Indian Constitution : వెలుగు బాటలో వైరుధ్యాల భారతం!
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:39 AM
4 నవంబర్ 1948న రాజ్యాంగ సభలో ఈ నెల 26న మనం భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయవేత్తలకు, అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు అదొక సందర్భమవుతుంది. తమ పాలన గురించి ఘనంగా చెప్పుకునేందుకు వారు ఆ శుభ దినాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. రాజ్యాంగాన్ని ఆమోదించే ముందు
నిజానికి, ఈ కొత్త రాజ్యాంగచట్టం కింద ఏదైనా పొరపాటు జరగడమే కనుక సంభవిస్తే, అందుకు కారణం అది దుష్టమైన రాజ్యాంగమవటం వల్ల మాత్రం కాదు. మనం చెప్పగలిగేదేమంటే, మనిషి దుష్టుడని.
– బి. ఆర్. అంబేడ్కర్
4 నవంబర్ 1948న రాజ్యాంగ సభలో ఈ నెల 26న మనం భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయవేత్తలకు, అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు అదొక సందర్భమవుతుంది. తమ పాలన గురించి ఘనంగా చెప్పుకునేందుకు వారు ఆ శుభ దినాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. రాజ్యాంగాన్ని ఆమోదించే ముందు నాటి న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చేసిన హెచ్చరికలను గుర్తుచేస్తూ దేశ పాలకుల ఉల్లాసోత్సాహాల మనస్థితిని నిగ్రహించదలుచుకున్నాను.
రాజ్యాంగ స్వరూప స్వభావాలు, నియమ నిబంధనల గురించి మూడు సంవత్సరాల పాటు జరిగిన చర్చలలో అంబేడ్కర్ పలుమార్లు జోక్యం చేసుకుంటూ ఆ చర్చలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశారు. 4 నవంబర్ 1948న రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ఒక అసాధారణ ప్రసంగం చేశారు. ఒక ఏడాది అనంతరం రాజ్యాంగం తుది ప్రతిని సభకు నివేదిస్తూ మరో చరిత్రాత్మక ప్రసంగం వెలువరించారు. రెండో సందర్భంలో వెలువరించిన ప్రసంగంలోని పలు భాగాలు సుప్రసిద్ధమైనవే అయినా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవలసిన ప్రాధాన్యమున్నవి. అవి భారతీయుల వీరారాధన ప్రవృత్తికి సంబంధించినవి. ‘‘ప్రజాస్వామ్యాన్ని రూపంలోనే కాక, వాస్తవంగా కూడా పరిరక్షించుకోవాలంటే మనం చెయ్యవల్సిందేమిటి? జాన్ స్టువర్ట్ మిల్ చేసిన హెచ్చరికను ఎప్పుడూ మనసులో ఉంచుకోవడం. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆసక్తి ఉన్న వారందరూ కూడా ‘ఓ గొప్ప మనిషి’ కాళ్ల ముందు మన స్వేచ్ఛను సమర్పించటం గానీ, అతడికి అధికారాలను అప్పగించటం గానీ జరిగితే, వారి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేయగల అవకాశం అతడికి లభిస్తుంది కనుక, అలాంటి పని చేయకూడదు’’ అని మిల్ హెచ్చరించారు. అంబేడ్కర్ ఇంకా ఇలా అన్నారు: ‘మిల్ హెచ్చరిక మన దేశంలో మరింతగా అవసరం. ఎందుకంటే ఇక్కడ భక్తి, లేక నాయకుడి పట్ల అతి గౌరవం చెప్పలేని పరిమాణంలో రాజకీయాల్లో పాత్ర వహిస్తుంది; ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ నాయకత్వ పూజ ఇంతగా రాజకీయాల్లో జోక్యం చేసుకోదు. మత పరంగా భక్తి పరుడైతే అది మోక్ష మార్గమవవచ్చు. ఆత్మకు విముక్తి కలగవచ్చు. అయితే రాజకీయంలో భక్తి లేక నాయక పూజ పతనానికీ, అంతిమంగా నియంతృత్వానికీ దారితీసే నిశ్చయమైన మార్గం’.
