Voter Fraud Indi:a ఓట్ల చోరీలో దొరలెవ్వరు దొంగలెవ్వరు
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:00 AM
గణితంలో మనం ఘటికులం! ఈ ఘనత ఇప్పటిది కాదు. సున్నాని కనిపెట్టటంతో ఆరంభమై దశాంశ పద్ధతిని ఉపయోగించటంతో వందల ఏళ్ల క్రితమే భారతీయుల ప్రతిభ ప్రపంచానికి వెల్లడైంది. ఇది ఒకవైపు చిత్రం. మరోవైపు చూస్తే లెక్కలను అస్తవ్యస్తంగా నిర్వహించటంలోనూ...
గణితంలో మనం ఘటికులం! ఈ ఘనత ఇప్పటిది కాదు. సున్నాని కనిపెట్టటంతో ఆరంభమై దశాంశ పద్ధతిని ఉపయోగించటంతో వందల ఏళ్ల క్రితమే భారతీయుల ప్రతిభ ప్రపంచానికి వెల్లడైంది. ఇది ఒకవైపు చిత్రం. మరోవైపు చూస్తే లెక్కలను అస్తవ్యస్తంగా నిర్వహించటంలోనూ, అవసరాలకు అనుగుణంగా వాటిని అటూఇటూ చేయటంలో కూడా మనం దిట్టలమే! ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖను చూసినా ఇప్పటికీ ఈ దృశ్యం కనపడుతుంది. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎక్కుపెట్టిన విమర్శలతో మన లెక్కలు, సమాచార విశ్వసనీయతపై సందేహాలు ఇంకా ఎక్కువయ్యాయి. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక గణాంకాలపై ఇప్పటికే చాలా వివాదాలు ముసురుకున్నాయి. ఇప్పుడు వాటికి ఓటర్ల జాబితా కూడా తోడైంది.
ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చి బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేయించటంలో ఎన్నికల కమిషన్ లాలూచీ పడిందన్న రాహుల్‌గాంధీ ఆరోపణలు అసాధారణమైనవి. ఏ ఉద్దేశంతో వాటిని చేసినా, వాటిల్లో సాధికారత ఎంత ఉన్నా ప్రస్తుత సందర్భంలో అవి లేవనెత్తిన సమస్యలు వ్యవస్థల పనితీరును లోతుగా పరిశీలించేటట్లు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాలు నూటికినూరుపాళ్లూ పక్కాగా నిర్వహించలేకపోవటంలో పాపం ఎవరిది? ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చినంత మాత్రాన అధికారంలో ఉన్న పార్టీ ఫలితాలను నిర్దేశించగలుగుతుందా? విపక్షాలు అధికారంలో ఉన్నచోట్ల రాష్ట్ర ప్రభుత్వాల అదుపు ఆజ్ఞల్లోనే ఉద్యోగ యంత్రాంగమంతా ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ నుంచి హుకుం జారీచేస్తే ఓటర్ల జాబితాను అనర్హులతో నింపివేయటానికి అది సాహసిస్తుందా? అన్న కీలక ప్రశ్నలకు జవాబులివ్వటం అంత తేలికకాదు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మంట్‌లో 1,00,250 మంది అనర్హులైన వారిని ఓటర్లుగా చేర్చి ఫలితాన్ని తారుమారు చేయగలిగిందన్న ఆరోపణకు సమర్థనగా రాహుల్‌గాంధీ ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తే అది ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాదని సులువుగానే