Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోల్.. మర్రి జనార్దన్ ఇంట్లో సోదాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:25 AM
జూబీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.
హైదరాబాద్, నవంబర్ 7: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో ఎలక్షన్ ఫ్లయింగ్, స్టాటిక్ టీమ్స్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Former MLA Marri Janardhan Reddy) ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేపట్టింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం మోతీనగర్‌లోని జనార్దన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బును నిలువ ఉంచినట్లు ఫిర్యాదు అందడంతో కేంద్ర బలగాలతో కలిసి ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అలాగే ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఉంటున్న నివాసంపై కూడా పోలీసులు రైడ్ చేశారు. బీఆర్‌ఎస్ రెహమత్‌నగర్ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ వ్యవహరిస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్ కోడ్ అమలులో లేని ప్రాంతంలో పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్సీ రవీందర్ రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ నివాసానికి బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరిగే తేదీ దగ్గర పడింది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. గల్లీ గల్లీ తిరుగుతూ తమకే ఓటు వేయాలంటూ ప్రధాన పార్టీ నేతలు ఓటర్లను కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఎన్నికల అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బైపోల్ సందర్భంగా నియోజకవర్గంలో ఎలక్షన్ ఫ్లయింగ్, స్టాటిక్ టీమ్స్ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. వాహన తనిఖీల్లో ఇప్పటికే భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
Read Latest Telangana News And Telugu News