1970ల్లో ఇందిరాగాంధీ వ్యక్తి పూజ, ఇప్పుడు నరేంద్ర మోదీ వీరారాధనను గమనిస్తే అంబేడ్కర్ వ్యాఖ్యలు ఎంతో ముందు తెలివిడితో చేసినవిగా లేవూ? ఇందిర, మోదీ వ్యక్తి పూజలు వేర్వేరు తీరుల్లో భారత ప్రజాస్వామ్యాన్ని దిగజార్చి వేశాయి. ఈ గుడ్డి ఆరాధనా ప్రవృత్తి రాజకీయేతర రంగాలలోని ప్రముఖులు– క్రికెటర్లు, సినిమా తారలు, వ్యాపార సమ్రాట్‌లు– తదితరుల పట్ల కూడా విపరీతంగా వ్యక్తమవడం అంబేడ్కర్‌ను విస్మయపరిచి ఉండేది కాదు. అయితే ఈ నాటి తన సొంత అనుయాయులు సైతం తనపట్ల అమిత భక్తి ప్రపత్తులు చూపడం బహుశా అంబేడ్కర్‌ను ఇబ్బందికి లోను చేసి ఉండేది.
రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో అంబేడ్కర్ హెచ్చరిక కూడా వర్తమానానికి ఎంతో ప్రాసంగికత ఉన్నదే అనటంలో సందేహం లేదు. ‘మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా రూపొందించుకోవాలని’ ఆయన నొక్కి చెప్పారు. ఆయన ఇలా అన్నారు: ‘1950 జనవరి 26న మనం మన వైరుధ్యాల జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయంగా మనకు సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక ఆర్థిక జీవనంలో అసమానత్వం ఉంటుంది. ఒక మనిషికి ఒక వోటు, ఒక వోటుకు ఒక విలువ అన్న సూత్రాన్ని మనం రాజకీయాల్లో గుర్తిస్తాం. సామాజిక, ఆర్థిక జీవితంలో మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషికి ఒక విలువ ఇచ్చే సూత్రాన్ని పాటించడం జరగదు. ఎంతకాలం మనం ఈ వైరుధ్యాల జీవితాన్ని గడపాలి? మన సామాజిక, ఆర్థిక జీవనంలో ఎంతకాలం సమానత్వ తిరస్కరణ కొనసాగుతుంది?’
కుల పరమైన అసమానతలు భారతీయ సమాజాన్ని ఎంతగా వికృతం చేశాయో వ్యక్తిగత అనుభవం, విద్వత్ పరిశోధన ద్వారా అంబేడ్కర్‌కు పరిపూర్ణ అవగాహన ఉంది. జెండర్ అసమానతలపై కూడా తన సమకాలీన పురుష రాజకీయవేత్తల కంటే ఆయనే ఎంతో జాగరూకత చూపేవారు. దళితులు, మహిళలతో సహా వయోజనులు అందరికీ ఓటు హక్కు కల్పించడం ద్వారా ఒక వ్యక్తి ఒక వోటు అనే సూత్రాన్ని రాజ్యాంగం స్థిరపరిచింది. అయితే ఆ సంవిధానం అమలులోకి వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా ఒక మనిషి ఒక విలువ అనే సూత్రం ఆమోదం పొందనే లేదు.