అర్థమవుతుంది. ఒకే ఇంటి నంబరుతో పదులకొద్దీ ఓటర్లు ఉండటం, అసలు అడ్రస్సే లేకుండా ఓటర్లుగా నమోదు కావటం, ఒక వ్యక్తి రెండుమూడు ఓటరు కార్డులు కలిగి ఉండటం, కార్డుల్లో ఉన్న ఫొటోలకు అసలు వ్యక్తులకు పొంతన లేకపోవటం, నియోజకవర్గాన్ని మార్చుకోటానికీ కొత్తగా ఓటర్లుగా నమోదుకావటానికీ వెసులుబాటు కల్పించే ఫామ్–6ను దుర్వినియోగం చేయటం.. ఇట్లా అయిదు అక్రమాలను పేర్కొని మహదేవపురలో భారీగా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
ఆ ఆరోపణలను విచారించి నిజానిజాలను వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ హుందాగా చెప్పి ఉంటే పరిస్థితి వేరేరకంగా ఉండేది. ప్రతి ఆరోపణకూ తగిన ఆధారాలను పొందుపరుస్తూ అఫిడవిట్ దాఖలుచేయాలని ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగటంతో ఏదో కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తోందన్న భావన ప్రజల్లో బలపడింది. ఒక డోర్ నంబరులో పదులకొద్దీ ఓటర్లు ఎలా ఉంటారన్న విమర్శతో పాటు అసలు అడ్రస్సే లేని వాళ్లకు ఓటరు కార్డులు ఎలా ఇచ్చారన్న ఆరోపణకు కమిషన్ తాపీగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఇక ఒక వ్యక్తి రెండు కార్డులు కలిగి ఉండటం అక్రమమేననీ దానిపై మాత్రం దర్యాప్తు చేస్తామని ప్రకటించింది. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దటానికే బిహార్‌లో తీవ్ర ప్రక్షాళనను చేపట్టామని చెప్పింది. దేశవ్యాప్తంగా దాన్ని అమలుచేస్తామనీ పునరుద్ఘాటించింది. గతంలో కూడా ఒకే అడ్రస్‌పై వందల ఓటర్ల కార్డులు ఉన్నాయన్న ఆరోపణలు వస్తే ఎలక్షన్ కమిషన్ ఈ తరహాలో వివరణ ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు మాత్రం డోర్ నంబర్ లేని వాళ్లకు సున్నా పేరుతో ఓటరు కార్డులు జారీచేశామని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థలు డోర్ నంబరు కేటాయించని ఇళ్లతో పాటు ఎక్కడో ఒకచోట తలదాచుకునే అనేక కుటుంబాలకు ఓటు హక్కుని నిరాకరించకుండా ఉండటానికే సున్నా అడ్రస్‌తో కార్డులు జారీచేశామని వివరించారు. అలాగే సమీపంలో ఉన్న డోర్‌నంబర్‌ను పేర్కొని అర్హులకు కార్డులు ఇచ్చామని కూడా చెప్పారు. నగర ప్రాంతాల్లోని బస్తీల్లో, మురికివాడల్లో ఇది సర్వసాధారణం. రాహుల్‌గాంధీ పేర్కొన్న అయిదు అక్రమాల్లో ప్రత్యక్షంగా అడ్రసుకు సంబంధించినవే 50 శాతానికి పైగా ఉన్నాయి. ఇక నియోజకవర్గ అడ్రస్ మార్పిడికి– కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫాం–6 అక్రమాన్ని కూడా వీటికి కలిపితే 85 శాతం అవుతాయి. వీటిల్లో కొత్త ఓటర్ల సంఖ్యని తీసివేస్తే అడ్రసు సంబంధిత ఆరోపణలే సింహభాగం ఉంటాయి.
