Festivals : జాతరలలో జర జాగ్రత్త
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:14 AM
గంగానమ్మ, మైసమ్మ, పోచమ్మ, అంకమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరునాళ్ళు నిర్వహిస్తారు. అదే విధంగా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున రెండు మూడు రోజులు తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఇవన్నీ మన సంస్కృతి,
గంగానమ్మ, మైసమ్మ, పోచమ్మ, అంకమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరునాళ్ళు నిర్వహిస్తారు. అదే విధంగా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున రెండు మూడు రోజులు తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఇవన్నీ మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా జరుపుకుంటారు. వివిధ జాతరలు, తిరునాళ్ళు సందర్భంగా ఊరంతా సందడిగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు కలవడానికి ఇవి చక్కటి వేదికలుగా ఉపయోగపడతాయి. కొన్ని జాతరలని ఏడాదికి ఒకసారి నిర్వహిస్తారు. ప్రస్తుతం నాగోబా జాతర జరుగుతున్నది. సమ్మక్క సారక్క వంటి మరికొన్ని జాతరలు రెండేళ్ల కొకసారి నిర్వహిస్తారు. జాతరల సమయంలో పెద్ద ఎత్తున ఒకేచోట జనం చేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేయకపోతే ప్రజలకు తాగునీరు, ఆహారం కొరత ఏర్పడుతుంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎలాగూ తప్పవు. అలాగే వివిధ ప్రాంతాల్లో జాతరలు ముగిసిన వెంటనే సరైన పరిశుభ్రత చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆ ప్రాంతంలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా ఫిబ్రవరి నుండి మే వరకు తిరునాళ్ళు, జాతరలు ఎక్కువగా జరుగుతాయి. తిరునాళ్ళు సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులకి మంచి డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వాలతో పాటు, ప్రజలు కూడా జాతర్ల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాతరలు జరిగే ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. అదే విధంగా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అలాగే జీవ హింస కూడా ఎక్కువగా జరుగుతుంది. మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో వివిధ మతాలకి చెందిన తిరునాళ్ళు కూడా జరుగుతుంటాయి. ఇవి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆచారాలని ప్రజలు పాటిస్తూనే, కాలానుగుణంగా వచ్చే మార్పులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటి పరమార్థం నెరవేరుతుంది.
– యం. రాం ప్రదీప్
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News