Share News

Prakasam Pantulu : ఆంధ్రకేసరి గర్జించిన వేళ

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:28 AM

..అక్కడ రాళ్ల వర్షం మొదలైంది. పోలీసులు లాఠీఛార్జ్‌ మొదలుపెట్టారు. తుపాకులతో, గుర్రాలతో ప్రజల మీదకు దూసుకుపోతున్నారు. ప్రజల హాహాకారాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ‘ఎక్కడ ప్రమాదమో అక్కడ ప్రకాశం’ అన్నట్లుగా ప్రకాశం పంతులు ఎంతమంది వారించినా నడుం బిగించి అక్కడికి పరుగులు తీశారు. ‘‘తెల్లవాడి గుండుకు తెలుగువాడి గుండె ఎదురొడ్డిన ఘడియ’’ అది.

Prakasam Pantulu : ఆంధ్రకేసరి గర్జించిన వేళ

..అక్కడ రాళ్ల వర్షం మొదలైంది. పోలీసులు లాఠీఛార్జ్‌ మొదలుపెట్టారు. తుపాకులతో, గుర్రాలతో ప్రజల మీదకు దూసుకుపోతున్నారు. ప్రజల హాహాకారాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ‘ఎక్కడ ప్రమాదమో అక్కడ ప్రకాశం’ అన్నట్లుగా ప్రకాశం పంతులు ఎంతమంది వారించినా నడుం బిగించి అక్కడికి పరుగులు తీశారు. ‘‘తెల్లవాడి గుండుకు తెలుగువాడి గుండె ఎదురొడ్డిన ఘడియ’’ అది.

‘‘రండిరా, యిది కాల్చుకొండిరా యని నిండు

గుండెలిచ్చిన మహోద్దండమూర్తి

పట్టింపు వచ్చెనా బ్రహ్మంతవానిని

గద్దించి నిలబెట్టు పెద్దమనిషి

తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా

ఆశీర్వదించు దయామయుడు

సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమందు

హోమమొనర్చిన సోమయాజి’’

‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్మృతి అక్షర సత్యం. ఫిబ్రవరి 3, 1928న బ్రహ్మాండమైన హర్తాళ్‌ ఒకటి యావత్‌ భారతదేశంలో సంచలనాన్ని సృష్టించింది. చరిత్రను రచించింది. భారత స్వాతంత్ర్య సమరంలో తెల్లదొరల తుపాకులకు ఎదురు నిలిచి పోరాడే గుండె ధైర్యాన్ని ప్రదర్శించిన సాహసి, ధీరుడి గురించి పలికిన స్మృతి ఇది. ‘సైమన్‌ తిరిగి పో’ హర్తాళ్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కుదిపివేసింది. స్వరాజ్యానికి పునాదులు వేసింది. మద్రాస్‌లో సర్వమూ తానై హర్తాళ్‌కు పిలుపునిచ్చి, జరిపించింది ఒక తెలుగుతేజం... ఆయనే ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. అర్ధ శతాబ్దం పాటు దక్షిణ భారతంలో ప్రజలతో మమేకమై ‘నేనే ప్రజ, ప్రజ అంటే నేనే’ అని నినదించి, అంతగా ప్రభావితం చేసిన ప్రజల మనిషి ప్రకాశం.


స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. 1927–28 సంవత్సరంలో బ్రిటిష్‌వారు మన దేశానికి ఒక కీడు తలపెట్టారు. అదే ‘సైమన్‌ కమిషన్‌’. భారతదేశానికి అవసరమైన చట్ట సవరణలను, సంస్కరణలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించి, మన దేశంలో పర్యటించడానికి పంపింది. ఈ విషయం భారత ప్రజానీకాన్ని కలవరపరచింది. అన్ని రాజకీయ పార్టీలు, అందరు నాయకులు ముక్తకంఠంతో సైమన్‌ కమిషన్‌ను నిషేధించారు. అసలు ఈ కమిషన్‌ ఎవరు కోరారు? మన దేశ రాజ్యాంగ సవరణలను సూచించడానికి వారెవరు. అందులో ఒక్కరు కూడా భారతీయులు లేరు. మన ప్రమేయం లేకుండా, మన వారిని సంప్రదించకుండా ఈ కమిషన్‌ ఎందుకు వచ్చింది? దీనిని తరిమికొట్టండి అన్నారు.

‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదం దేశం నలుమూలలా మార్మోగింది. లాహోరు, లక్నో, కలకత్తా, గుంటూరు, బాపట్ల, బెజవాడ, హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పెద్దయెత్తున హర్తాళ్‌లు జరిగాయి. ఫిబ్రవరి 2న మద్రాస్‌లోని తిలక్‌ ఘాట్‌లో 10 వేల మందిని ప్రకాశం ఇలా ఉత్తేజపరిచారు. ‘‘సైమన్‌ కమిషన్‌ను బ్రిటిష్‌ దేశంలో అన్ని పార్టీలవారు ఆమోదించారు. మన దేశంలో అన్ని పార్టీలు ఏకమై బహిష్కరించిన ఉత్తరక్షణంలో మనకు స్వరాజ్యం వచ్చినట్లే’’ అని ప్రసంగించారు. మొదట దక్షిణాన ఈ ఉద్యమ బాధ్యతను ప్రకాశం పంతులుకు అప్పజెప్పింది కాంగ్రెస్‌ అధిష్ఠానం. బ్రిటిష్‌వారు ప్రజలను భయభ్రాంతులను చేయడానికి 144 సెక్షన్‌ విధించి, ‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఆర్డర్లను జారీ చేసి, మిలిటరీని కూడా మొహరించింది. దీనికి అధిష్ఠానం జంకి ప్రకాశంని సంప్రదించకుండా హర్తాళ్‌ను రద్దు చేసింది. అగ్రనాయకులంతా జరగబోయే బీభత్సాన్ని ఊహించుకుని తప్పుకున్నారు. ప్రకాశం ఈ రెండవ తీర్మానానికి ఎదురొడ్డి తానే స్వయంగా మద్రాస్‌లో ముందు నిలబడి హర్తాళ్‌ జరుపుతానని నిర్ణయించారు. తన స్వీయచరిత్ర ‘నా జీవితయాత్ర’లో ప్రకాశం ఇలా రాసుకున్నారు. ‘‘నిజానికి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులలోనూ, వెనుకంజ వేయడమనేది నా జన్మలో లేదు మనకి.’’


గోఖలే హాల్‌లో ప్రకాశం స్త్రీలనుద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో స్త్రీలు చేయలేని పనులేవి? ఏవీ లేవు. ఇతర దేశాల్లో బహిష్కారోద్యమాలు జరిగేటప్పుడు స్త్రీలు, విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు. మన దేశంలో కూడా 1920–21లో సహాయ నిరాకరణోద్యమంలో అనేక మంది స్త్రీలు పాల్గొన్నారు. అందువల్ల ఎవరూ బెదరనక్కర లేదు. స్త్రీలు తప్పక అసంఖ్యాకులుగా వచ్చి హర్తాళ్‌ను జయప్రదంగా నెరవేర్చాలి.’’

1928, ఫిబ్రవరి 3 ఉదయాన ‘సైమన్‌ కమిషన్‌’ రానే వచ్చింది. ప్రకాశం ఆదేశానుసారం మద్రాస్‌ వీథులన్నీ జనసంద్రంగా మారాయి. పెద్దలు, పిల్లలు, స్త్రీలు, విద్యార్థులు, కార్మికులు, వర్తకులు, లాయర్లు, డాక్టర్లు... ఒకరేమిటి అన్ని ప్రాంతాలవారు, కులాలవారు, మతాలవారు ఉదయం 11 గంటలకల్లా సముద్ర కెరటాలలా పొంగి వచ్చారు. అటు పోలీసులు గుర్రపు దళాలు, తుపాకులతో మొహరించి ఉన్నారు. జనాలలో ఉత్సాహం, ఉద్రేకం నిమిష నిమిషానికీ పెరుగుతున్నాయి. ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదాలు మారుమోగుతున్నాయి. అలజళ్లు చెలరేగాయి. హైకోర్టు, లా కాలేజీ ప్రాంతాలు ఉద్రిక్తపూరితమై వర్ణనాతీతంగా మారాయి. ప్రకాశం రంగప్రవేశం వేళ రానున్నది. అక్కడ రాళ్ల వర్షం మొదలైంది. పోలీసులు లాఠీఛార్జ్‌ మొదలుపెట్టారు. తుపాకులతో, గుర్రాలతో ప్రజల మీదకు దూసుకుపోతున్నారు. ప్రజల హాహాకారాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ‘‘ఎక్కడ ప్రమాదమో అక్కడ ప్రకాశం’’ అన్నట్లుగా ప్రకాశం పంతులు ఎంతమంది వారించినా నడుం బిగించి అక్కడికి పరుగులు తీశారు. అల్లర్లలో ఒక యువకుడిని పోలీసులు కాల్చారు. అతడి మృతదేహం నడిరోడ్డున, రక్తంలో దిక్కూమొక్కూ లేకుండా పడి ఉంది. ప్రకాశం దూసుకొస్తున్నారు. ఆయనను చూడగానే ప్రజలలో ఉత్సాహం, ఉద్రేకం కట్టలు తెంచుకుని నినాదాలు నింగిని అంటాయి.

