Hyderabad: పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్..
ABN , Publish Date - May 20 , 2025 | 06:59 AM
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయి. అయితే.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీచేయాలని సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఎమ్మార్సీలకు సరఫరా చేస్తున్న అధికారులు
- పాఠశాలలు ప్రారంభం రోజే అందించేందుకు చర్యలు
హైదరాబాద్ సిటీ: కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు గోదాముల నుంచి 20 రోజులుగా దిగుమతి చేసుకుంటూ మండల విద్యా వనరుల కేంద్రాల (ఎమ్మార్సీ)కు చేరవేస్తున్నారు. వాస్తవంగా కొవిడ్ కాలం మొదలైనప్పటి నుంచి సర్కారు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. కాగా, రెండేళ్ల క్రితం ఆగస్టు వరకు కూడా పలు తరగతులకు చెందిన రెండు, మూడు పుస్తకాలు పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని క్లాసులకు విడతల వారీగా పంపిణీ చేయడంతో బోధనలో అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ తరుణంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి రాష్ట్ర విద్యాశాఖ ముందస్తుగా మేల్కొంది. వచ్చే జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరం రోజే పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: Jeevan Reddy: కాంగ్రెస్ సర్కారు ఉద్దేశమూ అదే..
పుస్తకాల డిమాండ్
జిల్లాలోని సర్కారు స్కూళ్లలో ప్రస్తుతం 2 నుంచి 10వ తరగతి వరకు 1,07,947 మంది విద్యార్థులున్నారు. అయితే ఈసారి కొత్తగా ఒకటో తరగతిలో 2 నుంచి 3 వేల మంది చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఈసారి 12.50 లక్షల పుస్తకాల ఇండెంట్ పెట్టారు. ఇందులో ఇప్పటివరకు 8.40 లక్షలు ఎమ్మార్సీలకు చేరాయి. కాగా, పిల్లలకు పాఠ్య పుస్తకాలతోపాటు నోట్‌బుక్స్ కూడా ఇస్తుండడంతో వాటిని కూడా గోదాముల నుంచి తీసుకొస్తున్నారు. నోట్ బుక్స్ మాత్రం ఇప్పటివరకు 30 వేలు మాత్రమే దిగుమతి అయినట్లు తెలిసింది.
మిగతా వాటిని సకాలంలో చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, గతంలో మాదిరిగా రామంతాపూర్(Ramanthapur)లోని గోదాముల నుంచి పాఠశాలలకు సరఫరా చేయడంలో ఆలస్యం జరుగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 23 నుంచి హెచ్‌ఎంలకు సమాచారం అందించి పుస్తకాలను వారికి అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ బడులకు సరఫరా చేసే పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రతీ దానికి వరుస సంఖ్య ‘క్యూ ఆర్ కోడ్‘ ఏర్పాటు చేశారు. గతంలో నిర్ణయించిన మేరకే పిల్లలకు పుస్తకాల మోత తగ్గించేందుకు తక్కువ బరువు కలిగిన కాగితంతోనే ముద్రించారు.
యూనిఫాంలూ సకాలంలో ఇవ్వాలి
గతేడాది పాఠ్య పుస్తకాలతోపాటు విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ ఆలస్యంగా జరిగిందనే ఆరోపణలున్నాయి. కొన్ని స్కూళ్లలో మొదటి జతను త్వరగా ఇచ్చి.. రెండో జతను అక్టోబర్ వరకు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి అలా కాకుండా పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు
Read Latest Telangana News and National News