Share News

యుద్ధం–లాభం

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:28 AM

అదే యుద్ధం గురించి అమెరికా నోట మొన్నటివరకూ విన్న భాష ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బైడెన్‌ పోయి ట్రంప్‌ రాగానే యుద్ధంలో హీరోలు, విలన్లు ఒక్కసారిగా తారుమారైనారు....

యుద్ధం–లాభం

అదే యుద్ధం గురించి అమెరికా నోట మొన్నటివరకూ విన్న భాష ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బైడెన్‌ పోయి ట్రంప్‌ రాగానే యుద్ధంలో హీరోలు, విలన్లు ఒక్కసారిగా తారుమారైనారు. మూడేళ్ళ రష్యా–ఉక్రెయిన్‌ ఘర్షణలో దురాక్రమణదారుడని బైడెన్‌తో అనిపించుకున్న పుతిన్‌ను ట్రంప్‌ సమర్థించుకొస్తున్నారు. అయ్యోపాపం అని బైడెన్‌ జాలిపడిన జెలెన్‌స్కీని యుద్ధపిపాసివి నీవేనంటూ తిట్టిపోస్తున్నారు. తాను శ్వేతసౌధంలో ఉండివుంటే అసలు యుద్ధమే వచ్చేది కాదని, తాను అధ్యక్షుడు కాగానే యుద్ధం ఆగిపోతుందని ట్రంప్‌ ఎన్నికల కాలంనుంచీ చెబుతున్నారు. సంధిలో కాస్తంత ఎక్కువ న్యాయం పుతిన్‌కు దక్కుతుందని విశ్లేషకులు సైతం ఎప్పటినుంచో అంటున్నదే. కానీ, జెలెన్‌స్కీని ట్రంప్‌ మరీ ఇంత నాటుగా విమర్శిస్తారని, ఆ మాటలన్నీ పూర్తిగా రష్యా పక్షాన, ఏకంగా పుతిన్‌ నోటనుంచి ఊడిపడినట్టుగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు.


నియంత, హాస్యగాడు, ముందుచూపులేనివాడు, దుందుడుకు మనిషి ఇత్యాది మాటలతో, తక్షణమే దారికిరాకపోతే దేశాన్నే కోల్పోతావన్న హెచ్చరికలతో జెలెన్‌స్కీని ట్రంప్‌ ఘాటుగా బెదిరించారు. యుద్ధం ఆరంభించింది ఉక్రెయిన్‌ అని పుతిన్‌ మాటనే అమెరికా అధ్యక్షుడు వల్లెవేశారు. ఆదిలోనే రష్యాతో రాజీపడాల్సిన, యుద్ధాన్ని ముందుగానే నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడిదేనని ట్రంప్‌ తేల్చేశారు. రష్యా శక్తిముందు నువ్వెంత, నీ బలమెంత? అని శల్యసారథ్యం చేశారు. యుద్ధం చేసే బలం లేదని తెలిసీ తొడగొట్టిన ఈ దూకుడుమనిషి కారణంగానే వేలాదిమంది సైనికులు, ప్రజలూ ప్రాణాలు కోల్పోయారట. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్‌స్కీ యుద్ధం వరకూ తెచ్చాడని, ఇప్పుడు ఉన్నది కాస్తా ఊడిందంటూ ఈ యుద్ధంలో అంతిమవిజయం పుతిన్‌దేనని ట్రంప్‌ తేల్చేశారు. అపారమైన నష్టం, తప్పుడు నిర్ణయాలు, తెలివితక్కువతనం ఇత్యాది ట్రంప్‌ మాటలన్నీ పూర్తిగా జెలెన్‌స్కీని ఉద్దేశించినవే తప్ప, రష్యాను కానీ, పుతిన్‌ను కానీ ఆయన గట్టిగా తప్పుబట్టిందీ, ఘాటుగా అన్నదీ ఏమీ లేదు.


సౌదీ శాంతిచర్చలకు తనను ఆహ్వానించనందుకు జెలెన్‌స్కీ ఆగ్రహించడం, ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా యుద్ధాన్ని ఎలా ముగిస్తారని ప్రశ్నించడం అసమంజసమేమీ కాదు. అందుకు ప్రతిగా ట్రంప్‌ ఈ స్థాయిలో విరుచుకుపడటం, జెలెన్‌స్కీ వెంటనే దిగివస్తే కోల్పోయిన భూమిని ఇప్పిస్తానని, లేదంటే ఏలుకోవడానికి దేశమే ఉండదని హెచ్చరించడం విచిత్రం. ఉక్రెయిన్‌కు స్థానం లేకుండా చర్చలు ఆరంభించాలని వారం క్రితం అమెరికా–రష్యా అధ్యక్షులు నిర్ణయించినప్పటినుంచీ జెలెన్‌స్కీ తెగబాధపడుతున్నారు. నాటో ఇప్పటికైనా నిజాన్ని గ్రహించాలని, సొంత సైన్యాన్ని నిర్మించుకోవాలని ఏవేవో సలహాలు ఇస్తున్నారు. యుద్ధాన్ని ముగించే విషయంలో ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవుగానీ, ఆ పని ఎలా జరగాలన్న విషయంలో ఉక్రెయిన్‌, యూరప్‌ అనుకున్నదానికి పూర్తిభిన్నంగా ట్రంప్‌ ఆలోచనలు ఉంటాయన్నది నిజం. ఆయన విమర్శలన్నీ ఉపరితలంలో పుతిన్‌ పక్షాన ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, పూర్తిగా అమెరికా ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాల దృష్టితోనే ఆయన వ్యవహరిస్తారన్నది సుస్పష్టం. తనకు నచ్చినరీతిలో గుదిగుచ్చిన శాంతి ఒప్పందానికి, భూ పంపకాలకు జెలెన్‌స్కీని లొంగదీయడం లక్ష్యంగా ఆయన ఈ మాటలన్నీ అంటున్నారనీ, ఉక్రెయిన్‌ ప్రజల దృష్టిలో అమెరికాకు నచ్చని జెలెన్‌స్కీ పరువు మరింత దిగజార్చి, ఒప్పందానికి అడ్డుపడుతున్న ఆయనను ఇంతలోగానే దింపివేయాలన్నది లక్ష్యం కావచ్చు. దాదాపు రెండువందల బిలియన్‌ డాలర్ల ఆర్థిక, ఆయుధసాయంతో ఈ మూడేళ్ళ యుద్ధకాలంలో ఉక్రెయిన్‌ను ఆదుకున్న అమెరికా, అనంతరకాలంలో అనేక రెట్లు దోచుకుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నదే. గాజాను రియల్‌ఎస్టేట్‌ కళ్ళతో చూసినట్టుగా, ఇప్పుడు ఉక్రెయిన్‌ను ఆయన ఖనిజాల గనిగా చూస్తున్నారు. అత్యంత విలువైన, అరుదైన ఖనిజాల్లో సగం తవ్వుకోనిస్తే అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆయన ఈ మధ్యనే ఓ హెచ్చరికలాంటి ప్రతిపాదన చేశారు. ఇది ఐదువందల బిలియన్‌ డాలర్ల శాంతి ఒప్పందం అంటూ అమెరికా పత్రికలే వ్యాఖ్యానిస్తున్నాయి. కడవరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ఇలా మిత్రుడిని నడిమధ్యలో వదిలేయడం అగ్రరాజ్యానికి పరువుతక్కువన్న హెచ్చరికలు, హితవులు ఈ తెలివైన వ్యాపారికి ఏమాత్రం పట్టవు.


Also Read: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?

Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..

Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు

Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం

For National News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 12:28 AM