‘‘తెల్లవాడి గుండుకు తెలుగువాడి గుండె ఎదురొడ్డిన ఘడియ’’ అది. ఇరువైపులా పోలీసులు, మిలటరీ. దూసుకొస్తున్న సింహానికి ఎదురొచ్చి ఒక పోలీసు ‘ఆగు’ అన్నాడు. ‘‘ఆ దేశభక్తుడిని చూడాలి’’ అన్నారు ప్రకాశం. వీల్లేదు, అడుగు ముందుకేశావో, కాలుస్తా’’ అని నేరుగా ప్రకాశం గుండెకు గురిపెట్టాడు. సింహానికా బెదిరింపు! నీకు దమ్ముంటే కాల్చుకో అని గుండె చూపించాడు. అంతా నిశ్శబ్దం. పోలీసుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతలో పక్కనున్న విప్లవకారుడు ‘‘ఆయన ఎవరో తెలియదల్లే ఉందే నీకు, కాల్చుకోండి మేము సిద్ధంగా ఉన్నా’’మని అరిచాడు. అంతే పోలీసు చేతులు వణికాయి, తుపాకీ నేలకొరిగింది. ‘‘ఆంధ్ర కేసరి జిందాబాద్‌... సైమన్‌ గో బ్యాక్‌’’ నినాదాలు అంబరాన్ని తాకాయి. సిపాయి చేతులు జోడిస్తూ, దారి విడిచి ప్రజలను శాంతపరచమని వేడుకున్నాడు.


ఆంధ్రకేసరి’ అన్న బిరుదు అప్పటికే ప్రచారంలో ఉన్న ఈ అపూర్వ సంఘటనతో ప్రపంచం దశదిశలా వ్యాపించింది. ప్రకాశం ఆ యువకుడి మృతదేహాన్ని ఒళ్లోకి తీసుకుని విచారించారు. అతను పార్థసారథి అనే నవయువకుడు అని తెలుసుకుని చాలా బాధపడ్డారు. ఆ రోజంతా మద్రాస్‌ నలుమూలలు తిరిగి ప్రజలను శాంతిమార్గంలో నడిపిస్తూ హర్తాళ్‌ను దిగ్విజయం చేశారు. ప్రకాశం నాయకత్వంలో జరిగిన ఈ హర్తాళ్‌ దేశానికే తలమానికంగా నిలిచింది. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని పెకలించింది. స్వరాజ్యానికి పునాదులు వేసింది.

పేదరికంలో పుట్టి, అకుంఠిత దీక్ష, కఠరో పరిశ్రమతో లాయరుగా ఎదిగి అపరిమిత సంపదను గడించారు ప్రకాశం. గాంధీ పిలుపుతో రాజకీయాలలో ప్రవేశించి, చెన్న రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా, మద్రాస్‌ ప్రీమియర్‌ (ప్రధానిగా), ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించారు. తన సర్వస్వాన్ని స్వరాజ్యానికి, సుపరిపాలనకు, గ్రామ స్వరాజ్యానికి ధారపోశారు. భారత చరిత్రలో ‘ఆంధ్రకేసరి’ గా ధైర్యశాలిగా, త్యాగమూర్తిగా, కపటమెరుగని కర్మయోగిగా సాగిన ఆయన జీవితయాత్ర నిజానికి సాహసయాత్ర. అటువంటి ప్రాతఃస్మరణీయునికి ‘భారతరత్న’ బిరుదు ఎంతో సముచితం.

టంగుటూరి శ్రీరాం

ప్రకాశం అభివృద్ధి, అధ్యయన సంస్థ ప్రధాన కార్యదర్శి

(ప్రకాశం మనవడు)

(ఫిబ్రవరి 3: ‘సైమన్‌ గోబ్యాక్‌’ హర్తాళ్‌కు 97 ఏళ్లు)


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:28 AM