‘లీగల్ సపోర్ట్ సెల్’ నిబంధనలు పునః పరిశీలించాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:19 AM
రాష్ట్రంలో భూ చట్టాలలో సవరణలకు సంబంధించిన డ్రాఫ్ట్స్ అమెండ్‌మెంట్స్ రూపకల్పనకు, ఫిర్యాదులు పరిష్కరించి మెరుగైన ప్రమాణాలు సూచించడానికి, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిఐఎల్‌ఆర్‌ఎంపి ద్వారా...

రాష్ట్రంలో భూ చట్టాలలో సవరణలకు సంబంధించిన డ్రాఫ్ట్స్ అమెండ్‌మెంట్స్ రూపకల్పనకు, ఫిర్యాదులు పరిష్కరించి మెరుగైన ప్రమాణాలు సూచించడానికి, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిఐఎల్‌ఆర్‌ఎంపి ద్వారా భూ రికార్డుల కంప్యూటరీకరణను అధ్యయనం చేయడానికి, అలాగే సిసిఎల్‌ఏ ఆదేశాల మేరకు ఇతర పనులు చేయడానికి ఒక లీగల్ సపోర్ట్ సెల్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న జీవో 8 జారీ చేసింది. ముగ్గురు సభ్యులతో పనిచేసే ఈ బృందంలో చీఫ్ అడ్వైజర్‌కు లా డిగ్రీతో పాటు భూ చట్టాల మీద, సమస్యలపైన సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉండాలి. దేశ, విదేశాల్లోని భూ సంబంధాల విషయమై అవగాహన కలిగివుండాలి. అలాగే సలహాదారులకు కూడా లా డిగ్రీతో పాటు భూసంబంధ విషయాలు, సమస్యలపై 10 సంవత్సరాల అనుభవం ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
18 రాష్ట్రాల భూ చట్టాలను అధ్యయనం చేసి, ఇటీవల ‘భూభారతి’ చట్టాన్ని రూపకల్పన చేసిన న్యాయనిపుణుడిని దృష్టిలో ఉంచుకొని ప్రధాన సలహాదారుకు ఈ నిబంధనలను రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆ న్యాయ నిపుణుడికి చట్టాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం మాత్రం అనుమానాస్పదమే. గతంలో రాష్ట్ర రెవెన్యూ విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేసి, అన్ని భూ చట్టాల పట్ల అపార అవగాహన, అనుభవం ఉండి, పదవీ విరమణ పొందిన అనేక మంది అధికారులకు లా డిగ్రీ లేకపోవడంతో వారు సలహాదారు పదవులకు ఎంపికయ్యే అవకాశం లేదు. అలాగే గతంలో ఏర్పాటు చేసిన ధరణి అధ్యయన కమిటీలో క్షేత్రస్థాయిలో పనిచేసిన అపార అనుభవం గల రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను మెంబర్లుగా తీసుకున్నప్పటికీ వారు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోలేదన్న వార్తలు వస్తున్నాయి. కేవలం ఒక న్యాయనిపుణుడైన వ్యక్తి ‘భూభారతి’ చట్టాన్ని రూపొందించడం, ప్రభుత్వ పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించడం అనేక సందేహాలకు తావిస్తోంది.
రాష్ట్రంలో అనేక భూ చట్టాలు, వాటి నిబంధనలను అనుభవం గల రెవెన్యూ అధికారులు, న్యాయ విభాగం సలహాలతో గతంలో రూపొందించారు. ఆర్‌ఓఆర్ చట్టం–1971, దానికి అనుబంధంగా 1989లో రూపొందించిన నియమ నిబంధనలు, వివరమైన పలు క్లాసిఫికేషన్‌లను జారీ చేసిన ఐఎఎస్ అధికారి ఆనందరావును ఇప్పటికీ రెవెన్యూ ఉద్యోగి ప్రశంసిస్తూనే ఉంటారు. కాబట్టి జీవో నెం.8లో లా డిగ్రీ ఉండాలన్న నిబంధనతో పాటు, ఇతర నిబంధనలను మరోసారి పరిశీలించి, అపార అనుభవం ఉన్న అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారిని న్యాయ సలహాదారులుగా నియమిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేతుంది. అంతేకాని కొంతమంది వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని నియమ నిబంధనలను రూపొందించడం సరికాదు. దానివల్ల భూ రికార్డులు, భూ చట్టాలు మరింత అధ్వానానికి గురి అవుతాయి. దాంతో భూ సమస్యలకు సరి అయిన పరిష్కారం లభించక, భూ యజమానులు అనేక ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది.
సురేష్ పోద్దార్
విశ్రాంత జాయింట్ కలెక్టర్
Also Read:
ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..
బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..
అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..
For More Andhra Pradesh News and Telugu News..