Nithari Verdict: ఇదేమి న్యాయం
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:52 AM
‘మరి, మా పిల్లలను ఎవరు చంపారు?’ అన్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. దేశాన్ని కుదిపేసిన నిఠారీ హత్యకేసులో ద్రోహులెవ్వరో, దోషులెవ్వరో తేల్చకుండానే కథ ముగిసింది. ఎవరికీ ఏ శిక్షాపడకుండా ఇరవైమంది పిల్లల తల్లిదండ్రులకు...
‘మరి, మా పిల్లలను ఎవరు చంపారు?’ అన్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. దేశాన్ని కుదిపేసిన నిఠారీ హత్యకేసులో ద్రోహులెవ్వరో, దోషులెవ్వరో తేల్చకుండానే కథ ముగిసింది. ఎవరికీ ఏ శిక్షాపడకుండా ఇరవైమంది పిల్లల తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. పనివాడు సురేందర్ కోలీ, యజమాని మనీందర్‌సింగ్ పంధేర్ కాక ఆ ఇంట్లో ఏవో దయ్యాలున్నాయని, అవే మీ పిల్లలను చంపాయని కోర్టులు అంటున్నాయా? అని వారు అడుగుతున్నారు. సురేందర్ కోలీమీద మిగిలిపోయిన ఆ ఒక్క కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా ఆ దారుణహత్యాకాండకు ఎవరూ బాధ్యులు కాదనీ, పాపులెవ్వరూ లేరని తేల్చేయడం నిఠారీ నివాసులకు తీవ్ర ఆగ్రహావేదనలు కలిగించడం సహజం.
రెండేళ్ళక్రితం అలహాబాద్ హైకోర్టు ఏకంగా పన్నెండు కేసుల్లో కోలీని బయటపడవేసిన నేపథ్యంలో, ఆ తీర్పును ఎత్తిపడుతూ, ఈ చివరికేసులో సైతం అతడు నేరం చేశాడని నిర్థారించలేమని, వదిలేయమని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అతడివి బలవంతపు నేరాంగీకారాలేనని కోర్టు నమ్ముతోంది. నిఠారీ రాక్షసుడు, మృతదేహాలతో రమించే కామాంధుడు అంటూ కోలీకి అనేక పేర్లు పెడుతూ, యజమాని ఆదేశాల మేరకే ఇదంతా చేశాడని ఒకదశలోనూ, ఆ తరువాత పంధేర్ ప్రమేయం లేకుండా ఇతగాడే అన్నీ చేశాడన్నది పోలీసులూ సీబీఐ ఆరోపణ. చుట్టుపక్కల నిరుపేద పిల్లలను ఊరించి, బంగ్లాకు రప్పించి, అఘాయిత్యాలు, హత్య అనంతరం భవనం వెనుక ఉన్న కాలువలో మృతదేహాల విడిభాగాలు పడవేశారన్నది అభియోగం. దర్యాప్తు సాగుతున్నంతకాలం అధికార, అనధికార కథనాలకు హద్దేలేకపోయింది. పూర్తిగా ఒక్క మృతదేహమూ లభ్యం కాకుండా శరీరభాగాలు మాత్రమే కాలువలో లభించినందున కోలీని నరమాంసభక్షకుడన్నారు, వీరిద్దరూ ఆర్గాన్‌రాకెట్ అధిపతులనీ అన్నారు. పంధేర్‌ను నేరస్థుడుగా నిర్థారించడానికి అత్యంత కీలకంగా నిలిచిన కోలీ నేరాంగీకారం విషయంలో వివిధస్థాయి న్యాయస్థానాలు భిన్న వైఖరి తీసుకోవడం కూడా కేసు బలహీనపడటానికి దోహదం చేసింది. ఇదే నేరాంగీకారం ఆధారంగా దిగువకోర్టు ఇరువురికీ మరణశిక్ష విధిస్తే, హైకోర్టులో అది చెల్లకుండా పోయింది. నీఠారీ హత్యల్లో విచారణకు వచ్చిన తొలి కేసులో ఇదే నేరాంగీకారాన్ని సెషన్స్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు సైతం ఆమోదించి ఉరిశిక్ష ఖరారు చేయడం, కోలీ క్షమాబిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి నిరాకరించడం, ఆ తరువాత మళ్ళీ ఉరి నిలిచిపోవడం వంటి పరిణామాలు తెలిసినవే. మిగతా పన్నెండు కేసులకూ కూడా కీలకమైన ఈ నేరాంగీకారాన్ని కోలీ తరఫు న్యాయవాదులు సాంకేతికంగా అనర్హమైనదని నిరూపించగలిగారు. దీనికి ముందు అరవైరోజుల పాటు పోలీసు కస్టడీలో ఉండటం, కేవలం ఐదునిముషాలు మాత్రమే ఆయన తన న్యాయసహాయకుడితో మాట్లాడగలడం వంటి చిన్నచిన్న అంశాలు ఇందుకు ఉపకరించాయి. కోలీ, పంధేర్ నివాసం సమీపంలో ఉన్న ఒక వైద్యుడిమీద అప్పటికే శరీరభాగాల అక్రమరవాణా కేసులున్న నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అలహాబాద్ హైకోర్టు కోలీనీ, మిగిలిన రెండు కేసుల్లోనూ పంధేర్‌ను పూర్తిగా వదిలేసింది. అనుమానం ఎంతగట్టిగా ఉన్నా, ఆధారాలు బలంగా లేనప్పుడు కేసు నిలవదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య సముచితమైనదే. కానీ, ఒకే హత్యాకాండకు సంబంధించి వేర్వేరు న్యాయస్థానాలు భిన్నమైన పరిగణనలు, దృక్పథాలు, తీర్పుల ఆధారంగా వీరిద్దరూ నిక్షేపంగా బయటపడగలిగారన్నదీ వాస్తవం.
ఇరవై హత్యలకు వీరిద్దరూ కారకులు కానప్పుడు, కేసుమొత్తం వారిచుట్టూనే తిప్పుతూ, రెండుదశాబ్దాలపాటు పలుమార్లు పలురకాల శిక్షలు ఎందుకు వేశారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు. నిందితులు వీరు కాదని తేల్చేసిన న్యాయస్థానాలు కేసు తప్పుదోవపట్టినందుకు అధికారులను బాధ్యులను చేసివుంటే బాగుండేది. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగించినా, అది న్యాయప్రమాణాలకు అనుగుణంగా నిలవలేకపోయిందని న్యాయస్థానం అంటోంది. అటువంటప్పుడు ఇద్దరు అమాయకులను రెండుదశాబ్దాలపాటు ఘోరమైన ఆరోపణలతో వేధించి, అవమానించిన వారంతా దండనార్హులు కాదా? అన్నది మంచి ప్రశ్న. న్యాయస్థానాలు వదిలేసినా, తమ పిల్లలను పొట్టనబెట్టుకున్న ఆ ఇద్దరినీ దేవుడు క్షమించడని నిఠారీవాసుల నమ్మకం.
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి