Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముగిసిన ఎన్నిక ప్రచారం
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:25 PM
ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన వెల్లడి కానుంది.
హైదరాబాద్, నవంబర్ 09: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ముగిసింది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం అంటే నవంబర్ 11వ తేదీన జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. అయితే ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో మంగళవారం సాయంత్రం 6.00 గంటల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పోలింగ్ విధుల్లో దాదాపు 2 వేల మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఈ ఎన్నిక నేపథ్యంలో నాలుగు రోజుల పాటు మద్యం విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే ఎన్నికల వేళ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించిన విషయం విదితమే.
మరో వైపు ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన వెల్లడికానుంది. ఆ రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఇక ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఎందుకంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండో ఉప ఎన్నిక ఇది. ఇప్పటికే కాంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అలాగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కాంగెస్ పార్టీ విజయం సాధించాలని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్ సహచరులతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సైతం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇక నియోజకవర్గంలోని డివిజన్ల గెలుపు బాధ్యతను మంత్రులకు అప్పగించారు.
బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఉప ఎన్నికల్లో గెలిచి.. తమ సత్తా చాటాలని నిర్ణయించింది. అంతేకాదు.. జూబ్లీహిల్స్‌లో గెలుపు ద్వారా రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే విధంగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అంతేకాదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల్లో విశ్వనగరం హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందేనే అంశాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లింది. అదే విధంగా బీజేపీ సైతం తమ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగానే ప్రచారం నిర్వహించింది. మరి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 14 వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పరాకాష్టకు చేరిన సీఎం రేవంత్ మూర్ఖత్వం: జగదీష్ రెడ్డి
ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు తథ్యం: టీపీసీసీ చీఫ్
For More TG News And Telugu News