Jubilee Hills By Election: ఎమ్మెల్యేలపై కేసు నమోదు.. మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:14 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఈసీ కేసులు నమోదు చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ నేతలు సైతం ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పలువురు ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం కేసులు నమోదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్‌పై ఈసీ కేసులు నమోదు చేసింది. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌లపై కూడా కేసు నమోదు చేసింది. మంగళవారం ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వీరు.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో వీరిపై కేసులు నమోదు చేసింది.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ వేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత.. ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి సునీత ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.00 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదయిందని సమాచారం. చివరి వరకు ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సాయంత్రం 6.00 గంటలలోపు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు
Read Latest Telangana News And Telugu News