Share News

World Bank : తటస్థ తీర్పరి

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:22 AM

జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్‌ కేంద్రాలకు సంబంధించి భారత్‌ పాకిస్థాన్ మధ్య విభేదాలను పరిష్కరించే అధికారం తనకు ఉన్నదని ప్రపంచబ్యాంకు నియమించిన

World Bank : తటస్థ తీర్పరి

జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్‌ కేంద్రాలకు సంబంధించి భారత్‌ పాకిస్థాన్ మధ్య విభేదాలను పరిష్కరించే అధికారం తనకు ఉన్నదని ప్రపంచబ్యాంకు నియమించిన తటస్థనిపుణుడు ఇటీవల చేసిన నిర్థారణ భారతదేశానికి పెద్ద ఉపశమనం. తటస్థ నిపుణుడు మైఖేల్‌ లీనో తీసుకున్న ఈ నిర్ణయం అనాదిగా భారత్‌ వాదనను సమర్థించిందని మనదేశం ప్రకటించింది. సింధునదీ జలాల ఒప్పందం ప్రకారం ఉభయదేశాల మధ్యా రేగిన ఈ విభేదాలను పరిష్కరించే అధికారం, సామర్థ్యం తటస్థ నిపుణుడికి మాత్రమే ఉన్నదని భారతదేశం వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే, 1960లో ఉభయదేశాలూ చేసుకున్న ఈ నదీజలాల ఒప్పందాన్ని మారిన పరిస్థితుల నేపథ్యంలో సమీక్షించి, సవరించుకోవాలంటూ భారతదేశం రెండేళ్ళుగా పాకిస్థాన్‌ను పోరుతున్న అంశానికీ, ఈ సరికొత్త పరిణామానికీ సంబంధం లేదు. దీనికితోడు, తీర్పరి ఎవరంటూ ఎంతోకాలంగా రెండుదేశాల మధ్యా సాగుతున్న వివాదాన్ని ఈ నిర్ణయం కొత్తమలుపు తిప్పిన మాట నిజం.

సింధునదికి ఉపనదులైన జీలం, చినాబ్‌మీద భారతదేశం జలవిద్యుత్‌ కేంద్రాలను నిర్మిస్తూండటం పాకిస్థాన్‌ వ్యతిరేకిస్తోంది. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంలో, రెండుదేశాలమధ్యా ఆరుదశాబ్దాల క్రితం కుదిరిన ఈ ఒప్పందానికి లోబడి ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, నీటి స్వేచ్ఛా ప్రవాహాన్ని ఈ నిర్మాణాలు ఏమీ అడ్డుకోవడం లేదని భారతదేశం అంటోంది. అయినా, ఈ రెండు ప్రాజెక్టులమీద పాకిస్థాన్‌ అభ్యంతరం లేవనెత్తి ఆర్బిట్రేషన్‌ కోర్టును ఏర్పాటుచేయవలసిందిగా ప్రపంచ బ్యాంకును డిమాండ్‌ చేసింది. వివాద పరిష్కారానికి తటస్థనిపుణుడి నియామకాన్ని ఒప్పందం నిర్దేశిస్తున్నదని భారతదేశం గుర్తుచేసింది. తగువు ఎవరు తీర్చాలన్న అంశంమీద ఈ రెండుదేశాల తగువుతో తలపట్టుకున్న ప్రపంచబ్యాంకు ఉభయులవాదనలకూ లొంగింది. భారత్‌ కోరినమేరకు మైఖేల్‌ లీనోను తటస్థనిపుణుడిగా, పాక్‌ కోరినప్రకారం షాన్‌మర్ఫీ అధ్యక్షతన మధ్యవర్తిత్వకోర్టునూ 2022లో నియమించింది. ఇలా రెండు వివాద పరిష్కార వ్యవస్థలు ఉండటం సమస్యను మరింత జటిలం చేస్తుందని, ఒకే సమస్యకు రెండు పరిష్కారాలు ముందుకు వస్తే ఆచరణలో సమస్యలు తలెత్తుతాయని భారత్‌ స్పష్టంచేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో, తానే తీర్పరినంటూ తటస్థనిపుణుడు చేసిన ప్రకటనను భారత్‌ స్వాగతించడం సహజం.


రెండుదేశాలూ కూడా మొదట తటస్థనిపుణుడి విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నప్పటికీ, 2016లో పాకిస్థాన్‌ మనసు మార్చుకొని ఆర్బిట్రేషన్‌ కోర్టును డిమాండ్‌ చేయడం, ఆ ప్రతిపాదనను ఆదిలో తిరస్కరించిన ప్రపంచబ్యాంకు ఆఖరుకు లొంగిరావడం భారత్‌కు ఆగ్రహం కలిగించింది. హేగ్‌లో ఈ కోర్టులో జరిగేవాదోపవాదాలకు హాజరుకాకుండా తన నిరసనను తెలియచేస్తూ వచ్చింది. వివాదాన్ని పరిష్కరించే అధికారం తటస్థ నిపుణుడికి ఉన్నదని ఈ కొత్త పరిణామం తేల్చినప్పటికీ, అర్బిట్రేషన్‌ కోర్టుకు ఏ అధికారాలూ ఉండబోవని కాదు. సాంకేతికాంశాలను నిగ్గుతేల్చి న్యాయం చెప్పే అధికారం నిపుణుడికి ఉన్నప్పటికీ, కోర్టు పరిధిలోకి వచ్చే మిగతా కొన్ని అంశాలు అలాగే ఉంటాయన్నది సదరు ప్రకటన సారాంశం. కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్‌ ప్రాజెక్టుల సాంకేతిక, నిర్మాణ అంశాలమీద రాబోయే రోజుల్లో ఈ తటస్థనిపుణుడి సమక్షంలో ఉభయదేశాలూ తమ వాదనలను వినిపించవచ్చు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి పాకిస్థాన్‌ లేవనెత్తిన ఏడు అభ్యంతరాలూ ఈ నిపుణుడి పరిధిలోకి రాబోతూండటం, ఆర్బిట్రేషన్‌కోర్టు ఈ అంశాల జోలికి రాకపోవడం భారతదేశానికి మేలుచేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. తటస్థ నిపుణుడి నిర్ణయానికి ఉభయపక్షాలూ కట్టుబడటం గతంలో జరిగినప్పటికీ, మూడుదశల పరిష్కార వ్యవస్థలో పైస్థాయిలో కోర్టు కూడా ఉన్నందున పాకిస్థాన్‌ కొత్త మెలికలు పెట్టవచ్చునన్న అనుమానాలూ ఉన్నాయి. నెహ్రూ–అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేసిన ఈ సింధునదీజలాల ఒప్పందం తొమ్మిదేళ్ళ సుదీర్ఘచర్చల అనంతరం ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంలో అత్యంత పటిష్ఠంగా రూపుదిద్దుకుంది. అనంతరకాలంలో అనేక దేశాలమధ్య ఈ తరహా ఒప్పందాలకు ఇది ఆదర్శంగా నిలిచింది. భారత్‌–పాకిస్థాన్‌ మధ్య కించిత్తు సయోధ్య లేకున్నా ఆరుదశాబ్దాలుగా నిలిచిన ఈ ఒప్పందాన్ని వివాదాల్లోకి లాగకుండా జాగ్రత్తపడటం ఇరువురికీ మంచిది.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 04:22 AM