Bihar Elections: 16 మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించిన నితీష్
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:55 PM
పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
పాట్నా: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోని జేడీయూ (JDU) కొరడా ఝళిపిస్తోంది. ఇంతవరకూ 16 మంది నేతలపై క్రమశిక్షణా చర్యల కింద బహిష్కరణ వేటు వేసింది. ఇదే అభియోగాలపై శనివారంనాడు 11 మందిని పార్టీ నుంచి జేడీయూ బహిష్కరించింది. తాజాగా ఆదివారం మరో ఐదుగురికి ఉద్వాసన పలికింది.
పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు శ్యామ్ బహదూర్ సింగ్, సుదర్శన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీలు రణ్‌విజయ్ సింగ్, అమర్ కుమార్ సింగ్, అస్మా ప్రవీణ్, లవ్ కుమార్, ఆషా సుమన్, దివ్యాంషు భరద్వాజ్, వివికే శుక్లా ఉన్నారు. పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణను ఉల్లంఘించడం, కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగడంతో వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
కాగా, నేతలపై క్రమశిక్షణా చర్యలకు ముందు సంబంధిత జాబితాను స్యయంగా నితీష్ కుమార్ సమీక్షించినట్టు తెలుస్తోంది. జేడీయూలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ నితీష్ క్రమశిక్షణా చర్యలకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి ఎన్డీయే, మహాఘట్‌బంధన్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నప్పటికీ, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సైతం రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే దిశగా తమకు ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.