ఢిల్లీ, ముంబయిల్లో 30 శాతంపైగా జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోనూ అంతే సంఖ్యలో ఉంటారు. మహదేవపురలో అక్రమ ఓటర్లుగా పేర్కొన్న 1,00,250 మందినీ ఎన్నికలకు ముందుగానే ఓటర్ల జాబితాలో చేర్చారా? లేదా? అన్న విషయం రాహుల్‌గాంధీ స్పష్టంగా చెప్పలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 మేలో జరిగాయి. అప్పటికే మహదేవపురలో 6,07,255 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6,59,826కు పెరిగింది. రెండు ఎన్నికల మధ్య ఏడాది వ్యవధిలో పెరిగిన ఓటర్లు 52,571 మంది మాత్రమే. ఇక 2008లో మహదేవపురలో ఓటర్లు 2,75,299 మంది ఉంటే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6,59,826కు చేరటం అసాధారణంగా రాహుల్ పేర్కొన్నారు. అంటే 140 శాతం పెరుగుదల. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మిగతా అసెంబ్లీ సెగ్మంట్లలో ఈ పెరుగుదల 26శాతం లోపే ఉంది. మహదేవపురలోనే అది 140 శాతానికి పెరగటం ఓట్లచోరీకి నిదర్శనమని రాహుల్ ఆరోపించారు. ఈ అసాధారణత వెనుక అక్రమాలు ఉన్నాయా? లేవా? అన్నది ఎలక్షన్ కమిషనే తేల్చాలి. అయితే ఇతర మెట్రోనగరాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితితో పోల్చితే ఈ అసాధారణ పెరుగుదల మరోచోట లేదని చెప్పలేం. ఉపాధి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రజలు వలసలు పోవటం సాధారణంగా జరుగుతుంది. తెలంగాణలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మంట్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. 2009లో అక్కడ 3,13,160 ఓటర్లు ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి 7,25,102 మందికి పెరిగారు. అంటే 131.54 శాతం పెరుగుదల. ఇదే కాలంలో శేరిలింగంపల్లి సెగ్మంట్‌లో (3,80,856–7,58.160) పెరుగుదల 99.17 శాతం ఉంది. అదే కూకట్‌పల్లి సెగ్మంట్‌లో ఆ పెరుగుదల (3,85,031–4,82,107) 25.22 శాతానికే పరిమితమైంది. భౌగోళిక సామీప్యత ఉన్న చోట్లే ఈ తేడాలు ఉన్నాయి.
దేశంలోని పది మెట్రో సిటీలతో పాటు 10 లక్షల జనాభా దాటిన 55 నగరాల్లో సైతం.. అనర్హులను ఓటర్ల జాబితాలో కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు చేర్చి ఉంటే ప్రజాస్వామ్యంపైనే మనకు అపనమ్మకం కలుగుతుంది. ఈ మొత్తం 65 నగర ప్రాంతాల్లో దాదాపుగా 25 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. ఇందులో ఓటర్లు 67శాతం అనుకుంటే వాళ్ల సంఖ్య 16.75 కోట్లు ఉంటుంది. అవకతవకలు భారీగా జరిగితే 94 చోట్ల ఫలితాలు ప్రభావితం అవుతాయి. మహదేవపురలో చేర్చినట్లు 20శాతం కాకుండా మిగతా చోట్ల 10శాతం మందిని అక్రమంగా చేర్చినా ఫలితాలను మార్చే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది.
నిజానికి వలసలకు అనువైన ప్రాంతాల్లోనే ఓట్ల చేరికలపై ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించదు. అన్ని పార్టీలు వలసజీవులను ఓటర్లుగా చేర్పించటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాయి. వలసజీవులు కూడా ఎన్నికలప్పుడు పార్టీలు ఇచ్చే డబ్బు కోసం ఓటర్లుగా నమోదు అవుతారు. అదే కాకుండా ఓటరు కార్డును కలిగి ఉండటంతో సంక్షేమ పథకాల లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఒక పార్టీ ప్రాపకంతో అక్రమంగా ఓటరుగా నమోదయ్యే వ్యక్తి ఆ పార్టీకే ఓటు వేస్తారనే పూచీ ఉండదు. ఎటు మొగ్గుతారో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇక్కడ మరో విశేషం ఉంది. ఓట్ల చోరీతో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ ఫలితాన్ని తారుమారు చేశారని కాంగ్రెస్ ఎంత గట్టిగా ఆరోపణలు చేసినా అక్కడ ఆ పార్టీ ఎప్పుడూ గెలవలేదు. మహదేవపుర అసెంబ్లీ సెగ్మంట్‌లోనూ అదే పరిస్థితి. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మంట్లు ఉంటే, కాంగ్రెస్‌కు అయిదుచోట్ల మెజారిటీ వస్తే బీజేపీకి మూడు చోట్ల ఆధిక్యత లభించింది. కానీ మహదేవపురలో వచ్చిన 1,14,046 ఓట్ల మెజారిటీ ఫలితాన్ని తారుమారు చేసింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి (44,501) అక్కడ ఆధిక్యత వచ్చింది. ఇక పక్కనే ఉన్న సర్వజ్ఞనగర్ సెగ్మంట్‌లో కాంగ్రెస్‌కు 74,244 ఓట్ల మెజారిటీ (లోక్‌సభ) లభించింది.
