స్ వేసుకుంటున్నారా? ఇలా అస్సలు చేయొద్దంటున్న వైద్యులు