రాజకీయాలలో సమానత్వం, సామాజిక ఆర్థిక జీవనంలో అసమాననతలు అనే మన జాతి జీవన వాస్తవాన్ని నిరసించడంలో దళితుల, మహిళల హక్కులే ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నాయి. మన సమాజంలో ఉన్న మరో రెండు దుర్బల వర్గాల వారి పట్ల అంబేడ్కర్ స్వల్ప శ్రద్ధ మాత్రమే చూపారు. ఆ సామాజిక వర్గాలు ఆదివాసీలు, మత మైనారిటీలు. 75 సంవత్సరాల ‘రాజ్యాంగ బద్ధ’ ప్రజాస్వామ్యంలో మధ్య భారతంలోని గిరిజన సముదాయాలు పొందిన లబ్ధి స్వల్పాతి స్వల్పమని, కోల్పోయింది అపారమని వర్జినియస్ క్సాక్సా, నందినీ సుందర్, ఫెలిక్స్ పాడెల్ మొదలైన మానవ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.
మత మైనారిటీల విషయానికి వస్తే ముస్లింలు తాము దగా పడ్డామని భావిస్తున్నారు. స్వాతంత్ర్య ఆగమన సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని వారు వాపోతున్నారు. పాకిస్థాన్ ఆవిర్భవించిన తరువాత కోట్లాది ముస్లింలు భారత్‌లోనే ఉండిపోయారు. ఇతర మతస్తులతో పాటు ముస్లింలకు కూడా సంపూర్ణ పౌరసత్వ హక్కులు ఉంటాయనే విషయమై ఆ నాటి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ నెరవేరకపోవడం పట్ల వారు అమితంగా బాధపడుతున్నారు. దశాబ్దాలుగా, మరీ ముఖ్యంగా 2014 నుంచి ముస్లింలకు పౌరసత్వ హక్కులను క్రమంగా నిరాకరిస్తున్నారు. ఆ మతస్థులను పలు విధాల వేధింపులకు గురిచేస్తున్నారు. వారి దేశభక్తిని శంకిస్తున్నారు. వివిధ కళంకాలను వారికి ఆపాదిస్తున్నారు. సామాజిక అసమానతలు, వీరారాధన ప్రవృత్తి విషయమై అంబేడ్కర్ రాజ్యాంగ సభలో చేసిన హెచ్చరికలు ప్రస్తుతం మన దేశం, భారతీయులు ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సూటిగా చేసినవిగా లేవూ?! అంతకు ఒక సంవత్సరం ముందు రాజ్యాంగ సభలోనే ఆయన ఎంతో దూర దృష్టితోనే చేసిన హెచ్చరికలను కూడా మనం తప్పక గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ‘రాజ్యంగ నైతికత’ను మనం పెంపొందించుకోవల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పడాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. రాజ్యాంగ నైతికత గురించి 19వ శతాబ్ది గ్రీస్ చరిత్రకారుడు జార్జి గ్రోట్ చెప్పిన దాన్ని అంబేడ్కర్ తన ప్రసంగంలో ఉటంకించారు. గ్రోట్ ఇలా చెప్పారు: ‘రాజ్యాంగ రూపాల పట్ల అత్యున్నత గౌరవం చూపాలి. రాజ్యాంగ వ్యవస్థల లోపల పనిచేస్తూ అధికారం పట్ల విధేయత చూపిస్తూ, స్వేచ్ఛగా మాట్లాడాలి. పార్టీల మధ్య విభేదాలు ఎంతగా ఉన్నప్పటికీ అన్ని రాజ్యాంగ రూపాల పట్ల తన ప్రత్యర్థులకు ఉండే గౌరవం తనకు ఉన్న గౌరవం కంటే ఏ మాత్రం తక్కువ కాదన్న సంపూర్ణ విశ్వాసం ప్రతి పౌరుని హృదయంలోనూ నెలకొని ఉండాలి’.