పార్టీల ఆరోపణల్లో నిజాలు కొన్నే ఉంటాయి. వ్యవస్థలన్నిటినీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం సర్వసాధారణమైన పరిస్థితుల్లో కొన్ని ఆరోపణలకు విపరీత ప్రాచుర్యం వస్తుంది. వ్యవస్థలను శాసిస్తున్నవారే వాటిపై దర్యాప్తు జరిపి నిజానిజాలను ప్రజలముందు పెట్టటం కనీస బాధ్యత. ఇదేమీ లేనట్లుగా ఎన్నికల కమిషన్ ఎదురుదాడిని ఎంచుకోవటం, బిహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సైతం అదే ధోరణిలో వాదించటంతో ప్రజల్లో అనుమానాలు ఇంకా బలపడ్డాయి. చివరికి బిహార్‌లో 65లక్షల మంది ఓట్లను ఎందుకు తొలగించారో కారణాలతో సహా ప్రజల ముందు పెట్టి వాళ్ల అభ్యంతరాలను స్వీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో ఇప్పుడు అసలు చిత్రం వెల్లడయ్యే అవకాశం ఉంది.
అందరి దగ్గరా ఉన్న ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోకుండా తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు, పదోతరగతి, నివాస, కుల సర్టిఫికెట్లు లాంటివి ఉంటేనే ఓటర్ల జాబితాలో పేర్లను కొనసాగిస్తామనే షరతులను విధించటంతో కలకలం చేలరేగింది. కమిషన్ నిర్దేశించినట్లుగా కింది వర్గాల ప్రజలకు వీటిని సంపాదించటం సాధ్యంకాదనీ ఫలితంగా నష్టపోయేది ఆ వర్గాలేననీ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సర్వేలో స్పష్టమైంది. ఆధార్ కార్డుల గురించి గొప్పలు చెప్పుకొని ఇప్పుడు వాటికి విలువలేదని అనటం మొత్తం పాలనా వ్యవస్థకే నగుబాటుగా మారింది. అది చాలదన్నట్లుగా తాను స్వయంగా జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డులను కూడా పరిగణనలోకి తీసుకోబోమని చెప్పటం కమిషన్ విశ్వసనీయతను దిగజార్చింది. తాను రూపొందించిన చట్టాలను సైతం గట్టిగా అమలుచేయలేని బలహీన ప్రభుత్వ వ్యవస్థ (సాఫ్ట్‌స్టేట్) భారత్‌లో ఉందని 1968లోనే ప్రఖ్యాత ఆర్థికవేత్త గనర్ మిర్డాల్ తన ‘ఏషన్ డ్రామా’ పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు ఈనాటికీ అక్షరసత్యాలే అన్నట్లుగా కమిషన్ వైఖరి ఉంది. ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓట్లు కలిగి ఉండటం ఇప్పటికీ ఉంది. ఓటర్ పోర్టల్ ద్వారా పెట్టుకున్న దరఖాస్తులపై నెలల తరబడి తాత్సారం చేయటమూ జరుగుతోంది. చనిపోయిన వాళ్లను జాబితాల నుంచి ఎప్పటికప్పుడు తొలగించలేని అశక్తతా ఉంది. నగరాల్లోని ఓటర్ల జాబితాలను నిశితపరిశీలన చేస్తే ఎన్నికల కమిషన్ బోనులో నిలబడి తన రుజువర్తనను నిరూపించుకోక తప్పదు. వ్యవస్థాపరమైన తప్పిదాలనూ, లోపాలనూ అంగీకరించకా తప్పదు. దొంగలెవరో, దొరలెవరో అప్పుడే తేలుతుంది!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి