Speakers Power: స్పీకర్‌కు సుప్రీం’నిర్దేశం
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:56 AM
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు తాము ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పదవి కోల్పోతామని బాగా తెలుసు. కానీ, ‘ఒక ఏడాది హైకోర్టుకు పోదాం, ఆ తరువాత సుప్రీంకోర్టుకు పోదాం, అప్పటికి అయిదేళ్ల పదవీకాలం అయిపోతుంద’ని వారి నమ్మకం. కేవలం...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు తాము ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పదవి కోల్పోతామని బాగా తెలుసు. కానీ, ‘ఒక ఏడాది హైకోర్టుకు పోదాం, ఆ తరువాత సుప్రీంకోర్టుకు పోదాం, అప్పటికి అయిదేళ్ల పదవీకాలం అయిపోతుంద’ని వారి నమ్మకం. కేవలం కోర్టుల ద్వారా ఆలస్యాలను వాడుకుంటూ పదవిలో కొనసాగాలనే ఆశ, దురాశ.
ప్రభుత్వంలోని మూడు ముఖ్య మూలస్తంభాలలో శాసనవ్యవస్థ ఒకటి. శాసనసభ కొనసాగుతున్నంత వరకు సభాపతి ముఖ్యమంత్రి కన్నా గొప్ప అధికారం కలిగిన ‘న్యాయాధికారి’. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను నిర్ణయించేటప్పుడు స్పీకర్ ఒక ట్రిబ్యునల్‌గా నిరంతరం పనిచేస్తూనే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ప్రజా స్వామ్యం కోసం, స్పీకర్ దయచేసి ఫైళ్లపై కూర్చోవద్దు,’’ అంటూ పదిమంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జూలై 31, 2025 నుంచి మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఎ.జి. మసిహ్ ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను నిర్ణయించడంలో త్వరగా వ్యవహరించలేదని మెత్తగా మందలించింది. ఈ పదిమంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థులుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగునెలల్లోనే అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఒక అసెంబ్లీ సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే తన పదవికి అనర్హుడు అవుతాడని పదవ షెడ్యూల్‌లోని పేరా 2(1) పేర్కొంది. అయితే, ఇది పేరా 4కి లోబడి ఉంటుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్షంలో మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాకుండా ఉంటే మరొక పార్టీతో విలీనం కావాలి. లేదా కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటే అనర్హత నుంచి మినహాయింపు లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలోని మొత్తం బీఆర్‌ఎస్ బలంలో మూడింట రెండు వంతుల కంటే తక్కువే కాబట్టి, వీరికి పేరా 4 ద్వారా అనర్హత నుంచి రక్షణ (ఇమ్యూనిటీ) లభించలేదు. ఇటువంటి సందర్భాలలో, అనర్హత పిటిషన్లను స్పీకర్ విధిగా నిర్ణయించాలి. కానీ, పదవ షెడ్యూల్ 1985లో అమలులోకి వచ్చినప్పటి నుంచి, స్పీకర్లు (ఎక్కువగా అధికార పార్టీలకు చెందినవారు) అసెంబ్లీల పదవీకాలం ముగిసే వరకు అటువంటి పిటిషన్లపై తమ నిర్ణయాలను విపరీత ఆలస్యం చేసిన సందర్భాలు అనేకం. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పీకర్లకూ తెలుసు.
సెప్టెంబర్ 9, 2024న, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శిని అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచి, విచారణకు షెడ్యూల్ నాలుగు వారాల్లోగా నిర్ణయించాలని ఆదేశించారు. అప్పటికీ ఏ జవాబూ రాకపోతే, సుమోటోగా కేసు విచారణ తిరిగి ప్రారంభిస్తామని సింగిల్ జడ్జి పేర్కొన్నారు. శాసనసభ కార్యదర్శి దీనిని హైకోర్టులో సవాలు చేశారు (చేయించారు). నవంబర్ 22, 2024న హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను పక్కన పెట్టేసింది. ప్రతివాదులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. నాలుగు వారాల గడువులోగా స్పీకర్ అనర్హత పిటిషన్లను నిర్ణయించేలా ఆదేశించాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం న్యాయసమీక్ష అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. అయితే, అనర్హత పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్/చైర్మన్‌పై న్యాయపరమైన ఆంక్షలు ఉండవు. అనర్హత ప్రశ్నను స్పీకర్ నిర్ణయించకుండా వదిలేస్తే, అది పదవ షెడ్యూల్‌లోని పేరా 6 కవచం కింద పనికి రాదని కోర్టు నిర్ణయించింది. తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో స్పీకర్ ఏడు నెలలకు పైగా నోటీసులు కూడా జారీ చేయలేదు. సుప్రీంకోర్టులో విచారణ మొదలైన తరువాత మాత్రమే నోటీసులు జారీచేశారు. స్పీకర్‌కు రాజ్యాంగం పదో షెడ్యూల్డ్ కవచం లేదనీ, ఒక ట్రిబ్యునల్‌గా పనిచేసే స్పీకర్ త్వరగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. స్పష్టమైన గడువు పెట్టింది. ఈ తీర్పు పదవ షెడ్యూల్ అమలును బలపరుస్తుంది. కానీ నిష్క్రియను, దీర్ఘకాలిక ఆలస్యాలను ఒప్పుకోదు. మూడు నెలల్లోగా అనర్హతను నిర్ణయించాలని స్పీకర్‌ను ఆదేశించడం మంచి తీర్పు.
మాడభూషి శ్రీధర్
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి