Religious Demographic: హిందూత్వ సంస్థలపై ఎందుకంత ఆక్రోశం
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:29 AM
‘క్రైస్తవులకూ తప్పని వేధింపులు’ అంటూ ఆగస్టు 15న రాజ్‌దీప్ సర్దేశాయి రాసిన వ్యాసంలో హిందుత్వ సంస్థలపై వ్యతిరేక పైత్యం పరాకాష్ఠకు చేరింది. ‘‘నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారతీయ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ‘పలువురు’...
‘క్రైస్తవులకూ తప్పని వేధింపులు’ అంటూ ఆగస్టు 15న రాజ్‌దీప్ సర్దేశాయి రాసిన వ్యాసంలో హిందుత్వ సంస్థలపై వ్యతిరేక పైత్యం పరాకాష్ఠకు చేరింది. ‘‘నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారతీయ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ‘పలువురు’ ఆక్షేపిస్తున్నారు’’ అని ఆయన చెప్పడంలో పెద్ద తిరకాసే ఉంది. ఈ ‘పలువురు’ ఎవరు? ఇస్లామిక్ ఉగ్రవాదులను నెత్తిన పెట్టుకొని, లౌకికవాద ముసుగును తగిలించుకొని, హిందువుల సంప్రదాయాలను, హిందుత్వ సంస్థలను అకారణంగా, అసందర్భంగా, అనవసరంగా దెప్పిపొడిచే ‘హిందూ వ్యతిరేక హిందువులు’ అని చెప్పుకోవచ్చు.
వ్యాసంలో ‘సంఘ పరివార్ తీవ్రవాదులు’ అనే పద ప్రయోగం చేయడం వెనుక రాజ్‌దీప్ సర్దేశాయికి జాతి వ్యతిరేక సంస్థల ప్రోత్సాహం ఉందన్న విషయం అర్థమవుతున్నది. వాస్తవంగా హిందూత్వ సంస్థల కార్యకర్తలు హింసావాదులైతే- ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడిచేది కాదు. దేశంలో వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు సంభవించినప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలు అందించేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. వారిని దూషించేవారు మాత్రం దేశ ప్రజలకు అవసరం వచ్చినప్పుడు పారిపోయి, దాక్కుంటారు.
బలవంతపు మత మార్పిడి, అమ్మాయిల అక్రమ రవాణా అనే ఆరోపణలతో కేరళకు చెందిన ఇద్దరు ‘నన్స్’ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయంలో ఈ దేశంలో క్రైస్తవ రాజకీయాల లాబీ బలంగానే పనిచేసింది. వారికి బెయిల్ ఇప్పించడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రధాన పాత్ర పోషించారు. బీజేపీ ఈ సందర్భంలో పూర్తి సంయమనంతో వ్యవహరించిందని అర్థం చేసుకోవాలి తప్ప, పెడర్థాలు ఎందుకు? ఈ దేశంలో క్రైస్తవ మతమార్పిడి వెనుక క్రైస్తవ దేశాల కుట్రలు, లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ రాజకీయ నాయకుల దౌష్ట్యపు ఆలోచనలు లేవని ఎవరైనా చెప్పగలరా? క్రైస్తవంలోని ఆధ్యాత్మిక ఆలోచనల ప్రేరణతోనే హిందువులు క్రైస్తవంలోకి మారుతున్నారని చెబితే, అది అతిశయోక్తి అవుతుంది. ఇదే వాస్తవమైతే ఇస్లాం మతస్థులు కూడా కన్వర్ట్ కావాలి కదా.
భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించింది కానీ, -ఇతర మతాలపై దుష్ప్రచారం చేసి, ప్రలోభాలతో, మాయ మాటలతో వేరొక మతం వారిని తమ మతంలోకి మార్చుకొని సంఖ్య పెంచుకోవాలనే వెసులుబాటుకు మన రాజ్యాంగంలో చోటు లేదు. అంబేడ్కర్ మరణానికి ముందు అంటే 1956లో బౌద్ధ మతంలోకి మారేటప్పుడు దేశంలో ప్రభావవంతంగా ఉన్న క్రైస్తవాన్నో, ఇస్లామ్‌నో ఎందుకు ఎంచుకోలేదు? ఈ విషయం గురించి మన దేశంలోని స్వయం ప్రకటిత మేధావులు అనేక కట్టుకథలు చెబుతారు. వాస్తవం ఏమిటంటే– ఈ రెండు మతాల నిజస్వరూపం ఏమిటో అంబేడ్కర్‌కు బాగా తెలుసు.
ముస్లిం మత పెద్దలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనకుండా, క్రైస్తవ మత పెద్దలు నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో మోదీ పాల్గొన్నారని చెప్పడం వెనుక వ్యాసకర్త దురుద్దేశం అర్థమైంది. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు మోహన్ జీ భగవత్ ఇటీవల ఢిల్లీలో 60మంది ఇమాముల సమావేశంలో పాల్గొన్నారు. రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమామ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాసీని హిందుత్వ సంస్థలు స్నేహపూర్వకంగా ఆహ్వానించాయి. మోదీ ప్రధానిగా మొదటి టర్మ్‌లో పాకిస్థాన్‌ను సందర్శించి, అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఆయన తల్లికి పాద నమస్కారాలు చేసి వచ్చారు. సంస్కారవంతులకు మాత్రమే ఈ వాస్తవం బోధపడుతుంది.
దేశ జనాభాలో క్రైస్తవులు కేవలం 2.3శాతం మంది మాత్రమే అని చెప్పడం పచ్చి అబద్ధం. ఈ దేశంలో క్రైస్తవులు చర్చిలో ఒక పేరు ప్రభుత్వ లెక్కల్లో మరొక పేరుతో కొనసాగుతారు. ఈ దొంగలెక్కలను పరిగణనలోకి తీసుకుని క్రైస్తవుల జనాభా 1971లో 2.6శాతం ఉంటే నేడు 2.3శాతం ఉందని రాజ్‌దీప్ సర్దేశాయి బుకాయిస్తున్నారు. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు మతపరంగా సంఘటితంగా ఉంటూ, రాజకీయ పార్టీల పైన తమ ప్రభావాలను చూపుతూ, తమ మత వ్యూహాలను చక్కగా అమలు చేస్తున్నారు. కులాల, వర్గాల, ప్రాంతాల, భాషలవారీగా విడిపోయిన హిందువులు అని పిలవబడే మెజారిటీ సమూహమే నేడు శక్తి హీనంగా ఉంది. తమ మతాచారాలను, సంప్రదాయాలను, దేవీ దేవతలను దూషించే వాళ్లను నెత్తిన పెట్టుకోవడం వీరి సహజ నైజంగా మారిపోవడం దురదృష్టకరం!
ఉల్లి బాలరంగయ్య
ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
For More National News and Telugu News