ఇటీవలి దశాబ్దాలలో మన రాజకీయాలలో ప్రబలిన పాక్షిక ధోరణులు, జాతీయ రాజకీయ పక్షాల మధ్య పరస్పర అపనమ్మకం చూస్తుంటే ఆ సమున్నత ప్రజాస్వామిక ఆదర్శానికి మన దేశం ఎంత దూరంలో ఉన్నదో స్పష్టమవుతుంది. ఈ పరిణామానికి అంబేడ్కర్ పూర్తిగా విస్తుబోయేవారు కాదేమో? నవంబర్ 4, 1948న రాజ్యాంగ సభలో వెలువరించిన ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు: ‘రాజ్యాంగ నైతికత సహజ భావన కాదు; దాన్ని అలవాటు చేసుకోవాలి. దాన్ని మన ప్రజలు ఇంకా నేర్చుకోలేదని మనం తెలుసుకోవాలి. సారభూతంగా అప్రజాస్వామికమైన భారతదేశపు జనజీవనంలో ప్రజాస్వామ్యమన్నది పై మెరుగు దిద్దడమే అవుతుంది’. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘రాజ్యాంగపు రూపాన్ని మార్చకుండా, పాలనా వ్యవస్థ రూపాన్ని మాత్రమే మారుస్తూ, దాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి పొసగని, వ్యతిరేక రూపంగా చేసి రాజ్యాంగాన్ని పథ భ్రష్టం చేయటానికి ఎంతో అవకాశమున్నది’. ఈ హెచ్చరిక కూడా విషాదకరంగా వాస్తవమవలేదూ? ‘నిబద్ధ ఉద్యోగస్వామ్యం’, ‘నిబద్ధ న్యాయవ్యవస్థ’ను ప్రోత్సహించడం ద్వారా ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అందుకొక ఉదాహరణ నెలకొల్పింది. ఈ ప్రమాదకర భావాలను 2014 తరువాత మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్లింది.
రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ప్రసంగంలోని చివరి వ్యాఖ్యలతో ఈ కాలమ్‌ను ముగించదలుచుకున్నాను: ‘స్వాతంత్ర్యం మనపై బాధ్యతలు మోపిందని మాత్రం మనం మరువకూడదు. స్వతంత్రం రావటం వల్ల, ఏ తప్పు జరిగినా బ్రిటిష్ వారిని నెపమెన్నే అవకాశం మనకు లేదు. ఇంక, ఈ తర్వాత తప్పులు దొర్లితే మరెవరినీ నిందించలేం, మనల్ని మనం తప్ప’. 75 సంవత్సరాల తరువాత మన సమస్యలకు ఇతరులను తప్పు పట్టే ధోరణి మనలో, అంబేడ్కర్ కాలంలో కంటే, మరింతగా ప్రబలిపోయింది. ప్రస్తుత పాలకుల హయాంలో మన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేసే ధోరణి మరింత విపరీత పోకడలు పోతోంది. తమది స్వదేశీ, ఆత్మ నిర్భర్ ప్రభుత్వమని చెప్పుకునే పాలకులు తమ వైఫల్యాలు, అసమర్థతకు శతాబ్దాల నాటి మొగల్ చక్రవర్తులు, 1947లో మన దేశం నుంచి నిష్క్రమించిన బ్రిటిష్‌వారు; 1964లో కీర్తిశేషుడు అయిన జవహర్‌లాల్ నెహ్రూను బాధ్యులను చేస్తున్నారు!
‘1950 జనవరి 26న మనం మన వైరుధ్యాల జీవనంలోకి ప్రవేశించనున్నాం. రాజకీయంగా మనకు సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక ఆర్థిక జీవనంలో అసమానతలు ఉంటాయి. ఒక మనిషికి ఒక వోటు, ఒక వోటుకు ఒక విలువ అన్న సూత్రాన్ని మనం రాజకీయాల్లో గుర్తిస్తాం. మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషికి ఒక విలువ ఇచ్చే సూత్రాన్ని పాటించడం జరగదు. మన సామాజిక, ఆర్థిక జీవనంలో ఎంతకాలం సమానత్వ తిరస్కరణ కొనసాగుతుంది?’ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 75 సంవత్సరాల క్రితమే వర్తమాన భారతదేశానికి సంధించిన ప్రశ్న అది!
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News