కులగణన ప్రతిష్ఠను కాజేసే కుట్రలు
ABN , Publish Date - May 13 , 2025 | 05:20 AM
కేంద్ర కులగణన నిర్ణయం రాహుల్‌గాంధీ పోరాట ఫలితమే అని దేశమంతా కీర్తించింది. ఇది బీజేపీ నేతలకు మింగుడుపడక అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మే 3న ఆంధ్రజ్యోతిలో ‘చరిత్రాత్మకం... మోదీ కులగణన నిర్ణయం’ పేరుతో రాసిన వ్యాసంలో...
కేంద్ర కులగణన నిర్ణయం రాహుల్‌గాంధీ పోరాట ఫలితమే అని దేశమంతా కీర్తించింది. ఇది బీజేపీ నేతలకు మింగుడుపడక అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మే 3న ఆంధ్రజ్యోతిలో ‘చరిత్రాత్మకం... మోదీ కులగణన నిర్ణయం’ పేరుతో రాసిన వ్యాసంలో అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలును పూర్తిగా వక్రీకరించారు.
కులగణన చేస్తామని 2024 లోకసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. ‘జిత్‌నీ ఆబాదీ ఉత్‌నా హక్’ (జనాభా ఎంతో అంత వాటా) అని రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. కులగణన వాదాన్ని బలపరిచారు. మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కులగణనను సమర్థించటాన్ని అర్బన్ నక్సలిజంతో పోల్చి విమర్శించారు. కులగణన హిందువుల మధ్య విభజన తెస్తుందన్నారు. ‘‘ముందు నీ కులమేంది? నీ మతమేంది?’’ చెప్పు అని బీజేపీ నాయకులు రాహుల్‌గాంధీని అవమానించారు. బీజేపీ నేతలు ఎంత అవమానపరిచినా రాహుల్ కులగణన వాదాన్ని వీడలేదు. దేశంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి కులగణనకు వ్యతిరేకంగా వెళితే బీజేపీ పార్టీకి భవిష్యత్‌లో జరిగే బిహార్, గుజరాత్ తదితర ఎన్నికల్లో పుట్టగతులుండవని గ్రహించి, కులగణన చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.
కులగణన ఘనత తమదేనని డాక్టర్ లక్ష్మణ్ తన వ్యాసంలో సొంత డబ్బా కొట్టుకున్నారు. భారతదేశంలో సామాజిక న్యాయానికి ఇప్పటికీ ఎప్పటికీ దిక్సూచి ఐన కాంగ్రెస్ పార్టీ పట్ల విషం కక్కారు. మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1953లో కాకా కాలేల్కర్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో తొలి బీసీ కమిషన్ వేశారు. 1951 జనాభా లెక్కల ప్రకారం 36.11కోట్ల జనాభా ఉంటే ఆ కమిషన్ కేవలం 11.5కోట్ల మంది నుండి సమాచారం సేకరించి నివేదిక రూపొందించింది. కమిషన్ వెనుకబడిన తరగతులను గుర్తించటంలో ఎటువంటి శాస్త్రీయ విధానాలు పాటించలేదని ఆ నివేదికను తోసిపుచ్చటం జరిగింది. ఇందులో నెహ్రూ తప్పు లేదు.
2011లో దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జనాభా లెక్కల్లో భాగంగా సామాజిక, ఆర్థిక కులగణన (ఎస్.ఇ.సి.సి) చేసింది. నివేదిక వచ్చే సమయానికి 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కులగణన లెక్కలను బయటపెట్టాలని కాంగ్రెస్ ఎంపీలు నిలదీసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి మోదీకి 2024 పార్లమెంటు ఎన్నికల ముందు 2011 కులగణన లెక్కలు బయటపెట్టాలని లేఖ రాసినా ఎందుకు బయటపెట్టలేదో ఎంపీ లక్ష్మణ్ సమాధానం చెప్పాలి.
రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన కులగణనను లక్ష్మణ్ ఉద్దేశపూర్వకంగా తప్పుపడుతున్నారు. రెండు దశల్లో చేపట్టిన సర్వేలో 97.10 శాతం జనాన్ని సమీకరించి 57 ప్రశ్నలతో సమర్థవంతంగా సమాచారం సేకరించి తెలంగాణ కులగణనలో బీసీలు 46.25 శాతం అని లెక్కలు తేల్చారు. తరువాత బీసీ జాబితాలో చేర్చిన ముస‍్లింల జనాభా 10.8 శాతంగా లెక్కించారు. బీసీలను, ముస్లిం బీసీలను కలిపితే తెలంగాణలో మొత్తం బీసీల శాతం 56.33గా పేర్కొన్నారు. ఎస్సీలు 17.43శాతమని, ఎస్టీలు 10.45శాతమని ప్రకటించారు. మొత్తం ఓసీల జనాభా 13.31శాతం అని వెల్లడించారు. ఓసీ ముస్లింలు 2.48శాతం. ఓసీలు, ఓసీ ముస్లింలతో కలిపి తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా 15.79శాతంగా స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ చేసిన సర్వేలో శాస్త్రీయత స్పష్టంగా ఉన్నది.
నిజానికి దేశంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించటానికి 1989–1990లో మాజీ ప్రధాని వి.పి.సింగ్ ప్రయత్నిస్తే ‘మండల్ కమండల్’ పేరుతో యాత్రలు చేసి, అల్లర్లు సృష్టించి వి.పి.సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని ప్రభుత్వాన్ని పడగొట్టిన సంస్కృతి బీజేపీది. ఈ సంగతి మర్చిపోయినట్టు రాజీవ్‌గాంధీ మీద ఆ నేరాన్ని డాక్టర్ లక్ష్మణ్ మోపారు. ఆ తరువాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పీవీ నరసింహారావు ప్రధానిగా దేశవ్యాప్తంగా ఓబీసీలకి 27 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది నిజం కాదా లక్ష్మణ్ గారు? 2006లో ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి కేంద్ర అత్యున్నతమైన విద్యాసంస్థల్లోను, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోను ఓబీసీలకి 27 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు అన్న సంగతి మర్చిపోతే ఎలా? బిహార్‌లో కులగణన అప్పటి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ల సమక్షంలో 2022 నుండి ప్రారంభమై 2023లో నివేదిక బైటపెట్టింది. దీన్ని కూడా లక్ష్మణ్ బీజేపీ ఖాతాలో వేసుకోవడం విచిత్రం.
కె.లక్ష్మణ్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ దేశంలో తొలి బీసీ కమిషన్ వేసి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ముమ్మాటికి న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. రాష్ట్రంలో బీసీలుగా ఉన్న లంబాడీలను 1975లో ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణను అమలు చేసిన తొలి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే. 42శాతం విద్య ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి సర్కారే. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాహుల్‌గాంధీ చెప్పినట్లు 50శాతం రిజర్వేషన్లు పరిమితిని ఎత్తివేసి శాస్త్రీయంగా జనగణనతో పాటు కులగణన చేసి దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వారి వాటాను వారికి పంచండి.
కోటూరి మానవతారాయ్
టీపీసీసీ మాజీ ప్రధానకార్యదర్శి
ఇవి కూడా చదవండి..
AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ
For National News And Telugu News