Jubilee Hills By Election: పోలీసులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాగంటి సునీత
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:17 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. నగర పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
యూసుఫ్ గూడ, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విచ్చల విడిగా నగదు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. మహిళ అని చూడకుండా.. రేపే నీ సంగతి చూస్తానంటూ తనను సైతం బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలో మాగంటి సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి నవంబర్ 14వ తేదీన చెప్తామని హెచ్చరించారు. ఏడిస్తే ఏడుస్తున్నదని.. నవ్వితే నవ్విందని అంటున్నారని.. మనుషులకు బాధ రాదా? అని ఆమె ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరుడు సురేశ్ యాదవ్ అంతు చూస్తానంటూ తనను బెదిరించాడని ఈ సందర్భంగా తెలిపారు.
అయితే ఓటు హక్కు వినియోగించడానికి వస్తున్న మహిళలను విద్యుత్ బిల్లులు తీసుకు రమ్మంటున్నారన్నారు. యూసుఫ్‌గూడలోని ఒక ఫంక్షన్ హాల్లో వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రౌండ్స్ వేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐలయ్య యాదవ్‌కు జూబ్లీహిల్స్‌లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక తర్వాత ఆకు రౌడీల పని చూస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలకు భయపడాల్సిన అవసరం ఏమిటని ఈ సందర్భంగా పోలీసులను ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసులు తటస్థంగా ఉండాలన్నారు. ఓటర్లకు బిర్యానీలో నగదు పెట్టి కాంగ్రెస్ వాళ్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రానివ్వటం లేదని ఆరోపించారు. నవీన్ యాదవ్ గెలిస్తే.. భవిష్యత్తులో రౌడీయిజం తప్పదని నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సూచించారు.
నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ స్వయంగా ఓటర్లకు నగదు పంచుతున్నారని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా తనను వంద మంది ఫాలో అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తిరుగుతున్నారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించడానికి కృషి చేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు
Read Latest Telangana News And Telugu News