Share News

Modi Manipur Visit: శాంతిసీమగా మణిపూర్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:04 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్‌ను సందర్శించనున్నారు. ఎప్పుడో జరగాల్సిన ఈ పర్యటన ఆ దుఃఖభూమికి ఇప్పటికైనా ఉపశమనం కలిగిస్తే అదే పదివేలు...

Modi Manipur Visit: శాంతిసీమగా మణిపూర్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్‌ను సందర్శించనున్నారు. ఎప్పుడో జరగాల్సిన ఈ పర్యటన ఆ దుఃఖభూమికి ఇప్పటికైనా ఉపశమనం కలిగిస్తే అదే పదివేలు!

దురదృష్టకర ప్రజాసమూహాల కథలన్నీ వలసపాలనతో ప్రారంభమయ్యాయి. మణిపురీల చరిత్ర ఇందుకు భిన్నంకాదు. బ్రిటిష్‌ వలసపాలకులు మణిపూర్‌ను కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలుగా విభజించి ఆ రెండిటిని వేర్వేరు పరిపాలనా వ్యవస్థల కింద ఉంచారు. ఈ వేర్పాటు కొండ ప్రాంతాలలో అధికంగా ఉండే కుకీజోలు, మైదాన ప్రాంతాలలో సంపూర్ణ ప్రాబల్యమున్న మెయితీల మధ్య వైమనస్యతను సృష్టించించింది. అది క్రమంగా తీవ్రతను సంతరించుకుని ఇప్పటికీ వైషమ్యాలను రగుల్కొలుపుతోంది.

కొండ ప్రాంతాలలో ఉండే కుకీజోలు, ఇంకా నాగాలు మొదలైన తెగలవారు రాష్ట్ర జనాభాలో 47 శాతంగా ఉన్నారు. అయితే వీరి అధీనంలో విస్తారమైన భూములు ఉన్నాయి. మైదాన ప్రాంతాలలో ఉండే మెయితీలు రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్నారు వీరికి భూ వసతి తక్కువే అయినప్పటికీ మొదటి నుంచీ రాజకీయ అధికారం చెలాయిస్తున్న సామాజిక వర్గమిది. భూమి హక్కులతో పాటు రాజకీయ అధికారంలో అసమ ప్రాతినిధ్యం విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో ఆ ఘర్షణలు విషమించాయి. రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చెలాయిస్తున్న మెయితీలు తమకు షెడ్యూల్డు తెగ హోదా సాధించుకునేందుకు పూనుకున్నారు. తద్వారా కొండ ప్రాంతాలలోని భూములను తమ ఆర్థిక బలంతో కైవసం చేసుకోవచ్చనేది వారి ఆలోచన. మణిపూర్‌ హైకోర్టు 2023 ఏప్రిల్‌ 14న మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వానికి సూచించింది. మెయితీలకు ఎస్టీ హోదా లభిస్తే కొండ ప్రాంతాల భూములు సమస్తమూ వారి అధీనమవుతాయని తమకు మనుగడే కష్టమవుతుందని కుకీలు ఆందోళనకు గురయ్యారు.


తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు కుకీజోలు పోరాటపథం పట్టారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పూర్తిగా మెయితీ పక్షపాతం వహించారు. కుకీజోల అలజడిని నిర్లక్ష్యం చేశారు. పైగా వారిని నార్కో టెర్రరిస్ట్‌లు అని నిందించారు. దీంతో కుకీజోలు మే 3న ఒక బృహత్‌ నిరసన ప్రదర్శనకు ఉద్యుక్తులయ్యారు. మెయితీలు ప్రతిదాడులకు పూనుకున్నారు. హింస ప్రజ్వరిల్లింది. అది దావానలంలా రాష్ట్రమంతటా వ్యాపించింది. వందల మంది బలయ్యారు. వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రెండేళ్లు దాటినా ఆ హింసాగ్నులు ఇంకా పూర్తిగా ఆరనేలేదు.

మెయితీలు, కుకీజోలను దహించివేస్తున్న పరస్పర విద్వేషాగ్నులు మణిపురి సమాజాన్ని సైనికీకరణ చేశాయనడం సత్యదూరం కాదు. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎడతెగని మౌనమే పాటించింది. రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయిన సంక్షోభానికి కారకుడైన ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించేందుకు కూడా సంకల్పించలేదు. చివరకు పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయిన తరువాత బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో నిర్ణయించుకోలేకపోయిన మోదీ సర్కార్‌ రాష్ట్రపతి పాలనను విధించింది. అయినా పరిస్థితులు యథాతథంగా కొనసాగుతున్నాయి.

మెయితీలతో తమ సహజీవనం అసాధ్యమని, తమ ప్రాంతాలకు శాసన నిర్మాణ అధికారాలతో కేంద్ర పాలిత ప్రాంత హోదా నివ్వాలని కుకీజోలు డిమాండ్‌ చేస్తున్నారు. మెయితీలు, కుకీజోల మధ్య హింసాత్మక ఘర్షణలను నివారించేందుకు ఇరువర్గాల ప్రాంతాల మధ్య తటస్థ మండలాల నేర్పాటు చేసి వాటిని కేంద్ర భద్రతా బలగాల కాపలాలో ఉంచారు. దీనివల్ల మణిపూర్‌లో ప్రజల, సరుకుల రవాణా నిర్నిరోధంగా సాగడం అసాధ్యమైపోయింది. మరో సమస్య ఘర్షించుకుంటున్న సామాజిక వర్గాల సైనికీకరణ.


ఈ పరిస్థితులలో రెండు కీలక పరిణామాలు సంభవించాయి. అవి: కుకీజో మిలిటెంట్‌ గ్రూపులతో సస్పెన్షన్ ఆఫ్‌ ఆపరేషన్స్‌ ఒప్పందం పునరుద్ధరణ; జాతీయ హైవే–02ను ప్రజల, సరుకుల స్వేచ్ఛాయుత రవాణాను అనుమతించేందుకు కుకీజో గ్రూపుల నిర్ణయం. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడాలంటే కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలి. ఇది జరగాలంటే బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు విశాల దృక్ఫథంతో నిర్ణయాలు తీసుకోవల్సి ఉన్నది. ‘ఎట్టి పరిస్థితులలోను హింసాత్మక ఘర్షణలు మళ్లీ ప్రజ్వరిల్లకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉన్నది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించేవారు నాయకులే కారని’ నిక్కచ్చిగా చెప్పుతూ ‘ఒక కొత్త ఆరంభం మణిపూర్‌కు అవసరం’ అని ప్రజామేధావి ఒకరు వ్యాఖ్యనించారు. మణిపూర్‌లో ఒక కొత్త ఉదయం ఉదయించి, శాంతిసీమగా ఆ ఈశాన్య భారత రాష్ట్రం పునరుజ్జీవం పొందేందుకు ప్రధాని మోదీ పర్యటన నాంది అవ్వాలనేదే సమస్త భారతీయుల ఆకాంక్ష.

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 01:05 AM